విగ్రహం లేని శివునికి శివరాత్రి ఉత్సవాలు!

 

 

విగ్రహం లేని శివునికి శివరాత్రి ఉత్సవాలు!


ఆ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినదే కాని గర్భగుడిలో దేముడి విగ్రహం ఉండదు. అయినా నిత్య ఆరాధన, విశేష పూజలు, నైవేద్యాలు అన్నీ జరుగుతాయి. ఎక్కడ ఉంది ఇలాంటి వింత ఆలయం అనుకుంటున్నారా. ఈ ఆలయం తమిళనాడులోని పుదుకోట్టాయ్ లో ఉంది. దీనిని అవుడయర్ కోయిల్ అంటారు. ఇక్కడి శివుడిని ఆత్మానంద స్వామి అని పిలుస్తారు. మన శరీరంలో ఉండే ఆత్మ ఎలాగయితే కనపడదో ఇక్కడి శివుని విగ్రహం కూడా అలాగే కనపడదు. ఆత్మ కళ్ళకి కనపడదని మనం ఆత్మని నమ్మటం మానం కదా అలాగే ఇక్కడ విగ్రహం కనపడకపోయినా ఆత్మస్వరూపుడైన శివునికి నిత్యం పూజలు జరుగుతూనె ఉంటాయి.

ఈ ఆలయాన్ని 8 వ శతాబ్దంలో మనికవసాగర్ అనే నయనారు కట్టించారని ప్రతీతి. ఇక్కడ అన్ని ఆలయాలలోలాగా శివుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉండడు , ధ్వజస్తంభం కనపడదు, చండికేస్వరుడు కూడా కనపడడు. ఇక్కడి అమ్మవారిని యోగంబాల్ అని అంటారు అయితే ఈ అమ్మవారు కూడా మనకి విగ్రహ రూపంలో దర్సనమీయరు.

ఇక్కడి ఆలయంలోని పైగోడపై పంచభూతాలని చెక్కారు. నవగ్రహాలకి మండపం లేదు గాని ఈ నవగ్రహాలని మనం ఇక్కడ ఉన్న స్తంభాలపై చూడచ్చు. ఎక్కడా లేని విధంగా 27 నక్షత్రాలకి విగ్రహరూపాలని  కూడా ఇక్కడి ఆలయంలో మనం చూడచ్చు. త్యాగరాజ సన్నిధిలో ఉన్న రాతి చైనులు, పంజస్తర  మండపంలోని సప్తస్వర స్తంభాలు ఇక్కడ చూడదగ్గవి. శిల్పకళా అణువణువునా పొంగిపొరలే ఈ ఆలయం దర్శించుకుంటే ఎంతో తృప్తిగా ఉంటుంది.

ఇక్కడి స్వామి ఆత్మనందుడు బ్రహ్మదేమునికి గాయత్రీ మంత్రాన్ని ఈ సన్నిధిలోనే ఉపదేశించాడని ప్రతీతి. విగ్రహం లేకపోయినా నైవేద్యం పెట్టె అన్నం ఆవిరినే శివుడిగా కొలిచే ఇలాంటి ఆలయం ఇంకోటి ఉంటుందా అని ఆశ్చర్యం వేస్తుంది. ఈ ఆలయంలో జరిగే శివాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి.

..కళ్యాణి