కాశీ యాత్ర – 9
కాశీ యాత్ర – 9
మరి కొన్ని ఘాట్ లు, గంగాస్నానం
ఈ కింది ఘాట్ లన్నీ మేము దిగి చూడలేదు కానీ, నేను తర్వాత సేకరించిన వివరాలు మీకోసం ఇస్తున్నాను. సిండియా ఘాట్ ఈ ఘాట్ నిర్మించి 150 సంవత్సరాలయింది. ఈ ఘాట్ బరువుకు ఇక్కడి శివాలయం కొంచెం నీళ్ళల్లోకి ఒరిగినట్లుంటుంది. పడవలో వెళ్తూ కూడా ఈ ఆలయాన్ని మనం చూడచ్చు. ఇది అగ్ని దేవుని జన్మ స్థలమని పురాణ కధనం. మగ సంతానం కావాలని కోరేవారు ఇక్కడ వీరేశ్వరుని అర్చిస్తారు. సిండియా ఘాట్‌కు ఉత్తరాన మణికర్ణికా ఘాట్ ఉంది. వెనుక ప్రక్క సిద్ధక్షేత్రంలో అనేక ముఖ్యమైన అలయాలున్నాయి.
మన మందిర్ ఘాట్
1770లో జైపూర్ రాజు మహారాజా జైసింగ్ మన మందిర్ ఘాట్‌ను, ఇక్కడి యాత్రా మందిరాన్ని నిర్మింపజేశాడు. యాత్రా మందిరం నిర్మాణం రాజస్థాన్-ఢిల్లీ శైలిలో ఉంటుంది. ఇక్కడ భక్తులు సోమేశ్వరుని అర్చిస్తారు.
లలితా ఘాట్
దీని నిర్మాత నేపాల్ రాజు. ఇక్కడ నేపాలీ శైలిలో చెక్కతో నిర్మించిన గంగా కేశవ మందిరం ఉంది. ఈ విష్ణ్వాలయంలో పాశుపతేశ్వరస్వామి విగ్రహం ఉంది.
అస్సీ ఘాట్
ఇక్కడ వున్న అందమైన ఘాట్ లలో ఇది కూడా ఒకటి అంటారు. అన్ని ఘాట్‌లకు చివర ఉంది. ఇది ఫొటోగ్రాఫర్లు, చిత్రకారులు, వాద్య బృందకారులతో కోలాహలంగా ఉంటుంది.
ఇవికాక అంబర్ రాజు మాన్‌సింగ్ మానస-సరోవర్ ఘాట్‌ను, దర్భంగా మహారాజు దర్భంగా ఘాట్‌ను నిర్మింపజేశారు.
బచరాజ్ ఘాట్‌ను ఎక్కువగా జైన భక్తులు సందర్శిస్తారు. అక్కడ నది వడ్డున మూడు జైనాలయాలున్నాయి.
తులసీ ఘాట్ వద్ద గోస్వామి తులసీదాసు రామచరిత మానస్ ని రచించాడు.
ఘాట్ లు గురించి చెప్పాను కదా. ఇప్పుడు గంగా స్నానం....
గంగా స్నానం
ఉదయం 5 గం. కల్లా గంగాస్నానానికి బయల్దేరాము. సుప్రసిధ్ధ దశాశ్వమేధ ఘాట్ కి పది నిముషాల నడక. గంగ ఒడ్డుకి చేరాం. ఈ ఒడ్డున జనం ఎక్కువ వున్నారు. బోటు వాళ్ళ హడావిడి. గంగ మధ్యలో ఇసుక మేట వేసి వుంది. కొంతమంది బోట్ లో అక్కడదాకా వెళ్ళి అక్కడ స్నానం చేస్తున్నారు. ఈ గందరగోళంలోకన్నా మధ్యదాకా వెళ్ళి అక్కడ స్నానం చేద్దామనిపించింది. బోటులో అక్కడ దాకా తీసుకెళ్ళి, దగ్గర దగ్గర ఒక గంట అక్కడ ఆగి, తిరిగి ఈ ఒడ్డుకి చేర్చటానికి మనిషికి 20 రూపాయలు తీసుకున్నాడు . అక్కడ కూడా నీళ్ళు కలుషితంగానే అనిపించాయి. కానీ ఆ బోటు అతను, మా సత్రం లోను చెప్పారు నీళ్ళు అలా కనిపించినా చాలా స్వఛ్ఛమైనవి, చేతిలోకి తీసుకుని చూడండి. దేన్లోనన్నా పట్టి చూడండి ఏమైనా వైరస్ వగైరా వుంటుందేమో చెక్ చేసుకోండి అని నీళ్ళు మంచివని ఘట్టిగా చెప్పారు. ఏదైనా ఇంత దూరం వచ్చి గంగ స్నానం చెయ్యకుండానా....సెంటిమెంటొకటి. సరే స్నానం చేశాం.
ఇక్కడ బయల్దేరేముందన్నారు..పెద్ద నదుల్లో స్నానం చేసేటప్పుడ ఆ చీరె నదిలో వదిలి పెట్టాలని. మా పెద్దవాళ్ళెవరూ చెప్పకపోయినా చేస్తే పోలా అనిపించి ఆ పనీ చేశాం. చక్కగా పడవతను అన్నీ తీసుకుని దాచుకున్నాడు. పోనీలే ఎవరికో ఒకరికి ఉపయోగపడతాయని సంతోషించాం. అక్కడ ఫోటోగ్రాఫర్ రెడీగా వున్నాడు. ఘాట్ కూడా వచ్చేటట్లు ఫోటో తీసి కాపీ వెంటనే ఇచ్చేస్తానన్నాడు. ఒక్కో ఫోటోకి 20 రూపాయలు. తీయించుకున్నాం. ఖాళీ బాటిల్స్ తీసుకెళ్ళి గంగ నీరు నింపుకుని అక్కడనుండీ విశ్వనాధుని గుడికి బయల్దేరాము.
పడవ దిగి ఘాట్ లో మెట్లన్నీ ఎక్కి పైకి వచ్చేసరికి కొంచెం అలసట అనిపించింది. దోవలో వేడి వేడి పాలు తాగి విశ్వనాధుని ఆలయానిక నడక మొదలు పెట్టాము. చిన్న చిన్న సందులు, అనేక మెలికలు తిరిగిన దోవలు, దోవలో పశువుల పేడలు .. సందుల్లో అటూ ఇటూ వున్న దుకాణాలే చూస్తామా, మధ్యలో తగిలే చిన్న చిన్న ఆలయాలే చూస్తామా, రోడ్డు మీద పేడే చూస్తామా .. అవధానాలు చేసేవాళ్ళకు కాశీ రోడ్లల్లో నడక తేలికేమోగానీ, మనలాంటి వాళ్ళకి .. అమ్మో .. చాలా జాగ్రత్తగా వుండాలి.
.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)