శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఈ వస్తువులను సమర్పించకూడదట..!
శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఈ వస్తువులను సమర్పించకూడదట..!
దేవతలకే దేవుడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడిని భోళా శంకరుడు అని పిలుస్తారు. ఈయనను తృప్తి పరచడానికి పెద్ద పెద్ద పూజలు అవసరం లేదు. మనస్ఫూర్తిగా దోసెడు నీరు పోసి కాసింత వీభూతి, బిల్వదళాలు సమర్పించుకుంటే చాలు. సోమవారం శివుడికి చాలా ప్రత్యేకం అంటారు. ప్రతి రోజూ ప్రదోష కాలంలో శివలింగార్ఛన, శివపార్వతుల పూజ చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని, పాపాలు తొలగిపోతాయని అంటారు. అయితే శివుడికి అభిషేకం చేసేటప్పుడు సమర్పించే వస్తువుల విషయంలో కొన్ని నియమాలు ఉన్నాయి. కొన్నింటికి సమర్పించడం వల్ల ఈశ్వర కృపకు బదులుగా ఈశ్వరుడి ఆగ్రహానికి గురవుతామని పండితులు చెబుతున్నారు. శివలింగానికి పూజ చేసేటప్పుడు సమర్పించకూడనివి ఏంటో తెలుసుకుంటే..
తులసి..
తులసి మొక్క విష్ణువుకు అత్యంత ప్రియమైనది. దీనిని విష్ణు ప్రియ అని కూడా అంటారు. ఇది మాత్రమే కాకుండా తులసి మొక్కను కూడా చాలా పవిత్రంగా భావిస్తారు. కానీ తులసిని శివలింగానికి సమర్పించకూడదట. తులసిని లక్ష్మీ దేవి అవతారంగా భావిస్తారు, ఆమె శంఖచూడు అనే రాక్షసుడికి వరం ఇచ్చింది. శంఖచూడుని శివుడు తన త్రిశూలంతో చంపాడు కాబట్టి శివుని పూజలో తులసిని వాడకూడదు అని చెబుతారు.
మొగలిపువ్వు..
పూజలో పువ్వులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పువ్వులు దేవునికి అర్పిస్తారు, కానీ మొగలి రేకులు లేదా పువ్వులను పువ్వులను శివుడికి లేదా శివలింగానికి ఎప్పుడూ సమర్పించకూడదు. దీని వెనుక పురాణం కథనం ఉంది. ఒకప్పుడు బ్రహ్మ దేవుడు శివుడికి అబద్ధం చెప్పి మొగలి పువ్వును సాక్షిగా చేసాడు. శివుడు నిజం తెలుసుకుని మొగలి పుష్పాలను తన పూజ నుండి నిషేధించాడు.
కుంకుమ..
శివుడికి కుంకుమ సమర్పించకూడదు. శివుడికి విభూతి అంటే ఇష్టం. ఆయన శరీరం మొత్తం భస్మాన్ని పూసుకుంటాడు. అందుకే శివుడి చిత్ర పటం లేదా శివలింగానికి గంధం పెట్టి గంధం మీద విభూతి పెడతారు. కుంకుమను ఎప్పుడూ పొరపాటున కూడా పెట్టకూడదు.
*రూపశ్రీ