ఎన్నెన్నో నమ్మకాల లోకమిది

 

 

ఎన్నెన్నో నమ్మకాల లోకమిది...

 

 

 

ఎవరైనా బయలుదేరుతుంటే తుమ్ము వినిపించగానే కాసేపాగి బయలుదేరండి అంటాం. నిండుకుండ ఎదురైతే వెళ్లిన పని వెంటనే అవుతుందని నమ్ముతాం. ఇలా మన నిత్య జీవితంతో ఎన్నో నమ్మకాలు ముడి వేసుకుని వున్నాయి. మంచిచెడులని ముందుగా తెలియచేసే సంకేతాలే శకునాలని కూడా మన నమ్మకం. అయితే ఈ నమ్మకాలు మన దేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచంలో చాలా చోట్ల ఈ నమ్మకాలు బలంగా తమ హవా చాటుతున్నాయి. అలాగే ఆ నమ్మకాలు కూడా రకరకాలుగా ఉంటాయి కూడా. 

పిల్లి, గబ్బిలం వంటివి ఎదురైతే మనం అపశకునాలుగా భావిస్తాం కదా. కానీ జపాన్ వారికి ఇంట్లో పిల్లి బొమ్మ పెట్టుకుంటే అదృష్టం కలసి వస్తుందని నమ్మకం. ప్రతీ ఇంట్లో మనేకినెకోని అని పిలిచే పిల్లి బొమ్మ ఉండితీరాల్సిందే. అలాగే గ్రీసువారు గబ్బిలం ఎముకను జేబులో పెట్టుకుని బయలుదేరతారు. అలా చేస్తే ఎలాంటి అపశకునాలు ఎదురైనా చెడు ప్రభావం ఉండదని, వెళ్ళిన పని విజయవంతంగా పూర్తవుతుందనీ వాళ్ళ నమ్మకం. చీపురుకట్ట కాళ్ళకి తగిలితే సన్నబడిపోతామని మన నమ్మకం కదా, కానీ జర్మనీ వారు ఏదైనా పని మీద బయటకి వెళ్ళినపుడు చీపురుకట్టని తాకి వెళితే ఆ పని సవ్యంగా జరుగుతుందని నమ్ముతారు.

వివిధ దేశాలలోని నమ్మకాల గురించి చెప్పుకుంటున్నాం కదా! ఉగాదినాడు షడ్రుచులతో నిండిన ఉగాది పచ్చడి తింటే మంచిదని మన నమ్మకం కదా. అలాగే బ్రెజిల్ వారు కాయధాన్యాలతో చేసిన సూప్ కొత్త సంవత్సరం ప్రారంభం రోజున తాగుతారు. ఇక హంగేరి వాసులైతే స్థానికంగా లభించే ఒకరకం కాయల్ని తినటం మంచిదని నమ్ముతారు. పశ్చిమ వర్జీనియా ప్రాంతంలో కొత్త సంవత్సరం ప్రారంభం రోజున కొన్ని రకాల పచ్చికూరగాయల్ని తినటం సుఖసంతోషాలని ఏడాదంతా అందిస్తుందని నమ్ముతారు.

ఏదైనా గాజు వస్తువు పొరపాటున చేయిజారి కిందపడిందనుకోండి. అరెరె అనుకుంటాం మనం. కానీ బల్గేరియా వాసులు మాత్రం ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బు అవుతారు. ఎందుకంటే గాజు వస్తువులు అనుకోకుండా పగిలితే అదృష్టం కలసి రాబోతుందని వారి నమ్మకం మరి. కొత్తగా కొన్ని చెప్పులు, బూట్ల వంటివి ఉన్న కవర్లని మనం సాధారణంగా షాపింగ్ నుంచి రాగానే ఏ టీపాయ్ మీదో పెడతాం కదా! కానీ బిట్రన్ వారికి అది ఎంతో అరిష్టాన్ని సూచించే సంకేతంగా భావిస్తారు. అలా బల్లల వంటి ఎత్తు ప్రదేశాలలో కొత్త బూట్లని పెడితే ఆ ఇంట్లో మృత్యువు ప్రవేశిస్తుందని వారి నమ్మకం.

అసలు అనుకున్న పనులు ఏవీ సమయానికి జరగటం లేదు, దురదృష్టం వదలటం లేదంటూ వాపోయే వారికి టర్కీ సిద్ధాంతులైతే ఏం చెబుతారో తెలుసా.. కాసేపు అలా ఒంటె మీద ఎక్కి షికారు చేయండి అదృష్టం వరిస్తుందంటారు. వారికి ఒంటె అదృష్ట దేవత. పరిస్థితులు అనుకూలించకపొతే ఒంటెనెక్కటమే మార్గమని నమ్ముతారు వాళ్ళు. అలాగే మనదేశంలోనే కాదు గుర్రపు గిట్టలకి వేసే ఇనుప నాడాలు పశ్చిమ యూరప్ వాసుల ఇళ్ళ తలుపులకి కూడా కనిపిస్తాయి. అలా తగిలిస్తే మంచి జరుగుతుందని వారి నమ్మకం. ఇలా వివిధ దేశాలలో. ఎప్పటినుంచో నమ్మకాలనేవి ప్రజల జీవితంలో ముడిపడి వున్నాయి. 

 

-రమ