ఎవరిని ప్రేమించాలి

 

ఎవరిని ప్రేమించాలి ? 

               


ఎంతో చిన్న ప్రశ్న. కానీ..దీనికి జవాబు చెప్పడం చాలా జఠిలం...అని అనుకుంటాం. ఎంత మాత్రం కాదు. అయితే ఈ చిన్న ప్రశ్నకు జవాబు చెప్పేముందు ఒక విషయాన్నిపరిశీలించాలి. అసలు ‘ప్రేమ’ అంటే ఏమిటి  ? స్వార్థరహితమైనది ‘ప్రేమ’. ఏ విధమైన ప్రలోభాలకు, వ్యామోహాలకు తావు లేకుండా అభిమానించడం ‘ప్రేమ’. అటువంటి వ్యక్తి కోసం అంకితమైపోవడం ‘ప్రేమ’.

తల్లిదండ్రులు ... పిల్లలను ప్రేమిస్తారు. తమ పిల్లలను ప్రేమించినట్లుగా, మరొకరి    పిల్లలను ఎందుకు ప్రేమించరు? ఇక్కడ ‘నా పిల్లలు’ అనే స్వార్థం ఉంది. ఇదే విధంగా పిల్లలు, బంధువులు కూడా. అంతేకాక, నేటి కాలంలో ఏవో వ్యక్తిగత స్వార్థాల కోసం పిల్లలను అమ్ముకుంటున్న, చంపుకుంటున్న తల్లిదండ్రులను చూస్తున్నాం. కడుపులో ఉన్న పసిపిల్లలను కడుపులోనే చంపేస్తున్న తల్లులను చూస్తున్నాం. అలాగే, ఆస్తుల కోసం అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకోవడం చూస్తున్నాం. ప్రేయసి కోసం లేక ప్రియుని కోసం కని, పెంచిన తల్లిదండ్రుల ప్రేమను కాదని వెళ్లిపోతున్న కొడుకులను, కూతుళ్ళను చూస్తున్నాం. అంతెందుకు.., తనను ప్రేమించలేదని  తను ప్రేమించిన అమ్మాయి గొంతు కోసి చంపుతున్న కిరాతక ప్రేమికులను చూస్తున్నాం. ఇదంతా నిజమైన ‘ప్రేమ’ అనగలమా? అలాఅని ఈ బంధుత్వ సంబంధాలన్నీ అబద్ధమనీ.., అసహజమనీ నేను అనను. ఎవరో కొందరు స్వార్థంతో ఈ అనుబంధాలకు మసిపూసినంత మాత్రాన ఇవన్నీ ప్రేమరహితమైనవి అనడం తప్పు. అలాఅని ఇదే నిజమైన ‘ప్రేమ’ అని మాత్రం అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే... చిన్నతనంలో మనకు లాలిపోసి, తలదువ్వి, పాలుపట్టి సేవలు చేసిన తల్లే ఒక వయసు వచ్చాక ఆ పనులు చెయ్యదు. అలాగే తండ్రి కూడా. అలాఅని వారికి ‘ప్రేమ’ లేనట్టు కాదు. ఆ ప్రేమకు ఆయా సందర్భానుసారంగా కొన్ని పరిథులుంటాయి. ఈ ‘ప్రేమ’లన్నీ శరీర సంబంధమైనవి. శరీరం నశిస్తే... ఈ ప్రేమలు నశించి పోతాయి. నిజమైన ‘ప్రేమ’కు పరిధులు, ఎల్లలు, నశింపు ఉండవు. అది విశ్వవ్యాప్తం., అనంతం., అజరామరం.  అలాంటి ‘ప్రేమ’ను వర్షించే వ్యక్తిని ప్రేమించాలి..అతని చేత ప్రేమంచబడాలి. అప్పుడే ప్రేమ పరిమళం.., రుచి మనం ఆస్వాదించ గలుగుతాం., ఆనందించ గలుగుతాం. మరి అలాంటి ‘ప్రేమ’ను వర్షించే వ్యక్తి ఉన్నారా? ఉంటే..ఎవరు? అని అడిగితే.....
 
                వేటాడితే... ఖడ్గమృగాన్ని వేటాడాలి...
                ప్రేమిస్తే... భగవంతుని ప్రేమించాలి....


అని అంటాడు ‘స్వామి వివేకానంద’. నిజమే. భగవంతుని ‘ప్రేమ’కు పరిధులు కానీ., ఎల్లలు కానీ., నశి్ంపూ కానీ ఉండవు. ఆయన అపార ప్రేమరసా స్వరూపుడు. ఆయన ప్రేమ స్వరూపుడు కనుకనే ఇంతటి సృష్టి సంపదను అనుభవించమని మనకు అందించాడు. ఇందులో ఆయనకు ఏ స్వార్థమూ లేదు.
- మన ఆనందంలో...ఆయన ఆనందాన్ని చూసుకుంటాడు.
- మన సంతోషంలో...ఆయన సంతోషాన్ని దాచుకుంటాడు.
నిజానికి ఈ సమస్త సృష్టి చైతన్యానికి అధిపతి అయిన ఆ భగవంతునకు ఎంత అహం ఉండాలి.. ఎంత పొగరు, గర్వం ఉండాలి. పాపం..అవేవీ ఆయనలో కనిపించవు.. ఒక్క ‘ప్రేమ’ తప్ప. అందుకే ఆయన అంటాడు..
   
          ‘యే యథా మాం ప్రపద్యంతే - తాం తథైవ భజామ్యహం’

‘ఎవరెవరు ఏ ఏ విధంగా నన్ను తెలియగోరతారో వారిని ఆయా విధంగానే అనుగ్రహిస్తాను.’ అంటాడు. మీరు నక్కలా చూడాలనుకుంటే నక్కలా.. కుక్కలా చూడాలనుకుంటే కుక్కలా వస్తాడు. అంతటి శక్తిసంపన్నుడైన భగవంతునకు.. ఎందుకూ పనికిరాని మనలాంటి వారిదగ్గర ఇంతలా రాజీ పడడానికీ, తగ్గి ఉండడానికీ కారణం ఏమిటి అని ఎవరైనా అడిగితే.. అందుకు సమాధానం ‘ప్రేమ’ ఒక్కటే. ఇందుకు ఋజువు ఏమిటి అని మీరు అడిగితే...ప్రహ్లాదుడు, ధ్రువుడు, మార్కండేయుడు, సక్కుబాయి, మీరాబాయి.. ఇలా ఎందరో...మరెందరో ఉన్నారు.

 


- ‘ఎక్కడరా..నువ్వు ప్రేమించే..,నిన్ను ప్రేమించే ఆ శ్రీ హరి’ అని హిరణ్యకశిపుడు గద్దించి అడిగితే..‘ఆయన సర్వాంతర్యామి’ అని అంటాడు ప్రహ్లాదుడు. నిండా పదేళ్ళు అయినా నిండని ఆ బాలుని మాటలు సత్యం చేయడం కోసం ఈ సృష్టి అణువణువునా నరసింహునిలా నిండిపోయాడు, ఒదిగిపోయాడు, రాజీపడిపోయాడు ఆ పరమాత్మ.

 

 

- ‘ఈ తల్లి ఒడి, తండ్రి ఒడి అశాశ్వతం. నిత్యమూ, సత్యమూ, శాశ్వతమూ అయిన ఒడి ఆ పరమాత్మదేరా’ అని తల్లి చెప్పిన మాటలకు ఐదేళ్ళ ప్రాయంలోనే అడవి దారి పట్టి, తన తపస్సుతో  తనను మెప్పించిన ఆ పసివానికి దాసుడైపోయాడు ఆ పరమాత్మ. ఆ బాలుని ఓ ‘క్షితి మండలానికే’ అధిపతిని చేసి ఆ క్షితి మండలానికి ‘ధ్రువక్షితి మండలం’ అని ఆ బాలుని పేరే పట్టాడు. ఇదీ ఆ భగవంతుని ‘ప్రేమ’. ఇంతటి ‘ప్రేమ స్వరూపుని’ ఎవరు ప్రేమించరు చెప్పండి. అందరూ ప్రేమిస్తారు. విశ్వసుందరిని  ప్రేమించని వారెవరు చెప్పండి. ఆమెను ప్రేమించేవారు కోకొల్లలు. అంత మాత్రాన వారందరూ గొప్పవారవుతారా? ఆ విశ్వసుందరి ఒక్కడినే ప్రేమిస్తుంది, వరిస్తుంది. వాడే గొప్పవాడు. అందుకే పరమాత్మ అంటాడు..  

            

            మనుష్యాణాం సహస్రేషు - కశ్చిత్ యతతి సిద్ధయే
            యతతామపి సిద్ధానామ్ - కశ్చిన్మామ్ వేత్తి తత్త్వతః



‘వేలకొలది జనులలో ఏ ఒక్కరో ఙ్ఞానసిద్ధి (భగవంతుని ప్రేమ) కొరకు ప్రయత్నిస్తారు. కానీ అలా ప్రయత్నించిన వారిలో ఏ ఒక్కడో దానిని పొందగలుగు తున్నాడు.’ భగవంతుని ప్రేమించడం కాదు..అతని ‘ప్రేమ’ను పొందగలగాలి. అదీ గొప్ప. ఒక భక్తుడు ఉండేవాడు. అతనికి ఇహలోక సంబంధిత ‘ప్రేమ’కు ఏ లోటు లేదు. కానీ.. అతను తన కష్టసుఖాలను దేవునితోనే చెప్పుకునేవాడు, ఆయనతోనే పంచుకునేవాడు. అతనికి దేవుడు తప్ప మరో లోకం తెలియదు. ఒకరోజు అతనికో కల వచ్చింది. ఆ కలలో ఒక దేవదూత ఏదో వ్రాసుకుంటూ కనిపించింది. ఈ భక్తుడు ఆమె దగ్గరకు వెళ్లి ‘ఏం రాస్తున్నావు?’ అని అడిగాడు. ‘ఈ యుగంలో భగవంతుని ప్రేమించే వ్యక్తుల పేర్ల పట్టిక రాస్తున్నాను’అని జవాబు చెప్పింది. ‘ఆ పట్టికలో నా పేరు ఉందా?’ అని ఆశగా అడిగాడు. ఆ దేవదూత ఆ పట్టిక అంతా రెండు మూడు సార్లు పరీక్షించి,, ఎంతో జాలిగా ‘నన్ను క్షమించు నాయనా...నీ పేరు ఈ పట్టికలో లేదు’ అని బదులిచ్చింది. ఆ భక్తుడు హతాశుడయ్యాడు. దేవుడి పట్ల నాకున్న ప్రేమలో ఏదైనా లోపం ఉన్నదా అని తనను తాను ఎన్నో విధాలుగా తర్కించుకున్నాడు, పరిశీలించుకున్నాడు, సరిదిద్దుకున్నాడు. అలా ఎన్నో రాత్రులు అన్న,పానాలు..నిద్ర లేకుండా పిచ్చివాడులా గడిపాడు. ఒకరోజు రాత్రి అతనికి తిరిగి అదే కల వచ్చింది. ‘ఈ సారి కూడా అదే పట్టికయేనా? ఇందులోనైనా నా పేరున్నదా? అని ఎంతో ఆశగా అడిగాడు. ‘ఇది ఆ పట్టిక కాదు నాయనా’ అని ఆ దేవదూత బదులిచ్చింది. ‘మరి ఏ పట్టిక?’ అని అడిగాడు ఆ భక్తుడు. ‘ ఇది దేవుడి చేత ప్రేమించబడుతున్న వారి పేర్ల పట్టిక’ అని బదులిచ్చింది ఆ దేవదూత. ‘ఇందులోనైనా నా పేరు ఉన్నదా?’ అని అడిగాడు ఆ భక్తుడు. ‘ఇందులోనున్న కొద్దిమంది పేర్లలో ముందు ఉన్నది నీ పేరే నాయనా’ అని బదులిచ్చింది ఆ దేవదూత. అంతే .. కల చెదిరింది. ఆ భక్తునకు మెలుకువ వచ్చింది. అతని ముఖంలో చెప్పలేనంత ఆనందం. ఆ ఆనందంతో ఈ సారి కూడా అతనికి ఆకలి వెయ్యలేదు.. దాహం వెయ్యలేదు.., నిద్ర పట్టలేదు. అతాంటి ‘ప్రేమ’ను పొందగలగాలి. అందుకోసం పెద్దగా కష్టపడక్కరలేదు. ప్రతి ప్రాణిలోను దైవాన్ని దర్శించు. చేతనైతే ఇతరులకు మేలు చేయి. కీడు మాత్రంచేయకు. ఏ పని చేసినా భగవదర్పణంగా చేయి. చాలు. భగవంతుని ‘ప్రేమ’ నీడలా నీ వెంట నడుస్తుంది.

              పత్రం పుష్పం ఫలం తోయం - యోమేభక్త్యా ప్రయఛ్చతి
              తదహం భక్త్యుపహృతం - అశ్నామి ప్రియతాత్మనః

 
‘ఎవరైనా భక్తితో నాకు ఆకు అయినా., పూవు అయినా., పండు అయినా., కనీసం నీళ్ళు అయినా సమర్పిస్తే వాటిని నేను ప్రేమగా స్వీకరిస్తాను’. ఇది భగవంతుడు మనకు ఇచ్చిన మాట. ఆ మాటకు ఆయన ఎప్పుడూ కట్టుబడి ఉంటాడు. మరెందుకు ఆలస్యం? ఆయన ‘ప్రేమ’ను పొందడానికి ప్రయత్నించండి.. దివ్యానందాన్ని అనుభవించండి.
                                               

    - యం.వి.యస్.సుబ్రహ్మణ్యం