త్రయంబకం గౌతమీతటే

 

 

త్రయంబకం గౌతమీతటే


       శివరాత్రి పుణ్యకాలంలో శివుని లీలలు  గురించి తెలుసుకోడం , శివాభిషేకం , పంచాక్షరీ మంత్రాన్ని జపించడం మనకు అనాదిగా వస్తున్న ఆచారం . దాన్ని కొనసాగిస్తూ యివాళ " త్రయంబకేశ్వరం " గురించి తెలుసు కుందాం .

       మహారాష్ట్ర లోని నాసిక్ జిల్లాలో నాసిక్ నగరానికి సుమారు 28 కిలో మీటర్లదూరంలో వుంది త్రయంబకేశ్వరం . ఈ వూరు  వేద అధ్యయనం వృత్తిగా స్వీకరించిన అధిక బ్రాహ్మణకుటుంబాలు గల వూరని చెప్పడంలో అతిశయోక్తి లేదు . ఈనాటికి యిక్కడ వేద గురుకుల పాఠశాలలు , అష్టాదశ యోగ సాధనా ఆశ్రమాలు , మఠాలు వున్నాయి .

       నాసిక్ , త్రయంబకం ప్రదేశాలు సత్యయుగమునకు చెందినవని మన పురాణాలలో వివరించేరు  . ద్వాపరయుగం లో శ్రీరాముడు , సీతా లక్ష్మణ సమేతుడై నివసించిన పంచవటి నాసిక్ నగరానికి 3,4 కిలోమీటర్ల దూరంలో వుంది .  లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసిన ప్రదేశం , రావణాసురుడు సీతను అపహరించుకు పోయిన ప్రదేశం కూడా యిదే .   

         రామభక్త హానుమాన్ గా పేరుపొందిన ఆంజనేయుని జన్మస్థలం నాసిక్ నగరం నుంచి త్రయంబకం వెళ్లే దారిలో త్రయంబకానికి ఆరు కిలోమీటర్ల ముందు వచ్చే అంజనేరి గ్రామం .

         త్రయంబకం లో వున్న త్రయంబకేశ్వరుడు జ్యోతిర్లింగం . జ్యోతిర్లింగంలో శివుడు అగ్ని రూపంలో కొలువై వుంటాడు . దీనికి ఆధారంగా సత్యయుగములో బ్రహ్మ విష్ణువులకు ఒకానొక సమయంలో యెవరుగొప్ప అనే విషయమై వాదనచెలరేగగా శివుడు తనఆది అంతములను తెలుసుకొమ్మని యెవరైతే తెలుసుకుంటారో వారే గొప్పని చెప్పి తాను ఆదీఅంతములేని జ్వలితస్థంభము వలె అవతరిస్తాడు . ఆది తెలుసుకొనేందుకు విష్ణుమూర్తి వరహములు వలె భూమిని దొలచి పాతాళము యింకా కిందకుచేరుకొని కూడా ఆది కానరాక వెనుతిరుగుతాడు .

బ్రహ్మ అంతం తెలుసుకొనేందుకు పక్షి అవతారము దాల్చి పైకి పైకి అంతరిక్షమనకు చేరుకొని అంతము కానరాక అసత్య మాడదలచి కేతకి పుష్పమును  రుజువునకై తనకూడా తీసుకొని వస్తాడు . విష్ణుమూర్తి తాను ఆది తెలుసుకొనలేదని సత్యము పలుకగా బ్రహ్మ తాను అంతము కనుగొంటినని దానికి కేతకి పుష్పం సాక్షమని అసత్యము పలుకుతాడు . అందుకు ఆగ్రహించిన శివుడు బ్రహ్మకు భూలోకంలో పూజలందుకునే అర్హత లేకుండునట్లు శపించి విష్ణుమూర్తి కి శివునితో సమానంగా పూజార్హతను కలుగజేస్తాడు . ఆది అంతము లేని అనంతమయిన జ్వలితలింగమే జ్యోతిర్లింగము . విష్ణుమూర్తి కోరిక మేరకు భూలోకంలో 64 ప్రదేశాలలో జ్యోతిర్లింగంగా శివుడు అవతరించినట్లుగా  శివపురాణం లో వుంది . వాటిలో పన్నెండింటిని ముఖ్యమైనవిగా ఆదిశంకరులు గుర్తించేరు . వాటిని మనం ద్వాదశ జ్యోతిర్లింగాలని పిలుస్తున్నాం .

 

 

         శహ్యాద్రి పర్వతశ్రేణులలోని బ్రహ్మగిరి పర్వత పాదాలదగ్గర వున్న పురాతనమైన మందిరం త్రయంబకేశ్వరం . ఎందరో రాజులచేత నిర్మింపబడి క్షతికి గురై ప్రస్తుతం వున్న నల్లరాతి కట్టడం పేష్వా బాలాజీ బాజీరావు  ( నాన్నా సాహెబ్ ) ద్వారా నిర్మింపబడింది . చుట్టూరా ప్రహారీ గోడతో పెద్ద పెద్ద తలుపులతో ముఖ్యద్వారం , లోనికి వెళితే లోపల విశాలమైనప్రాకారం అందులో శివలింగాలు , సోమరసం నుంచి వచ్చే అభిషేక తీర్థం వచ్చే ప్రదేశం , స్థలవృక్షం , మందిరం నమూనా , మూలవిరాట్టు నమూనాలు వుంటాయి . స్థలవృక్షం పక్కనుంచి వెళ్లేటట్టుగా క్యూ ని నియంత్రించేరు . ఈ మందిరాన్ని మేము మొదటిసారి 1979 లో దర్శించుకున్నాం తరవాత ఆ ఈశ్వరుని కృప వల్ల లెక్కకు మించిన సార్లు దర్శించుకొనే అవకాశం లభించింది . యేటికేడాది  భక్తుల రాక పెరగడం దాంతోపాటు గ్రామం   అంచలంచలుగా పెరగడం చూసేం , గత కొన్ని సంత్సరాలుగా క్యూ దారి యేర్పరచి , భక్తులను ముందుగా మందిరానికి వెలుపల వున్న నంది మండపాన్ని దర్శించుకొని నందికి తెల్లని పుష్పాలతో పూజించుకున్న తరువాత పెద్ద పెద్ద రాతి మెట్లు యెక్కి సభా మంటపం లోనికి ప్రవేశంచేటట్టుగా యేర్పరచేరు . .

సభా మంటపం చక్కని శిల్ప సంపదకలిగిన రాతి స్థంభాలతో నిర్మింపబడింది . సభా మండపంలో వివిధ శాంతిపూజలు జరుగుతూ వుండడం కనిపిస్తుంది . అభిషేక వేళలలో తప్ప మిగతా సమయాలలో వెండి ముఖాలంకరణలో శివుడిని దర్శనం లభిస్తుంది . గతకొద్ది సంవత్సరాలుగా ఆడవారికి గర్భగుడిలోకి ప్రవేశం రద్దుచేసేరు . అంతకముందు లోనికి వెళ్లి శివలింగాన్ని చేత్తో తాకి లింగానికి సదా అభిషేకం చేసుకొనే గోదావరి నీటిని తలపై జల్లుకున్న అనుభవం వుంది . ఇప్పుడు రద్దీ తక్కువ వున్నప్పుడు మన వయసువారిని లోనికి అనుమతించడం వుంది . మొగవారు పంచకట్టుకుని వచ్చిన వారిని శివలింగానికి స్వయంగా అభిషేకం చేసుకోడానికి అనుమతిస్తారు . దర్శనానంతరం సభామంటపం లో వున్న పాలరాయి తాబేలుని పూజించుకొని బయటకి వస్తాం .


 

        అక్కడ బిల్వ చెట్టు కోవెల పుష్కరిణి లను దర్శించుకొని చిన్న తలుపు గుండా బయటకి వెళితే అక్కడ ప్రవహిస్తున్న గోదావరి ని చూడొచ్చు . అక్కడవున్న లక్ష్మీనారాయణ మందిరం , గోపాలకృష్ణ మందిరం చూసుకొని గాయత్రీదేవి స్వయంభూ విగ్రహం దర్శించుకొని బయటకి వస్తే గోశాలమీదుగా బజారులోంచి ముఖ్యద్వారం చేరుకుంటాము . రద్దీ తక్కువగా వున్న రోజులలో తిరిగి మందిరంలోనికి వెళ్లి మృత్యుంజయ లింగం మొదలయిన లింగాలను దర్శించుకొని ముఖ్యద్వారం గుండా బయటకి రావొచ్చు .

       ప్రతీ సోమవారం మధ్యాహ్నం జరిగే అభిషేకానంతరం నాలుగు నుంచి ఐదు గంటలవరకు వెండి తొడుగుకు  వజ్రాలు , పచ్చలు , కెంపులు పొదిగిన బంగారు కిరీటాన్ని అలంకరిస్తారు . ఈ కిరీటం త్రేతాయుగంలో పాండవులు స్వామివారకి సమర్పించుకున్న కానుక . ఇక్కడ మరో వజ్రం గురించి చెప్పుకోవాలి . దీనిని ' నాసక్ వజ్రం ' అని వ్యవహరిస్తారు . ఈ వజ్రం త్రయంబకేశ్వరునకు చెందినది . సుమారు 15 వ శతాబ్దం లో తెలంగాణాకు చెందిన మహబూబ్ నగర్ లో దొరికింది . దీని బరువు సుమారు 90 కేరట్లు , ఫ్లాలెస్ నీలిరంగు వజ్రం , ప్రిన్స్ కట్ దీనిని అప్పటిరాజులు ( పేరు లభించలేదు ) త్రయంబకేశ్వరునకు కానుకగా యిచ్చేరు .

        మూడో ఆంగ్లో - మరాఠా యుధ్దానంతరము ఆంగ్లేయులతో చేసుకున్న ఒడంబడిక మేరకు యీ నసక్ వజ్రం ఆంగ్లేయుల చేతిలోకి అక్కడనుండి ఇంగ్లాండు చేరుకుంది .

        త్రయంబకేశ్వరుని దర్శనానంతరం దక్షిణగంగగా పిలువబడే గోదావరి పుట్టిన చోటికి వెళ్లే దారిమీదుగా బ్రహ్మగిరి చేరుకొని కొండపై నున్న గోవు ముఖాన్ని అందులోంచి బొట్టు బొట్టుగా పడే గోదావరిని దర్శించుకోవచ్చు . కొండదారి యెత్తైన మెట్లు , బ్రహ్మగిరి పైన యెప్పుడూ చినుకులు పడుతూనే వుండటం వల్ల పాకు పట్టి జారుడుగా వుండి దారి కష్టంగానే వుంటుంది . మరాఠీలు , గుజరాతీలు మాత్రం యీ కొండను యెక్కి గోదావరి పుట్టిన ప్రదేశాన్ని సందర్శించు కుంటున్నారు . వర్షాకాలంలో ఈ యాత్రను మూసివేస్తున్నారు . మేం 1979 లో బ్రహ్మగిరి యెక్కి గోముఖాన్ని దర్శించుకున్నాం . తరవాత యెక్కే సాహసం చెయ్యలేదు .

   త్రయంబకేశ్వరం , గోదావరి లను గురించి పురాణాలలో వివరించబడ్డ కథ యీవిధంగా చెప్పబడింది .

     ఆ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి .

    సత్యయుగంలో ఈప్రాంతం లో గౌతమముని ఆశ్రమం వుండేది . ఒకానొక సమయంలో భరతఖండం లో యిరవైనాలుగు సంవత్సరాలుగా వర్షాలులేక కఱువు తాండవమాడసాగింది . ఎక్కడా పంటలులేక త్రాగు నీరులేక ప్రజలు , పశువులు అలమటించసాగేయి . గౌతమ మహర్షి చేసిన పుణ్యము వలన అతని ఆశ్రమంలో మాత్రం వర్షాలు పడేవి . విషయం తెలుసుకున్న మునులు ఋషులు తమతమ పరివారాలను పశువులనూ తీసుకొని గౌతమ ముని ఆశ్రమంలో వుండసాగేరు . గౌతమ ముని వరుణుని సహాయమతో పొద్దున్న విత్తులు నాటి మద్యాహ్నమునకు పంట కోసి అథిధులకు ఆకలి తీర్చి మరింతపుణ్యము పొందసాగెను . అతని పుణ్యము వలన తన యింద్రపదవికి ముప్పు వచ్చునేమో అనే సందేహముతో యింద్రుడు వరుణుని భరతఖండమంతటా వర్షాలుకురిపంచ వలసిందిగా ఆజ్ఞాపిస్తాడు . అయిననూ మునులూ , ఋషులూ గౌతముని ఆశ్రమములో వుండసాగిరి . ఇంద్రుడు ఒక మాయా గోవును సృష్టించి గౌతముని పంటను నాశనము చేయవలసినదిగా ఆజ్ఞాపిస్తాడు . మాయా గోవు పంటను నాశనము చేయుట సహించని గౌతముడు గోవును దర్భతో అదిలించగా గోవు మరణిస్తుంది . గోహత్యాపాతకం చుట్టుకున్న గౌతముని ఆథిధ్యం స్వీకరింపలేమని మునులు , ఋషులు ఆశ్రమాన్ని విడిచి పెట్టి వెడలిపోతారు . గౌతముడు గోహత్యా దోష పరిహారార్ధం శివుని కొరకై ఘోర తపస్సుచేసి శివుని ప్రసన్నుని చేసుకొని పాపవిముక్తుడిని చేయవలసినదిగా వేడుకొనగా శివుడు గంగను విడిచి పెట్టేందుకు జడ విప్పుతాడు . గౌతముని పై అలిగిన గంగ దేవలోకానికి వెడలిపోతుంది . ఆగ్రహించిన శివుడు రుద్రతాండవమాడుతూ బ్రహ్మగిరి చేరి తనజడను బ్రహ్మగిరి పై విసిరి కొడతాడు . శివుని వుగ్రరూపానికి భయపడ్డ గంగ శివుని జడతగిలిన ప్రదేశంలో ప్రత్యక్షమైంది . కాని గౌతముడు స్నానమాచరించి పాపవిముక్తుడగుటకు సహకరించదు . అతని నుండి తప్పించుకొనుటకై గంగాద్వార్ , వరాహతీర్థం , రామలక్ష్మణ తీర్ధం , గంగాసాగర్ తీర్ధం మొదలయిన చోట్ల పత్యక్షౌతుంది . గౌతముడు అక్కడకు చేరేసరికి గంగ మాయం కాసాగింది . అప్పుడు గౌతముడు గడ్డిపరకలతో వృత్తాకారము యేర్పరచి ఆ వృత్తములో గంగను బంధంచి అక్కడ స్నానం చేసి గోహత్యాపాతకం పోగట్టుకుంటాడు . దీనిని కుశ తీర్థము అని అంటారు . సింహగ్రస్థ కుంభమేళా స్నానాలు యీ కుశ తీర్థం లో చేసుకోడం అనాదిగా హిందువులు ఆచరిస్తున్న విధి .

          గోదావరి యీ కుశ తీర్థమునుండి ప్రవహించి రాజమండ్రి దగ్గర బంగాళాఖాతం లో కలిసేంత వరకు వేల యెకరాలలో ప్రవహించి వేల యెకరాల పంటభూములకు సాగునీటిని అందించి , కోట్లాది ప్రజల అవసరాలను తీరుస్తోంది .

     గౌతముని వలన వచ్చింది కాబట్టి గోదావరిని గౌతమి అని కూడా అంటారు .

            గౌతమ మహర్షి శివుని కొరకై తపస్సు చేసుకున్న ప్రదేశం లోనే కోవెల నిర్మింప బడింది .

       ఈ కోవెలలో ముఖ్యంగా కాలసర్పశాంతి , మృత్యుంజయ హోమం , త్రిపిండి విధి , నారాయణనాగబలి పూజలు జరుపుతారు . నారాయణ నాగబలి పూజ  యీమందిరంలో మాత్రమే నిర్వహిస్తున్నారు . ఈ పూజ మూడురోజులు నిర్వహిస్తారు . అనారోగ్య సమస్యలు , గృహశాంతి , వంశాభివృధ్దికి , నాగదోష నివారణార్ధం యీ పూజ చేయించుకుంటారు .

     నాసిక్ నగరంలో చూడదగ్గ ప్రదేశాలు కుశతీర్థం , గోదావరి మాత మందిరం , కపాలేశ్వర మందిరం పంచవటి , సీతాదేవి గుహ , గోరారామ మందిరం , కాలారామ మందిరం ముఖ్యంగా చూడతగ్గవి .

...Karranagalaksmi