భారతీయతకు ప్రతీక... కుంకుమ
భారతీయతకు ప్రతీక... కుంకుమ
ఆస్తికుల ఆస్తి కుంకుమ
నుదుట ఎర్రటి కుంకుమ పెట్టుకోవడం అనేది హిందూ సంప్రదాయంలో ఒక భాగం. గతంలో హిందువుల్లో ఏ కులం వారైనాసరే తప్పకుండా నుదుటన కుంకుమ ధరించేవారు. ముఖ్యంగా శైవులు, వైష్ణవులైతే కుంకుమ ధరించడం తప్పనిసరి.. అలా కుంకుమ ధరించడం గొప్పదనంగా భావించేవారు. ఆస్తికుల ముఖం మీద చెరగని ఆస్తిగా కుంకుమ భాసించేది. ఈ ఆధునిక యుగంలో తప్ప శతాబ్దాలుగా ప్రతి ఒక్క హిందువు ముఖం మీద కుంకుమ తప్పకుండా వుండేది. అది కేవలం ఆచారంగా మాత్రమే కాకుండా అలంకారంగా కూడా వర్ధిల్లింది. హరిచందనాన్ని, మంచి గంధాన్ని, విభూతిని, ఎర్రటి కుంకుమను నుదుటన ధరించడం హిందూ సంప్రదాయంలో కొనసాగుతూ వచ్చింది. సృష్టిలో మొదటిరంగు ఎరుపు కాబట్టి కుంకుమ ఎర్రటి రంగులో ఉంటుందట. ఎరుపురంగు లక్ష్మీప్రదమని కూడా అంటారు.
నాడులు కలిసే కీలక ప్రదేశంలో...
మన శరీరం సక్రమంగా పనిచేయాలంటే నాడులు సక్రమంగా పనిచేయాలి. శరీరంలో రెండు ముఖ్యమైన నాడులు వుంటాయి. వాటిలో ఒకటి ‘ఇడ’ రెండోది ‘పింగళ’. ఈ రెండు నాడులూ నుదుటి వద్ద కలుస్తాయి. అంటే శరీరంలోని నాడులన్నింటికీ అనుసంధానం నుదుటన వుందన్నమాట. ఈ ప్రదేశాన్ని ‘సుషుమ్న’ నాడిగా పిలుస్తారు. ఇక్కడ కుంకుమగానీ, గంధం గానీ, విభూదిగానీ ధరించడం వల్ల నాడుల పనితీరు సక్రమంగా వుంటుందన్న అభిప్రాయాలు వున్నాయి. అలాగే కుంకుమ ధరించడం వల్ల దృష్టిదోషం తగలదట. కుంకుమ ధరించిన వ్యక్తులకు ఎదుటి వ్యక్తులు మానసికంగా లొంగిపోతారట. అలాగే కుంకుమకున్న ఎర్రటి రంగు మనలో మనోశక్తి, త్యాగనిరతి, నిర్భయత్వం, పరోపకార గుణాన్ని పెంపొందిస్తాయన్న అభిప్రాయాలు వున్నాయి.
పవిత్రతకు చిహ్నం
పురుషులు కుంకుమ ధరించడం పవిత్రతకు, ఆస్తికత్వానికి, ధార్మికత్వానికి సంకేతంగా భావిస్తారు. అదే స్త్రీలకయితే పై అంశాలకు తోడు సౌభాగ్యానికి, స్థిరబుద్ధికి సంకేతంగా కూడా భావిస్తారు. అనాది నుంచి హిందువులకు ప్రధాన అలంకార ప్రక్రియ కుంకుమ పెట్టుకోవడం అనే అభిప్రాయాలు కూడా వున్నాయి. ఈ విషయాన్ని కొన్ని గ్రంథాల్లో కూడా పేర్కొన్నారు. కుంకుమను భారతీయతకు చిహ్నంగా భావిస్తారు. దూరదర్శన్‌లో చూసే బధిరుల వార్తల్లో ‘ఇండియా’ అనే సందర్భం వచ్చినప్పుడు ఆ న్యూస్‌రీడర్ నుదుటన కుంకుమ పెట్టుకునే ప్రదేశంలో మధ్యవేలుని చూపిస్తుంది. అది కుంకుమకి, భారతదేశానికి ఉన్న బలీయమైన బంధాన్ని సూచిస్తుంది. ఈమధ్యకాలంలో పురుషులు కుంకుమ పెట్టుకోవడం మానేశారు. కొంతమంది మహిళలు కూడా మానేశారు. ఈ ధోరణి ఎక్కడకి దారితీస్తుందోనన్న ఆందోళనను సంప్రదాయ వాదులు వ్యక్తం చేస్తూ వుంటారు. ఏది ఏమైనప్పటికీ ఎవరి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత వారి మీద వుంటుంది. హిందువులు తమ సంప్రదాయానికి దూరంగా వెళ్ళిపోవడం, కుంకుమను విస్మరించడం శ్రేయస్కరం కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
- రమ