అణువణువునా విజ్ఞానం - వినాయకుని వైభవం
అణువణువునా విజ్ఞానం వినాయకుని వైభవం
వినాయక చవితి అంటేనే ఓ వైభవోపేతమైన పండుగ కళ్ల ముందు మెదుల్తుంది. ఆనాటి పత్ర పూజలో దాగిన విజ్ఞానం గురించి తరచూ వింటూనే ఉంటాము. అలాగే చవితినాటి సంప్రదాయంలో దాగిన మరిన్ని విశేషాలలో కొన్ని ఇవిగో...
మట్టి గణపతి ఎందుకంటే! రాతి వినాయకుని పూజిస్తే జ్ఞానం, రాగి వినాయకుని పూజిస్తే ఐశ్వర్యం, వెండి విగ్రహంగా ఉన్న గణేశుని పూజిస్తే ఆయుష్షు, బంగారు వినాయకుని పూజిస్తే సంకల్పసిద్ధి లభిస్తాయట. కానీ మట్టితో చేసిన వినాయకుని ప్రతిమను పూజిస్తే సర్వమూ లభిస్తాయని గణేశ పురాణం చెబుతోంది. స్థిరమైన జ్ఞానానికి చిహ్నం రాయి. తేలికగా మార్పిడి చేసుకునే ధనానికి చిహ్నం రాగి (మన నాణేలన్నీ ఒకప్పుడు రాగిలోనే ఉండేవి కదా!). ఇక వెండిలో ఔషధి గుణాలున్నాయన్నది ఆయుర్వేదం చెబుతోంది. ఆశకు చిహ్నం బంగారం! అందుకనే ఆయా పదార్థాలతో గణపతిని పూజించేవారిలో, వాటిని అనుగుణమైన కోరికలు ఈడేరుతాయని దీని భావం కావచ్చు. కానీ మట్టి వీటన్నింటికంటే విశిష్టమైనది. జీవ నిర్జీవ రాశులన్నింటికీ ఈ పుడమి తల్లే ఆధారం. ఆ ప్రకృతికి ప్రతిరూపమైన మట్టికి తను కొలుచుకునే దేవుని రూపాన్ని ఇస్తాడు మనిషి. ఆ రూపాన్ని భక్తితో కొలిచి, ఘనంగా సేవించి, ధూపదీప నైవేద్యాలను అర్పించి తిరిగి ప్రకృతిలోనే కలిపేస్తాడు. అందుకనే ప్రకృతితో మమేకమవుతూ సాగే గణేశుని పూజలో మట్టి వినాయకుడు ఉండటం సహేతుకం.
పసుపు గణపతికి తొలి పూజ! వినాయక చవితితో సహా ప్రముఖంగా చేసుకునే పూజలు, శుభకార్యాలు అన్నింటిలోనూ ముందుగా పసుపు గణపతిని పూజించడం ఆనవాయితీ. పూజ నిర్విఘ్నంగా సాగాలనీ, ఏ ఆశయంతోనైతే ఆ కార్యాన్ని నిర్వహిస్తున్నామో అది నెరవేరాలని కోరుకుంటూ పసుపు గణపతికి తొలిపూజలు అందిస్తారు. భారతీయులకు తెలిసిన తొలి ఔషధం బహుశా పసుపే అయి ఉంటుంది. ఆహారానికి రుచినీ, ఆరోగ్యానికి శుచినీ అందించే పసుపుని ఆరాధించడంలో ఆశ్చర్యం ఏముంది. అందుకే అప్పటికప్పుడు వినాయకుని రూపొందించేందుకు బహుశా మన పెద్దలు పసుపునే సూచించి ఉంటారు!
అసలైన పిండివంటలు! వినాయకచవితి రోజున చేసుకునే పిండివంటలు ఏమిటంటే చటుక్కున ఉండ్రాళ్లు, కుడుములు అని చెప్పేస్తాం. వీటిని తయారుచేయడానికి ఎలాంటి మషాళా దినుసులూ అవసరం లేదు. నూనెలో వేయించాల్సిన పనిలేదు. ఆఖరికి కారం కూడా తగలదు. బియ్యపు రవ్వ, శనగలు, బెల్లం మాత్రం ఉంటే చాలు. శుభ్రంగా ఆవిరితో ఈ వంటకాలను వండేయవచ్చు. ఎలాంటి అజీర్ణ సమస్యలకీ భయపడకుండా శుభ్రంగా లాగించేయడానికి ఇంతకంటే గొప్ప పిండివంటలు ఏముంటాయి. పైగా బియ్యపురవ్వతో చేసే పదార్థాలు ఒంటికి చెడు చేయవని అందరూ ఒప్పుకునే మాటే కదా! బహుశా అందుకే భోజన ప్రియుడైన వినాయకుడు ఉండ్రాళ్లనని ఇష్టపడతాడేమో!
చవితినాటి చంద్రుడు! వినాయకుని పూజించకుండా ఆనాటి చంద్రుని చూస్తే నీలాపనిందలు భరించక తప్పదని పెద్దలు చెబుతుంటారు కదా! దీని వెనుక కూడా ఒక కారణం లేకపోలేదు. చంద్రుడు మనఃకారకుడు అని జ్యోతిషులు చెబుతుంటారు. చవితి నాటికి చంద్రుని ప్రభావం చాలా వ్యతిరేకంగా ఉంటుందని వారి భావన. చవితినాడు ఎటువంటి శుభకార్యాలనూ తలపెట్టరు. పైగా వినాయకచవితి నాటికి సూర్యుడు కూడా భూమికి చాలా దూరంగా తులా రాశిలో ఉంటాడు. కాబట్టి చంద్రుని మీద సూర్యుని కిరణాలు సైతం అంత చురుకుదనాన్ని కలిగించవు. వీటన్నింటి కారణంగా మానవుని మనసు మరింత వ్యాకులతతోనూ, అతని బుద్ధి మందగమనంగానూ ఉంటుంది. చిరాకుగా ఉన్న మనిషి తోటివారి మీద ఆ చిరాకుని చూపడం. నిందలు వేయడం, అసంబద్ధమైన ఆరోపణలు చేయడం వంటి పొరపాట్లు చేస్తాడు. వినాయక చవితినాడు సకల విఘ్నాలనూ తొలగించి, మనశ్శాంతిని కలిగించమని వేడుకునే భక్తునిలో... ఎలాంటి అపనిందనైనా, అపజయాన్నైనా ఎదుర్కొనే స్థైర్యం కలుగుతుంది.
- నిర్జర.