టూ స్మార్ట్ ఈ ట్రెండింగ్ హ్యాండ్ బ్యాగ్స్!

 

టూ స్మార్ట్ ఈ ట్రెండింగ్ హ్యాండ్ బ్యాగ్స్!

ఏదైనా ఫంక్షన్, పార్టీ లలో ఆడవాళ్ళందరూ అటు ఇటు తిరుగుతున్నప్పుడు వాళ్ళ అందమైన మెరుపుల బట్టలు, ఆభరణాలు, అలంకారాలు మాత్రమే కాకుండా వాటి కోవలోకి వచ్చే మరో అందమైన ఆకర్షణ హ్యాండ్ బాగ్. ప్రతి ఒక్కరి చేతిలో ఖచ్చితంగా చిన్నవో, పెద్దవో హ్యాండ్ బాగ్ లు ఉండనే ఉంటాయి. కేవలం ఫ్యాషన్ లో భాగంగా మాత్రమే కాకుండా తమకు అవసరమైన బ్యూటీ ఇంకా ఇతర వస్తువులను తమ వెంట తీసుకెళ్లడానికి హ్యాండ్ బ్యాగ్స్ అనేవి తప్పనిసరి అవసరాల్లో భాగంగా మారిపోయాయి కూడా.

అయితే ఈమధ్య కాలంలో హ్యాండ్ బ్యాగ్ ల విషయంలోకి వెళితే కేవలం అవసరానికే కాదు అదొక ఫాషన్ ఐకాన్ గా కూడా ఉంది. బోలెడు బ్రాండ్ లు, లెక్కలేనన్ని స్టయిల్స్. వీటిలో ఏది ఎంపిక చేసుకోవాలి అని అమ్మాయిలు తికమకపడుతుంటారు.

అయితే ఆరు రకాల హ్యాండ్ బ్యాగ్ లు మీ దగ్గరుంటే అన్ని రకాలుగా మీకు భరోసాను, ఫ్యాషన్ ను, అట్రాక్షన్ ను, అమేజింగ్ లుక్ ను ఇస్తాయి. ట్రెండింగ్ లో ఉన్న ఆరు రకాల హ్యాండ్ బ్యాగ్ లు ఇవే మరి.

క్రోచెట్ హ్యాండ్ బ్యాగ్!!

సహజత్వంతో ఉట్టిపడే ఆకర్షణ ఈ క్రోచెట్ హ్యాండ్ బ్యాగ్ ల సొంతం. డ్రెస్సింగ్ వార్డ్ రోబ్ లో ఎన్ని రకాల దుస్తులు ఉన్నా, ఏ స్టైల్ దుస్తులకు అయినా ఈ హ్యాండ్ బ్యాగ్ లు మాచ్ అవుతాయి. పైగా చిన్న పెద్ద తరహా వస్తువులు కూడా వీటిలో వుంచుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఇవి సహజంగా తయారయ్యేవి. ఎలాంటి కృత్రిమ పదార్థాలను వీటి తయారీలో ఉపయోగించరు. అందువల్ల పర్యావరణానికి హాని చేయవు. 

టోట్ బ్యాగ్స్!!

ఇవేవో కొత్తరకం అనుకుని తికమకపడక్కర్లేదు. సాధారణంగా వీటిని పత్తి, నూలుతో తేలికపాటిగా తయారుచేస్తారు. మన చిన్నపాటి వస్త్రాలతో కుట్టే చేతిసంచుల్లా ఉంటాయి. కాకపోతే వీటి మీద ఎమోజిస్, చిన్న చిన్న సెంటన్స్ లతో ఆకర్షణీయంగా చేస్తారు. సృజనాత్మకత ఉంటే మీరూ చేసుకోవచ్చు. ఇవి బరువు ఎక్కువ ఉండవు. చిన్న పెద్ద సైజ్ లలో కూడా లభిస్తాయి. ఎంచక్కా వీటిని మడతపెట్టి సాధారణ హ్యాండ్ బాగ్ లో కూడా పెట్టేసుకుని వెళ్ళచ్చు. బరువును చక్కగా హ్యాండిల్ చేస్తాయి. బయట షాపింగ్స్ కి మర్కెట్స్ కి వెళ్ళినప్పుడు వీటిని వెంట తీసుకెళ్తే ప్లాస్టిక్ వాడకానికి చెక్ పెట్టినట్టు ఉంటుంది, ఖర్చు ఆదా అవుతుంది.

షోల్డర్ బ్యాగ్స్!!

1990 ల కాలంలో ఎంట్రీ ఇచ్చి ఓ ట్రెండ్ సృష్టించిన ఈ షోల్డర్ బ్యాగ్స్ అంటే ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. బోలెడు బ్రాండ్స్ ఈ బ్యాగ్స్ ను ఎప్పటికప్పుడు కొత్తగా తెస్తున్నాయి. పార్టిస్ లో ఈ బ్యాగ్స్ చాలా గ్రేస్ లుక్ ఇస్తాయి. ఎంతోమంది డ్రెస్ మ్యాచింగ్ బ్యాగ్స్ మైంటైన్ చేస్తారు కూడా. ఇవి ఇప్పట్లో భుజాలకు తగిలించుకోవడమే కాకుండా ఎంచక్కగా చేతులతోనే పెట్టుకోవచ్చు. లేడీస్ బ్యూటీ కిట్ లు ఇందులో హాయిగా సర్దేసుకోవచ్చు. మీడియం సైజ్ నుండి పెద్ద సైజ్ వరకు ఇవి అందుబాటులో ఉంటాయి.

ఫ్యాని బ్యాగ్స్!!

చేత్తో మోసే బరువు లేకుండా భలే ఉంటాయి ఈ ఫ్యాని బ్యాగ్స్. ఎంచక్కా నడుముకు బెల్ట్ లాగా పెట్టేసుకుంటే చేతులతో ఏవైనా మోసుకునే పనులుంటే అవి చేసుకోవచ్చు, లేదంటే హాయిగా చేతులూపుకుంటూ పోవచ్చు. అత్యవసరమైన చిన్న చిన్న వస్తువులు కూడా అందులోనే పెట్టుకోవచ్చు. మొబైల్, ఇయర్ ఫోన్స్, చార్జర్, పవర్ బ్యాంక్ ఇలాంటివన్నీ అందులోనే పెట్టేసుకోవచ్చు. పైగా అన్ని వయసుల వారికి ఇవి అనుకూలంగా ఉంటాయి.

బకెట్ బ్యాగ్స్!!

కాస్త దూరాలు వెళ్ళేటప్పుడు తేలికపాటి బరువులు మోసుకెళ్లడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. వీటికె కాదు ఔట్ డోర్ ఓకేషన్స్ కి వెళ్ళినప్పుడు పిక్-నిక్  లకు వెళ్ళినప్పుడు ఇవి భలే ఉంటాయి. క్రాస్ బ్యాగ్స్ గా కూడా బాగా లుక్ ఇస్తాయి. వీటన్నింటికంటే కిక్ ఇచ్చే విషయం ఇవి కాస్త స్పెషల్ అట్రాక్షన్ గా మోడ్రన్ గా ఉంటాయి. 

మైక్రో బ్యాగ్స్!!

పేరుకు తగ్గట్టు ఇవి బుల్లిబుల్లి బ్యాగ్స్, చేతిలో అట్టే పెట్టేసుకోవచ్చు, ఇంకా పొడవాటి థ్రెడ్ లాంటి హంగింగ్ సహాయంతో హ్యాండ్ బాగ్ లాగే భుజానికి వేసేసుకోవచ్చు. వీటిలో కేవలం క్రెడిట్ కార్డ్, మనీ, మహా అయితే మొబైల్ లాంటివి మాత్రమే పట్టినా అమ్మాయిలు బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కువ ఇంటరెస్ట్ చూపించేది మాత్రం ఈ మైక్రో బ్యాగ్స్ కె. క్లచ్ లతోనూ, జిప్ ల తోనూ భలే ముచ్చటగా ఉండే ఈ బ్యాగ్స్ అందరి దగ్గరా కనీసం ఒక్కటైనా ఉండి తీరతాయి.

ఇవీ ట్రెండింగ్ లో ట్రావెల్ చేస్తున్న హ్యాండ్ బ్యాగ్ లు. అమ్మాయిలందరినీ రారమ్మని పిలుస్తాయి మరి. మీకు నచ్చినవేవో తెచ్చేసుకొని వాడుకోండి.

                                     ◆నిశ్శబ్ద.