బుధవారం రోజు  ఈ పనులు చేస్తే వినాయకుడి అనుగ్రహం తథ్యం..!

 

 

బుధవారం రోజు  ఈ పనులు చేస్తే వినాయకుడి అనుగ్రహం తథ్యం..!

 


హిందూ క్యాలెండర్లో ఒక్కో వారానికి ఒక్కో ప్రత్యేకత ఉంది.  ఒక్కో దేవతకు ఒక్కో రోజు ముఖ్యమైనదిగా భావిస్తారు.  గ్రహాలకు వారంలో రోజులకు ఎలా  సంబంధం ఉందో.. అలాగే దేవతలకు కూడా ప్రత్యేక పూజలు అందుతాయి.  ఇక బుధవారం విషయానికి వస్తే ఈ రోజు వినాయకుడికి చాలా ముఖ్యమైన రోజని చెబుతారు. బుధవారం నాడు బుధుడికి కూడా ప్రత్యేకం అని చెబుతారు. బుధవారం రోజు కొన్ని పనులు చేస్తే వినాయకుడి ఆశీర్వాదం లభిస్తుందని చెబుతున్నారు.  ఏ కార్యం మొదలు పెట్టేముందు అయినా తొలి పూజ అందుకునేది వినాయకుడే.. వినాయకుడి అనుగ్రహం ఉంటే అన్ని కార్యాలు విజయవంతం కావడంతో పాటు  జీవితం సంతోషంగా ఉంటుందట.

బుధవారం రోజు ఉపవాసం ఉండాలి.  ఉపవాసం అంటే ఆహారం తీసుకోకుండా పస్తులు ఉండటం కాదు.. అంతకంటే ఎక్కువ రోజు మొత్తం వినాయకుడి నామ జపం,  ధ్యానం,  దైవ చింతన ఉండాలి.  ఏ దేవతకు అయినా ఉపవాసం ఆచరించే విధానం ఇదే.. ఇక బుధవారం ఉపవాసం ఉంటే వినాయకుడి అనుగ్రహం లభించడమే కాకుండా బుధ గ్రహంలో ఏదైనా దోషాలు ఉంటే అవన్నీ తగ్గుతాయని అంటున్నారు.

ఎవరికైనా జాతకంలో బుధ గ్రహం బలహీనంగా ఉంటే బుధవారం రోజు పచ్చి శనగలను పేదవారికి దానం చేయాలట. అలాగే నూలు వస్త్రాలను కూడా దానం చేయడం మంచిది.  ఇలా చేయడం వల్ల బుధగ్రహ దోషాలు తగ్గుతాయట.

ఆర్థిక సమస్యలు, అప్పులతో ఇబ్బంది పడుతున్నవారికి బుధవారం రోజు మంచి పరిష్కారం ఉంది. ప్రతి బుధవారం ఉపవాసం ఉండి వినాయకుడి సమక్షంలో కూర్చుని వినాయక స్త్రోత్రాన్ని పఠించాలి.  ఇలా చేస్తే ఆర్థిక బాధలు తగ్గుముఖం పడతాయి.

బుధవారం రోజు గణపతి ధ్యానం,  జపం చేయడం కూడా సానుకూల ఫలితాలు ఇస్తుంది.  ఇందుకోసం "ఓం గం గణపతయే నమః" అనే మంత్రాన్ని కానీ "శ్రీ గణేశాయ నమః" అనే  మంత్రాన్ని కానీ జపించాలి.  ఈ నామాన్ని 108 సార్లు.. అంతకంటే ఎక్కువ జపం చేయడం వల్ల మంచి ఫలితాలు చూస్తారు.

వినాయకుడు అనుగ్రహం ఉండాలంటే 21 బుధవారాలు  ప్రతి బుధవారం వినాయకుడికి గరిక సమర్పించాలి.  గరికను దుర్వా అని కూడా అంటారు.  ఈ గరిక అంటే వినాయకుడికి చాలా ప్రీతి.   ఇలా 21 బుధవారాలు సమర్పిస్తే జీవితంలో వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయని అంటారు.


                                                    *రూపశ్రీ.