వరూధిని ఏకాదశి రోజు ఖచ్చితంగా వినాల్సిన వ్రత కథ!
వరూధిని ఏకాదశి రోజు ఖచ్చితంగా వినాల్సిన వ్రత కథ!
చైత్రమాస కృష్ణపక్ష ఏకాదశికి వరూధిని ఏకాదశి అని పేరు.. ఈ ఏకాదశినే చైత్ర బహుళ ఏకాదశి అని కూడా అంటారు. చాలా మందికి 24 ఏకాదశుల గురించి, వాటి ప్రత్యేకత గురించి, అవి చేకూర్చే ప్రయోజనాల గురించి అస్సలు తెలియదు. ముఖ్యంగా పరాభవ నామ సంవత్సరంలో వచ్చే చైత్ర మాస కృష్ణపక్ష ఏకాదశి గురించి పూర్తీగా తెలియదు. ఏకాదశి ఉపవాసం ఉండకపోయినా, వ్రతం ఆచరించలేకపోయినా, కనీసం ఏకాదశి వ్రత కథ వినడం లేదా పారాయణ చేయడం వల్ల కూడా భయాలు నశిస్తాయని, సర్వ శుభాలు చేకూరతాయని అంటారు. వరూధిని ఏకాదశి వ్రత మహత్యాన్ని తెలిపే కథ గురించి తెలుసుకుంటే..
ఏకాదశి వ్రతాల గురించి, వ్రత ప్రయోజనాలు, విశిష్టత, వ్రత విధానాలు.. మొదలైన వాటి గురించి సాక్షాత్తు శ్రీ కృష్ణ భగవానుడే ధర్మరాజుకు చెప్పాడని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఏకాదశి వ్రతం అనేది.. స్వయానా భగవంతుడే భక్తులకు సూచించిన శక్తివంతమైన వ్రతం.
వరూధిని ఏకాదశి..
పద్మపురాణం ప్రకారం.. నర్మదా నదీ తీరంలో మాంధాత అనే రాజు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయన అలా తపస్సు చేసుకుంటూ ఉంటే.. ఒక రోజు ఒక ఎలుగుబంటి అటువైపు వచ్చి రాజును చూసింది. అది వెంటనే రాజు కాలును నోటిలో కరుచుకుని కొరకడం ప్రారంభించింది. అది ఎంత కొరుకుతున్నా రాజు మాత్రం దాన్ని ఏమీ అనలేదు.. పైగా తను తపస్సు చేసుకుంటూనే ఉన్నాడు. కొంత సమయం తర్వాత ఆ ఎలుగుబంటి రాజు కాలును పట్టుకుని అడవిలోకి లాక్కుపోయింది. పైగా ఆ ఎలుగుబంటి రాజు కాలును మరింతగా నములుతూ కాలును చాలా వరకు తినసాగింది. ఆ బాధ భరించలేక మాంధాత రాజు విష్ణుమూర్తిని ప్రార్థించాడు.
మాంధాత రాజు భాధను విన్న విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆ ఎలుగుబంటిని సంహరించాడు. కానీ.. అప్పటికే మాంధాత రాజు కాలు చాలా వరకు ఎలుగుబంటి తినేసింది. అప్పుడు విష్ణుమూర్తి మాంధాత రాజుతో.. రాజా.. ఏం జరిగినా ఇదంతా నీ పూర్వ జన్మ కర్మల వల్లనే జరుగుతుంది. నువ్వు వరూధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించు, అలా చేస్తే నువ్వు కోల్పోయినవన్నీ తిరిగి పొందగలుగుతావు అని చెబుతాడు.
విష్ణుమూర్తి చెప్పింది విన్న తర్వాత మాంధాత రాజు తన రాజ్యానికి వెళ్లి వరూధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. దాంతో రాజు తన శరీరాన్ని తిరిగి ధృఢంగా పొందగలిగాడట, కోల్పోయిన ఆయన కాలు కూడా తిరిగి వచ్చిందట. భయంతో సతమతమయ్యేవాడు వరూధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల భయాన్ని అధిగమించి, భయం అనే పదాన్నే మర్చిపోతాడట.
వరూధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించినా, ఉపవాసం ఉన్నా, కనీసం వ్రత మహత్య కథను విన్నా సరే.. ఎనలేని పుణ్యం కలుగుతుందట. 10వేల సంవత్సరాల తపస్సు చేసినంత ఫలితం ఈ వరూధిని ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల లభిస్తుంది,ల అలాగే కోటి గోవులను దానం చేసినంత పుణ్యం కూడా లభిస్తుంది. అలాగే నియమ నిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కోల్పోయిన వాటిని కూడా తిరిగి పొందగలుగుతారని చెబుతారు. కాబట్టి వరూధిని ఏకాదశిని అస్సలు మిస్ కాకూడదు.
*రూపశ్రీ.