Read more!

వయ్యారంగా… వధువు వెంట సింగారం కాగా..!

 

వయ్యారంగా… వధువు వెంట సింగారం కాగా..!


ఈ ప్రపంచంలో ఆకర్షించబడనిది ఏముంటుంది. ప్రకృతి నుండి మనిషి వరకు అంతా ఆకర్షణే... ముఖ్యంగా మహిళలు ఇలాంటి ఆకర్షణలో మునిగి తేలుతుంటారు. ఒకప్పుడు పాతకాలం హీరోయిన్లను చూసి, సినిమాల్లో వారి వస్త్రధారణ, వారి హెయిర్ స్టయిల్ మొదలయినవి చూసి ఆడవారు చాలా బాగా ఫాలో అయ్యేవారు. మొదట్లో ఇది దుస్తులు, హెయిర్ స్టైల్ వంటి విషయంలోనే ఉన్నా క్రమంగా మేకప్, జ్యువెలరి వంటి వాటికి కూడా పాకింది. ఇప్పటికాలం అమ్మాయిలు పార్టీలు, శుభకార్యాలకు కనిపించే తీరు ఏ గంధర్వ కన్యలనే తలపిస్తుందంటే అతిశయోక్తి కాదు. అలాంటిది జీవితంలో ఒకసారి మాత్రమే వచ్చే పెళ్ళి గడియల పట్ల వారికి ప్రత్యేక ఆసక్తి ఉండటంలో ఏమాత్రం విచిత్రం లేదు కదా…

మెరిసిపోయే పెళ్లికూతురు ధరించే ఆభరణాల్లో బోలెడు ఉన్నా ఇప్పటి అమ్మాయిలు వాటిలో కూడా వైవిధ్యం కోరుతున్నారు. మరీ ముఖ్యంగా సెలెబ్రిటీస్ ను చూసి వారిని ఫాలో అవుతూ తమ వేడుకల్లో వీరు మినీ సెలెబ్రిటీస్ లా సందడి చేస్తారు. అందమైన హెయిర్ స్టయిల్ కి మరింత అందాన్ని తెచ్చిపెట్టేది పాపిటి బిళ్ళ. ఒకప్పుడు బొట్టంత ఉండే ఈ పాపిటి బిళ్ళ ఇప్పుడు రూపాయి బిళ్ళ కంటే పెద్దగా మారింది. ఇంకా మాథా పట్టి, మాంగ్ టిక్కా మొదలైన రూపాలు  విభిన్నంగా అలరిస్తున్నాయ్.

ఇప్పటి కాలం అమ్మాయిలు కేవలం పాపిటి బిళ్లలతో సరిపెట్టుకోకుండా, పోల్కీ పిన్స్, వజ్రాలు పొదిగిన హెడ్ బ్యాండ్స్, మాధా పట్టీలకు పెద్ద పీట వేస్తున్నారు. ఇలాంటి ఆభరణాలను  ఎంచుకునే విషయంలో ఈకాలం కొత్త పెళ్లి కూతుళ్లు అయిన అలియా భట్, కత్రినా కైఫ్, సోనమ్ కపూర్ మొదలైన బాలీవుడ్ హీరోయిన్లను స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. మెడలో వేసుకునే నెక్లెస్ నుండి చేతికి వేసుకునే గాజులు, నడుముకు వడ్డాణం, అందమైన హెయిర్ స్టయిల్ ను మరింత అందంగా మార్చే హెయిర్ బ్యాండ్స్, హెయిర్ జ్యువెలరి వంటి వాటిని మాచింగ్ ఉండేలా చూసుకుంటున్నారు.

తగ్గేదిలేదంటారు….

పెళ్లిళ్ల విషయంలో తమకు నచ్చిన తాము చూసిన ఆభరణాలు వస్త్రాలు ధరించడం, వాటిని కొనుగోలు చేయడానికి అమ్మాయిలు ఏమాత్రం తగ్గేది లేదంటున్నారు. స్వతహాగానే ఈకాలం అమ్మాయిలు సంపాదనా పరులు అయినందువల్ల వారి బ్యాంక్ బ్యాలెన్స్ బరువుగానే ఉంటుంది. దాంతో తమకు నచ్చింది తీసుకోవడానికి వారు ఏమాత్రం రాజీపడటం లేదు. 

ఒకటే రెండూ…..

అమ్మాయిలు  తమకు నచ్చింది కొనడానికి ఎలాగైతే తగ్గేది లేదు అన్నట్టు ఉంటారో బంగారం కూడా నేను తగ్గేదిలేదు అనే రీతిలో పెరుగుతూ పోతోంది. బంగారం ధర పెరిగితే కొనుగోళ్లు కుంటుపడతాయనే కారణంతో ఆభరణాల తయారీ దారులు ఒక వస్తువును రెండు విధాలుగా వాడుకునేలా తయారుచేయడం మొదలుపెట్టారు. ఇలాంటి వాటికి ప్రస్తుతం ఎంతో డిమాండ్ ఉంది కూడా. పెళ్లికూతుళ్లు, అటు నెక్లెస్, ఇటు పాపిట బిళ్లగా రెండు విధాలా అలంకరించుకునే 'టూ ఇన్ వన్' జ్యువెలరీ వైపు మొగ్గు చూపుతున్నారు. పోల్కీ, జడావూ వజ్రాలు, కెంపుల హెయిర్ జ్యువెలరీ కోసం రెండు విధాలుగా ఉపయోగించుకునే ట్రెండ్ ను ఎంచుకుంటున్నారు. వాళ్ల ఇష్టాలకు తగ్గట్టే... తల మీద అలంకరించుకునే మాథాపట్టీనే మెడలోకి చోకర్గా, చేతికి బ్రేస్లెట్గా ధరించే 'టూ ఇన్ వన్' తరహా నగలు ఇప్పుడు రూపొందుతున్నాయి.

ఇలా అమ్మాయిలు తమ అభిరుచులు ఏమాత్రం తగ్గించుకోకుండా సెలబ్రిటీలకు ఏమాత్రం తగ్గకుండా మెరిసిపోవడం, వారి ప్రత్యేకమైన రోజులను అంతే ప్రత్యేకంగా మార్చుకోవడం జరుగుతోంది. అందానికి నిర్వచనమైన అమ్మాయిల సొగసును పేరు పెట్టగలమా ఇక.

                                      ◆నిశ్శబ్ద.