కాశీ యాత్ర -11 పూజా కార్యక్రమాలు
కాశీ యాత్ర -11
పూజా కార్యక్రమాలు
కాశీ గురించిగానీ, కాశీలో దేనిగురించిగానీ విమర్శించకూడదు, అలా విమర్శిస్తే శివునికి కోపకారకులమవుతామంటారు. నేను చూసింది చూసినట్లు చెబితే ఇది చదివి వెళ్ళేవాళ్ళు జాగ్రత్త పడతారు అనే వుద్దేశ్యంతో నేను వివరంగా చెబుతున్నాను.
కాశీ విశ్వనాధుని ఆలయం చిన్నదనీ, అందులో గర్భ గుడి ఇంకా చిన్నదనీ చెప్పానుకదా. గర్భగుడికి నాలుగు వైపులా ద్వారాలు. రెండు ద్వారాలు లోపలకి వెళ్ళటానికి, రెండు ద్వారాలు బయటకి రావటానికే కాదు, అస్మదీయులు, పూజారులు తీసుకుని వచ్చే అభిషేకం చేసుకునేవారు లోపలకు వెళ్ళటానికి కూడా వుపయోగ పడతాయి. గర్భగుడి షుమారు 10 x 10 వైశాల్యం వుంటుంది. గర్భ గుడిలో ఒక మూలకి వున్నట్లు వుంటుంది లింగం. దాదాపు నేలకి సమానంగా, చతురస్రాకారం, మధ్యలో గుంట, అందులో లింగం. గుమ్మందాకా క్యూ వుంటుందిగానీ గుమ్మందగ్గరనుంచి బలవంతులదే రాజ్యం.
తెల్లవారుఝామున 3 గంటలనుంచి 4 గంటలదాకా హారతి వుంటుంది. దీనికి టికెట్ వుంది. 4 గంటలనుంచీ రాత్రి 11 గంటలదాకా అభిషేకాలు, దర్శనం వుంటుంది. భక్తులందరూ జిల్లేడు పూల మాలలు, మారేడు దళాలు, పూలు, అభీషేక ద్రవ్యాలు తీసుకువచ్చి స్వహస్తాలతో స్వామికి సమర్పిస్తారు. అక్కడ పూజారి వుండి ఆయన ద్వారా పూజలు జరగటం వుండదు. మనం తీసుకెళ్ళిన ద్రవ్యాలను మనమే స్వామికి స్వయంగా సమర్పించవచ్చు, స్వామిని తాకి నమస్కరించవచ్చు. (ఇప్పుడు అడ్డు కట్టారు, లింగాన్ని తాకటానికి లేదు అన్నారు .. మార్పులు సహజం కదా .. అభిషేకం సమయంలో తాకవచ్చేమో కనుక్కోండి) అభిషేకం కూడా మనం తీసుకెళ్ళిన నీళ్ళో, పాలో, స్వామికి స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. ఆ తోపుడులో మీ మనసులో మీరనుకున్నదే మంత్రం.
అదే పూజారి ద్వారా వెళ్తే 501 రూ. చెల్లించాలి. అవసరమైన ద్రవ్యాలు వాళ్ళే ఇస్తారు. లోపల ఖాళీ వుంటే కూర్చుని అభిషేకం చెయ్యవచ్చు. లేదంటే బయటే సంకల్పం చెప్పి లోపల రెండు నిముషాలలో పూజారిచ్చిన ద్రవ్యాలు స్వామికి సమర్పించి బయటపడాలి. మనం ఏ ద్రవ్యాలతో పూజ చేస్తున్నామో కూడా తెలుసుకునేంత తెరిపి వుండదు.
మేము రెండు సార్లు అభిషేకం చేయించాము. ఒకసారి మహారాష్ట్ర బ్రాహ్మణుడు. లోపల రష్ గా వుందని బయట ఆవరణలోనే కూర్చోబెట్టి రుద్రం చదివి, తర్వాత లోపల 2 నిముషాలు చేయించారు. అక్కడ మాకు తృప్తిగా లేదనుకున్నారేమో, విశాలాక్షి అమ్మవారి దగ్గర శ్రీ చక్రానికి కూడా ఆయనే శ్రీ సూక్తంతో యధావిధిగా కుంకుమ పూజ చేయించారు. దాని సంగతి తర్వాత చెబుతాను.
రెండవసారి తెలుగు పురోహితుల ద్వారా అభిషేకానికి ఏర్పాటు చేసుకున్నాము. ఆ రోజూ విపరీతమైన జనం వున్నారు. బయట ఏమీ పెద్దగా చేయించలేదు. లోపల తోపులాటలో ఏం చేయించారో తెలియలేదు. చాలా అసంతృప్తిగా అనిపించింది.
నా అనుభవం ద్వారా తెలుసుకున్నదేమిటంటే పూజారుల ద్వారా పూజలని సమయం వృధా చేసుకునే బదులు ప్రశాంతంగా దైవనామ స్మరణ చేస్తే మనశ్శాంతి అనే నిర్ణయానికొచ్చేశాము.
కిందటేడు ఇదే సమయంలో మా వాళ్ళెళ్ళొచ్చారు. వాళ్ళు తెల్లవారుఝామున 4 గంటల కెళ్తే కూర్చుని అభిషేకం చేసుకున్నామన్నారుగానీ మేము వెళ్ళినప్పుడు ఆ సమయంలోకూడా జనం ఎక్కువగానే వున్నారు.
కాశీ పవిత్ర క్షేత్రమనే భావన ప్రతి భారతీయుని నర నరాన జీర్ణించుకు పోతుంది కనుక ఈ అసంతృప్తులన్నీ గంగా ప్రవాహంలో గడ్డిపోచలాగా కొట్టుకుపోనిచ్చి మనసు భగవంతుని మీద కేంద్రీకరించగలిగితే అదృష్టవంతులం.
విశ్వనాధుని ఆలయంలో, చుట్టుపక్కల సెక్యూరిటీ చాలా ఎక్కువ అని చెప్పాను కదా. అందుకే మనలాంటివారికెవరికీ ఫోటోలు తీసే అవకాశం లేదు.
.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)