అద్భుత ఫలితాలను ఇచ్చే రుద్రాభిషేక వైభవం!!
అద్భుత ఫలితాలను ఇచ్చే రుద్రాభిషేక వైభవం!!
శక్తిని బట్టే ముక్తి కూడా. అంటే అర్థం మనం చేసే పనిని బట్టే మనకు కూడా పలితం ఉంటుంది అని. జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురావుతూ ఉంటాయి. వాటికి పరిష్కారాల కోసం ఎన్నో పూజలు, వ్రతాలు చేస్తుంటారు, అలాగే కొందరు జ్యోతిష్కులను, పండితులను కలసి సమస్యలు సమసిపోవడానికి మార్గాలు అడుగుతూ ఉంటారు. అయితే ఇవన్నీ చేయడం మంచిదే. కానీ కార్తీక, మాఘ, శ్రావణ వంటి రత్యేక మాసాలలో ఆ దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడం ఎంతో మంచిది. వాళ్ళు ఎంతో సంతోషించి సమస్యల పరిష్కారానికి దారులు చూపిస్తారు. అలా పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకునే మార్గమే రుద్రాభిషేకం. రుద్రాభిషేకం వల్ల సకల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని పండితులు, జ్యోతిష్కులు చెబుతారు.
పండితుడు నుంచి పామరుడు వరకు, మహా చక్రవర్తి నుంచి కటిక పేదవాడి వరకు ఎవరైనా సరే ఆ పరమేశ్వరుడిని శివ అని స్మరిస్తే చాలు కరుణ కురిపించే విశాల హృదయం ఆ శివుడిది. ఏడాది మొత్తంలో శివుడికి దేశ వ్యాప్తంగా అన్నిచోట్లా పూజలు జరిగేది కార్తీక, మాఘ మాసాలలోనే. ఆ రెండు మాసాలలో శివుడికి జరిగే పూజలు, అభిషేకాల వైభవం గురించి మాటల్లో చెప్పలేం. అభిషేకాలు అంటే ఎంతో ఇష్టమైన పరమేశ్వరుడు తనకు అభిషేకాలు చేయించే భక్తులను నీడలా కాపాడతాడని చెబుతారు. ఇంకొక విషయం ఏమిటంటే ఈ మాసాలలో ఎవరూ అభిషేకాలు చేయించకపోయినా, ప్రధానదేవాలయాల ఆధ్వర్యంలోనే గుడి పూజారులు అభిషేకాలు నిర్వహిస్తారు. ఎందుకు అంటే ఏ ఊరిలో అయినా శివాలయంలో శివలింగం చల్లగా ఉంటే ఆ ఊరు కూడా బాగుంటుందని, సమస్యల నుండి బయటపడుతుందని నమ్మకం.
అయితే శివుడికి అభిషేకాలు చేస్తుంటాం. పూజరితో మాట్లాడి చేయించేస్తాం. అయితే అభిషేకాలు ఎన్నిరకాలు అనేది చాలా కొద్దిమందికి మాత్రమే తెలిసి ఉంటుంది. మరికొందరు అయితే అభిషేకాల విఆహాయంలో పూజారులు మోసం చేస్తారని ఏదేదో అంటుంటారు. అందుకే అభిషేకాలు ఎలా చేస్తారు?? అభిషేకాన్ని బట్టి దానికి కావలసిన పదార్థాలు, మంత్రాల ప్రస్తావన వంటి వాటిని బట్టి రుద్రాభిషేకాలలో రకాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే ఎంతో మంచిది కూడా.
రుద్రాభిషేకాలు ఎనిమిది రకాలు. మన కోరికలు తీరడానికి ఏ పధార్థాలతో, పుష్పాలతో ఏ రుద్రాభిషేకం నిర్వహిస్తే మంచిదో చదివితే తెలుస్తుంది.
రుద్రం అంటే నమకాలు -11, చమకాలు-11 అనువాకాలుగా ( 11 వరుసలు. ) సాధారణంగా రుద్రాభిషేకం అంటే 11 నమకాలను, 11/1 చమకాన్ని చెప్పితే ఒక అభిషేకంగా, సాధారణంగా ఇంట్లో చిన్నపాటి శివలింగాన్ని, లేదా స్పటికలింగాన్ని పెట్టుకుని చేసుకునేవారు పద్ధతి ఇది.
ఇక అసలు అభిషేకం అంటే సంప్రదాయ పరంగా గుడిలో పూజారులు చేసే రుద్రాభిషేకాలను పరిశీలిస్తే…
వారాభిషేకం- నమకం 11 అనువాకాలను చెప్పి చమకంలో ఒక్కొక్క అనువాకం చొప్పున చెబుతారు. ఆ విధంగా నమకం 11 సార్లు (11X11) చెప్పి, చమకం 11 అనువాకాలకు పూర్తిచేస్తారు. (నమకం 11సార్లు, చమకం 1 సారి) దీన్ని వారాభిషేకం అంటారు.
ఆవృత్తి – నమకం 121 సార్లు, చమకం 11 సార్లు చెప్పితే ఆ రుద్రాభిషేకాన్ని ఆవృత్తి అంటారు.
రుద్రం- నమకం 121 సార్లు, చమకం – 11 సార్లు చెబుతూ చేసే రుద్రాభిషేకాన్ని రుద్రం అంటారు.
ఏకాదశ రుద్రం- నమకం 14,641 సార్లు, చమకం-1331 సార్లు చెబుతూ జరిపే రుద్రాభిషేకాన్ని ఏకాదశ రుద్రం అంటారు.
శతరుద్రం- నమకం 1,61,051 సార్లు,చమకం 14,641 సార్లు చెబుతూ చేసే రుద్రాభిషేకాన్ని శతరుద్రం అంటారు
లఘురుద్రం- నమకం 17,71,561 సార్లు, చమకం- 1,61,051 సార్లు చెబుతూ చేసే రుద్రాభిషేకాన్ని లఘురుద్రం అంటారు.
మహారుద్రం- నమకం 1,94,87,171 సార్లు, చమకం- 17,71,561 సార్లు చెబుతూ చేసే రుద్రాభిషేకాన్ని మహారుద్రం అంటారు.
అతిరుద్రం- నమకం 21,43,58,881 సార్లు, చమకం -1,94,87,171 సార్లు చెబుతూ చేసే రుద్రాభిషేకాన్ని అతిరుద్రం అంటారు.
ఇలా 8 రకాలుగా రుద్రాభిషేకాలను చేస్తారు. ఈ రుద్రాభిషేకాలు నమక చమకాల సంఖ్య పెరిగే విధానాన్ని బట్టి వాటి పేర్లు మారతాయి. ఇన్ని సంఖ్యలలో నమక చమకాల ఉచ్చారణ జరగాలి అంటే ఎంతో ఓపిక మరెంతో సమయం పడుతుంది కాబట్టే ఈ రుద్రాభిషేకాలకు ఇంత ప్రాధాన్యత వచ్చింది. పైగా ఆ పరమేశ్వరుడు కూడా రుద్రాభిషేకాలకు ఎంతో సంతోషిస్తాడు.
◆ వెంకటేష్ పువ్వాడ