Big Building in East
వాస్తులో తూర్పున పెద్ద బిల్డింగ్ ఉంటే...
Big Building in East
వాస్తు నియమాల్లో ఇంటి స్థలం ఎలా ఉంది, ముఖద్వారం ఎటువైపు ఉంది, తలుపులు, కిటికీలు ఎన్ని ఉన్నాయి, స్థలం రోడ్డు కంటే మెరకగా లేదా పల్లంగా ఉన్నదా తదితర అంశాలన్నీ గణనలోకి తీసుకుంటాం. ఈ అంశాలే కాకుండా ఇంటికి పక్కనున్న ఇళ్ళు ఎలా ఉన్నాయనేది కూడా పరిగణనలోకి వస్తుంది. వాస్తులో మన ఇంటికి చెందిన నియమాలు మాత్రమే కాదు, పక్కనున్న ఇళ్ళు, రోడ్లకు సంబంధించి కూడా కొన్ని సూత్రీకరణలు ఉన్నాయి.
వాస్తులో ఇంటి ఆకృతికి కొన్ని నిర్దేశాలు ఉన్నాయి. ఇల్లు చతురస్రంగా (Square) కానీ, దీర్ఘ చతురస్రంగా (Rectangle) కానీ ఉండాలి. అలాంటి ఇల్లు మాత్రమే శ్రేయస్కరం. కొన్ని ఇళ్లను చూస్తుంటాం.. ఒక క్రమపద్ధతిలో లేకుండా కొన్నిచోట్ల లోనికి చొచ్చుకురావడం, ఇంకొన్నిచోట్ల బయటకు పొడుచుకు రావడం, మూలలు వక్రంగా తోసుకుపోవడం లాంటి ఎగుడుదిగుడులు కనిపిస్తాయి. కొన్ని ఇళ్లలో ఒకటి కంటే ఎక్కువ వంకరలు కూడా ఉండటం కనిపిస్తుంది. ఇవన్నీ దోషాలే.
వాస్తు ప్రకారం ఇంటికి తూర్పు దిక్కునున్న నిర్మాణం మనదానికంటే పెద్దదిగా ఉంటే, అప్పుడు మనం ఏం చేయాలో చూద్దాం. తూర్పువైపున మన ఇంటికంటే పెద్ద భవనం గనుక ఉన్నట్లయితే మామూలు వాస్తు నియమాల ప్రకారం వదలాల్సిన ఖాళీస్థలం కంటే కనీసం అయిదు అడుగుల జాగాను అదనంగా వదలాలి. ఒకవేళ తూర్పున మాత్రమే గాక, పశ్చిమాన కూడా పెద్ద నిర్మాణమే ఉంటే... (తూర్పున ఉన్న భవనం అంత లేదా అంతకంటే పెద్దది అయిన నిర్మాణం) ఈ సూత్రం వర్తించదు. అంటే తూర్పు, పడమర – రెండు దిక్కులలోనూ మన ఇంటికంటే ఎత్తయిన భవనాలు ఉంటే దోషం లేదు. తూర్పున మాత్రమే ఉంటే, కొంత స్థలం వదలడం ద్వారా దోష నివారణ చేసుకోవచ్చు.
వాస్తు సవ్యంగా ఉండి, సత్ఫలితాలు రావాలంటే ముందుగా స్థలంలో ఎగుడుదిగుడులు లేకుండా, చతురస్రం లేదా, దీర్ఘ చతురస్రం ఆకృతిలో ఉన్న ఇళ్ళ స్థలాలను మాత్రమే కొనుగోలు చేయాలి. అలాంటి స్థలాల్లో కట్టిన ఇళ్లను మాత్రమే కొనుక్కోవాలి.
ఇంటికి ఈశాన్య దిక్కులో గది తప్పక ఉండాలి. అక్కడ ఖాళీగా ఉంచి "L” ఆకృతిలో ఇల్లు కట్టడం మంచిది కాదు. ఈశాన్య దిశలో ఉన్న గదిని పూజకు కేటాయించాలి. ఈశాన్య దిక్కున పొరపాటున కూడా బాత్రూం ఉండకూడదు.
ఇంటిచుట్టూ ఉండే ప్రహరీ గోడ ఇంటికి సరిహద్దును తెలియచేస్తూ రక్షణ ఇవ్వడమే కాదు, అందాన్ని ఇస్తుంది. ప్రహరీ గోడ లేకుంటే ఇల్లు సంపూర్ణంగా ఉన్నట్టు ఉండదు.
తూర్పువైపున మన ఇంటి కంటే పెద్ద బిల్డింగ్ కనుక ఉంటే మామూలుగా ఉండాల్సిన ఖాళీ స్థలం కంటే మరో 5 అడుగుల ఖాళీ స్థలం వదలాలి. ఈ నియమం మన ఇంటికి తూర్పువైపున మాత్రమే పెద్ద కట్టడం ఉన్నప్పుడు వర్తిస్తుంది.
అలాగే ఉత్తర దిక్కున మన ఇంటికంటే పెద్దదయిన భవనం ఉంటే తూర్పువైపున చెప్పినట్లే మామూలుగా వాస్తు నియమం ప్రకారం వదలాల్సిన జాగా కంటే అయిదు అడుగుల అదనపు స్థలాన్ని వదిలిపెట్టాలి.
ఉత్తరాన మన ఇంటి కంటే పెద్ద భవనం ఉన్నప్పుడు దక్షిణ నైరుతిలో ఉపగ్రహం నిర్మించాలి.
దక్షిణ ప్రహరీ గోడకి ఒక అరుగు కట్టాలి.
ఇంటికి దక్షిణాన రోడ్డు గనుక వచ్చినట్లయితే, సరిగ్గా ఈ నియమాలే వర్తిస్తాయి.
ఒకవేళ ఇంటికి దక్షిణాన గనుక ఉత్తరదిక్కున ఉన్న భవనంతో సమానమైన లేదా అంతకంటే పెద్దదైన భవనం ఉంటే అప్పుడు అదనపు ఖాళీ స్థలం వదలాల్సిన అవసరం లేదు.
ఒకవేళ తూర్పుదిక్కు మాదిరిగానే ఇంటికి పశ్చిమ దిక్కున కూడా తూర్పు వైపున ఉన్నంత లేదా అంతకంటే పెద్ద బిల్డింగ్ ఉంటే గనుక మామూలు కంటే ఇంకా 5 అడుగుల ఖాళీ జాగా వదలాలి అనే నియమం వర్తించదు.
Vastu east building, vastu impliments to side buildings, east big building 5 feet place, indian architecture and vastu rules, remedies for vastu