కాశీ కబుర్లు – 10
కాశీ కబుర్లు – 10
విశ్వనాధ ఆలయం
ఈ అవధానాలన్నీ చేసుకుంటూ, దోవ అడుగుతూ మొత్తానికి చేరాం కాశీ విశ్వనాధుని ఆలయం...ఎన్నాళ్ళనుంచో చూడాలని తపించిన ఆలయం...అతి పురాతన నగరంలోని విశ్వ విఖ్యాతి చెందిన ఆ విశ్వేశ్వరుని ఆలయం దగ్గరకు చేరుకున్నాం. ఇక్కడ విశ్వనాధ ఆలయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము.
వారణాసి హిందువులందరికి పరమ పావన క్షేత్రం కదా. అందుకే భక్తుల రద్దీ కూడా ఎక్కువే. ఇక్కడ విశ్వేశ్వరాలయంలోని శివలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. స్వయంగా ఇక్కడ శివుడు కొలువైయున్నాడని హిందువుల నమ్మకం. గంగా స్నానం వల్ల సకల పాపాలు పరిహారమై ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. అష్టాదశ శక్తి పీఠాలలో కాశీ కూడా ఒకటి. దక్షయాగంలో ఆత్మార్పణం చేసిన సతీదేవి చెవిపోగు పడిన చోట ఇప్పుడు విశాలాక్షి మందిరం. ఆదిశంకరుడు తన బ్రహ్మసూత్ర భాష్యాన్ని, భజ గోవింద స్తోత్రాన్ని కాశీలో రచించాడంటారు. ఇక్కడ విశ్వనాధుని ఆలయమేకాక చరిత్రలో వివిద కాలాల్లో నిర్మించబడ్డ ఆలయాలు అనేకం ఉన్నాయి. ఇంకా ప్రతీ వీధిలోనూ ఒక ఆలయాన్ని దర్శించవచ్చు. చిన్న ఆలయాల్లో కూడా నిత్య పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి.
విశ్వనాధుని పురాతన ఆలయం అనేక దండయాత్రలలో ధ్వంసం కాగా తర్వాత ప్రస్తుతం వున్న ఆలయం నిర్మింపబడింది. ఈ ఆలయం మొదట వున్న ఆలయం స్ధలంలోకాక కొంచెం పక్కగా వున్నదంటారు. ప్రస్తుతం ఉన్న మందిరాన్ని 1780లో ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ కట్టించింది.
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశ్వేశ్వర లింగ దర్శనం తక్కిన లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రదమని భక్తుల విశ్వాసం. 1839లో పంజాబ్ కేసరిగా పేరొందిన మహారాజా రంజిత్ సింగ్ ఈ ఆలయం రెండు గోపురాలకు బంగారపు పూత పూయించడానికి సరిపడా బంగారం సమర్పించాడు. విశ్వనాధుని ఆలయ గోపురంపైన పూసిన బంగారు పూత వుంటుంది. అందుకే దీనిని "బంగారు మందిరం" అని కూడా అంటారు.
1983 జనవరి28న ఈ మందిరం నిర్వహణా బాధ్యతలను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం హస్తగతం చేసుకొని అప్పటి కాశీ రాజు డా. విభూతి నారాయణ సింగ్ అధ్వర్యంలోని ఒక ట్రస్టుకు అప్పగించింది.
ఇంక మిగతా విషయాలకి వస్తే విశ్వనాధ ఆలయం సమీపంలో కనీసం రెండు చోట్ల సెక్యూరిటీ చెక్ వుంటుంది. సెల్ ఫోన్లు, కెమేరాలు తీసుకెళ్తే తప్పనిసరిగా బయట షాపులో లాకర్ లో పెట్టి వెళ్ళాలి, అలా పెడితే ధ్యాస వాటిమీదే వుంటుంది, అవి తీసుకెళ్ళద్దని మాకు హైదరాబాదులోనే సలహాలొచ్చాయి. సలహాని పాటించి, ఇచ్చినందుకు వారికి, పాటించినందుకు మాకు శబాష్ చెప్పుకున్నాం. పెన్నులు కూడా తీసుకెళ్ళద్దు. మా పిన్నికి సెంటిమెంట్ వున్న ఒక పెన్ను లోపలకి తీసుకువెళ్ళనియ్యకుండా సెక్యూరిటీ వారి దగ్గర పెట్టుకుని తర్వాత ఇవ్వలేదు. పిన్ని ఒక పెన్ను చూసి తనదేమోనని చూడబోతుంటే, ఎప్పుడు పెట్టారు అని అడిగింది సెక్యూరిటీ లేడీ. చెబితే, ఇది మీదికాదు, అప్పుడు నేను లేను, ఎవరికిచ్చావో వాళ్ళనే అడుగు, దిక్కున్న చోట చెప్పుకో పో టైపులో మాట్లాడింది చాలా దురుసుగా. సెక్యూరిటీ వాళ్ళు డ్యూటీలు మారుతూ వుంటారుగా, ఎవరికిస్తే వాళ్ళనే అడగాలంటే ఎలా? పైగా కొత్త వూళ్లో కొత్త మనుష్యులని గుర్తు పెట్టుకోవటం కష్టంకదా! ఆ స్ధలంలో వున్న సెక్యూరిటీ వాళ్ళు అని గుర్తుపెట్టుకుంటారుగానీ, వాళ్ళ మొహాలు, వాళ్ళ పేర్లు ఎంతమందికి గుర్తుంటాయి.
ఈ చెక్ లు దాటుకుని వెళ్తే విశ్వనాధుని ఆలయం. నా ఖ్యాతే విశ్వవిఖ్యాతి చెందిందిగానీ, నే వుండే స్ధలం మాత్రం ఇంతే అనే అమాయకుడు శివయ్య. గుడి చిన్నదే. పైగా విశ్వనాధుడుగనుక ఆ కొంచెం స్ధలంలోనే ఉపాలయాలకి కూడా చోటిచ్చాడు.
బయట క్యూ వున్నా లోపలకెళ్ళే సమయంలో బల పరీక్ష తప్పదు. మీకేమన్నా రూల్స్ పాటించాలనే నియమాలుంటే తీసి గట్టున పెట్టండి. మేము పాటిస్తాము అంటే, మీ దోవ మీదేగానీ, వేరేవారిని పాటించమని చెప్పకండి. అప్పుడు మిగిలేది చికాకే.
బయట ప్రాకారమే చిన్నదనుకుంటే, ఆలయం మరీ చిన్నది. అందులో ఒక మూలకి ఒదిగి వుంటాడు పరమేశ్వరుడు గొప్పవారు ఎలా వుంటారో చెబుతున్నాడు అన్నట్లు. మేము తీసుకెళ్ళిన గంగ నీరు శివయ్యకి అభిషేకం చేసి తాకి నమస్కారం చేసుకున్నాము. మొత్తానికి ఆ తోపులాటనుంచి బయటపడి ప్రక్కనే వున్న ఇంకొక శివాలయంలో (ఉపాలయం) కూడా నమస్కరించి బయట పది నిముషాలు కూర్చున్నాము. ఆ పది నిముషాలు కూడా రేపు చేయించబోయే అభిషేకం గురించి అక్కడ మహారాష్ట్ర బ్రాహ్మణునితో మాట్లాడటానికి తప్పనిసరిగా ఆగవలసి వచ్చింది కనుక వుండనిచ్చారు. ప్రదేశం చిన్నదవటంతో లోపల ఎక్కువసేపు కూర్చోనివ్వరు. లోపల కూడా సెక్యూరిటీ చాలా వున్నది. సాధన చేసేవారు, ధ్యానం చేసుకునేవారు ఈ గుళ్ళో చాలా ఎక్కువ వైబ్రేషన్స్ అనుభవించగలరు.
ఆలయం ముందు, వెనక ప్రదేశాలన్నీ చూడండి. చిన్న చిన్న ఆలయాలు చాలా వుంటాయి. ఇంకొన్ని కబుర్లు వచ్చే వారం చెప్పుకుందాం.
.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)