సాక్షాత్తు పరమశివుడే చెప్పిన భక్తి రకాలు!!

 

సాక్షాత్తు పరమశివుడే చెప్పిన భక్తి రకాలు!!

భక్తిలో రకాలు కూడా ఉంటాయా అనిపిస్తుంది కానీ నిజానికి సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే భక్తిలో ఉన్న రకాలను  పార్వతీ దేవికి వివరించాడని పురాణ కథనం ఉంది. ఆ మాటలకు లిఖిత రూపమే ఈ సారాంశం. 

భక్తికీ జ్ఞానానికీ అట్టే భేదం లేదు. కాని రెండింటిలో భక్తే ఒక విధంగా గొప్పదిగా చెప్పకోవలసి వస్తుంది. జ్ఞానంవల్ల - ఐహికం అర్ధరహితమౌతుంది. భక్తులకు మాత్రం పరంతో కలిసి ఐహిక సుఖం కూడా క్రమంగా అనుభవం లోకి వస్తుంది. . నామట్టుకు నేను జ్ఞానులకన్నా కూడా భక్తులనే ముందుగా అనుగ్రహిస్తాను, జాతి, కుల వివక్షత లేకుండా వారి వారి ఇళ్లలో నివసిస్తాను వారివారి ఇష్టాలను, కోర్కెలను తీరుస్తాను. అయితే నన్ను పూజిస్తున్న విధానాన్ని బట్టి, వాళ్ళు పాటించే నియమాలను బట్టి ఈ భక్తి తొమ్మిది రకాలుగా ఉంది. 

1. శ్రవణం :- ఇతరుల ద్వారా నాగురించి వినడం. శివపురాణం కావచ్చు, కార్తీక పురాణం కావచ్చు, నా గురించి లోకంలో ఉన్న ఏ కథలైనా కావచ్చు. వాటిని ఇతరులు చెబుతున్నప్పుడు వినడమే ఈ భక్తి. 

2. కీర్తనం:- తనకు తానై నన్ను స్తుతించడం. స్తోత్రాలు, పాటలు, కీర్తనలు, భజనలు.  మొదలైన వాటి ద్వారా నన్ను ఎప్పుడూ తలచుకుంటూ ఉండటం.

3. స్మరణం:- ఎప్పుడూ నన్నే తలపులో వుంచుకోవడం, నామజపం చేయడం. 

4. సేవనం:- రోజుకు ఐదు సార్లు  నన్ను తమతమ మాటల్లో తలచుకుంటూ, స్వయంగా వారే నన్ను పూజించడం.

 5. దాస్యం:- నేను తప్ప వేరే ఏదీ సత్యం కాదని  భావించి నా సేవ తప్ప వేరే ఏమి పెట్టకుండా ఎప్పుడూ నాకు ఇష్టమైన పనులు చేస్తూ నాకు దగ్గరగా ఉండటం.

6. అర్చన:- తగిన సమయాలలో అర్ఘ్యపాద్యాది షోడశోపచారాలతో నన్ను పూజించడం. దీనికి పూలు, పండ్లు, మంత్రాలు వంటివి అవసరం.

7. వందనం:- నా మంత్రోచ్చారణతో నా ధ్యానంతో మనో వాక్కాయశుద్ధిగా- వక్షం, శిరసు, నేత్రాలు, మనస్సు, వాక్కు, పాదములు, హస్తములు, కర్ణములు ఇవన్నీ భూమికి తాకే విధంగా నాకు ఆచరించే నమస్కారమే వందనం. ఇదే సాష్టాంగ నమస్కారం. 

8. సఖ్యం:- ఏది జరిగినా అది తన మేలుకోసమే అనుకుని, ఆ పని నావల్ల జరిపించబడినట్లు భావించడం సఖ్యం. ఇందులో అన్నిటికి ఆ పరమేశ్వరుడే అనే భావం ఉంటుంది. 

9. ఆత్మార్పణం:- నేను తప్ప మరేదీ హృదయంలో వుంచుకోకుండా ఈ శరీరంగాని, మరొకటి గాని నావి అనే భావన ఉంచుకోకుండా శరీరం కోసం, శరీర కోర్కెల కోసం, తిండి కోసం ఆశ పడకుండా  భారం నామీద పెట్టి ఆ జీవితాన్ని నేనే ఇచ్చానని ఇష్టంగా కొనసాగించడమే ఆత్మార్పణం.

ఈ తొమ్మిది రకాల భక్తిలో దేన్నీ అనుసరించాలి అనే అనుమానం వస్తుందేమో. కానీ వీటిలో ఏది అనుసరించినా నాకు సంతోషమే. బిల్వపత్రి, రుద్రాభిషేకం, అభిషేకాలు వంటివన్నీ ఉన్నాయి అవన్నీ వేరే.  ఏదిఏమైనా భక్తి ప్రధానం భక్తి లేనపుడు ఆ మనిషిలో ఎంత జ్ఞానం ఉన్నా అది వ్యర్థమే. ఎందుకూ పనికిరాకుండా పోతుంది. అదే దేవుడిమేధ నమ్మకంతో కలిగే భక్తి ఎలాంటి వారికి అయినా మోక్షానికి అర్హతను ఇస్తుంది. ఈ సృష్టిలో కూడా భక్తి ఒక్కటే గొప్ప మార్గం.  మరీ ముఖ్యంగా కలియుగంలో భక్తికి వున్న ప్రాధాన్యత మరి దేనికి వుండదు. కలియుగంలో జ్ఞానవైరాగ్యాలు ముసలితనం పొందుతాయి. అందువల్ల అవి యెక్కువగా వుపయోగపడకపోవచ్చు.

భక్తులే నా సంపద, నాస్థితి, నాగతి.  భక్తుడి కోసం యమధర్మరాజునే కాల్చివేశాను నేను. కాబట్టి జ్ఞానులకంటే భక్తులనే నేను ఇష్టపడతాను. సతీపతి అన్నది భక్తులు పిలిచే పిలుపేగాని నిజానికి నేను భక్తులకు భక్తుణ్ణి అని శివుడు చెప్పాడు శివుడు. 

◆ వెంకటేష్ పువ్వాడ