ఈ ఏడుగురి పాదాలను తాకితే పుణ్యానికి బదులు పాపం వెంటాడుతుందట!
ఈ ఏడుగురి పాదాలను తాకితే పుణ్యానికి బదులు పాపం వెంటాడుతుందట!
భారతీయ సంస్కృతిలో పెద్దల పాదాలను తాకడం కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాకుండా.. అది పెద్దల పట్ల భక్తిని, గౌరవాన్ని వ్యక్తం చేసే మార్గం కూడా అవుతుంది. పెద్దల కాళ్లకు నమస్కరించడం అనేది చిన్న వయసు వారిలో విలువలను, ఆధ్యాత్మిక చైతాన్యాన్ని కూడా జాగృతం చేస్తుంది. ముఖ్యంగా, తల్లి, తండ్రి , గురువు పాదాలకు నమస్కరించడం వారి పట్ల అచంచలమైన విశ్వాసానికి , గౌరవానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. శాస్త్రాలలో పాదాలను తాకడం చాలా పవిత్రమైన , శుభప్రదమైన సందర్బంగా పరిగణించబడుతుంది. పెద్దల పాదాలను తాకి నమస్కరిస్తే దీర్ఘాయువు, మంచి ఆరోగ్యం, ఆనందం , శ్రేయస్సు వంటివి చేకూరతాయని చెబుతారు. పాదాలను తాకడం చాలా పవిత్రమైన పని అయినా.. ఏడుగురి పాదాలను తాకడం వల్ల పుణ్యం కలగకపోగా.. పాపం చేకూరుతుందని చెబుతున్నారు పండితులు. ఇంతకూ ఎవరి పాదాలను తాకకూడదు? అనే విషయం గురించి తెలుసుకుంటే..
అంత్యక్రియల నుండి తిరిగి వచ్చిన వ్యక్తికి..
ఎవరైనా అంత్యక్రియల నుండి తిరిగి వస్తుంటే, వారి పాదాలను తాకడం నిషిద్ధం. శాస్త్రాల ప్రకారం స్మశానం నుండి తిరిగి వచ్చే వ్యక్తి అపవిత్రుడుగా పరిగణించబడతాడు. ఇది పాదాలను తాకే వ్యక్తిపైనా, అలాగే తాకించుకునే వ్యక్తిపైనా కూడా ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. అందువల్ల అంత్యక్రియల నుండి తిరిగి వచ్చాక.. శుద్ది అయిన తర్వాత అంటే స్నానం చేసిన తర్వాత మాత్రమే పాదాలను తాకడం సముచితం.
వివాహం కాని అమ్మాయిలు..
సనాతన ధర్మంలో కన్యలను దుర్గాదేవి స్వరూపంగా భావిస్తారు. అందువల్ల ఎవరూ తమ కన్యను గానీ లేదా మరే ఇతర కన్యను గానీ తమ పాదాలను తాకనివ్వకూడదు. అలా చేయడం పాపమట. కన్యలను పూజించాలని శాస్త్రాలు చెప్పాయి. నవరాత్రుల సమయంలో కూడా కన్యా పూజ చేస్తారు. అయితే.. కన్యలను పూజించి వారి ఆశీర్వాదం తీసుకోవచ్చు కానీ.. వారిని ఇతరుల పాదాలు తాకనివ్వకూడదు. వారు దైవ సమానులు.
ఆలయం లోపల పాదాలు తాకడం..
సనాతన ధర్మంలో దేవాలయాలు దైవ నివాసంగా పరిగణించబడతాయి. అందువల్ల ఆలయ ప్రాంగణంలో ఉన్నప్పుడు, దేవుని పాదాలను మాత్రమే తాకాలట. ఆలయంలో ఇతర ఏ వ్యక్తి పాదాలను తాకడం ఆ పవిత్ర స్థలాన్ని , అక్కడ కొలువై ఉన్న దైవాన్ని అవమానపరచడంగా పరిగణించబడుతుందట. అక్కడ ఎవరైనా పెద్దవారు తారసపడితే, చేతులు జోడించి వారికి నమస్కరించడం ఉత్తమం అని చెబుతారు.
భక్తిలో లేదా పూజలో ఉన్న వ్యక్తి..
ఎవరైనా ధ్యానం చేస్తున్నప్పుడు, జపిస్తున్నప్పుడు, లేదా హారతి ఇస్తున్నప్పుడు, పూజ చేస్తున్నప్పుడు వారి పాదాలను తాకకూడదు. ఇది వారి ఏకాగ్రతకు భంగం కలిగించి, వారి ఆధ్యాత్మిక శక్తికి ఆటంకం కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో పాదాలను తాకడం పుణ్యం కాకుండా పాపాన్ని కలిగిస్తుందని నమ్ముతారు.
నిద్రిస్తున్న వ్యక్తి..
హిందూ విశ్వాసాల ప్రకారం, నిద్రపోతున్న వ్యక్తి పాదాలను తాకడం అశుభంగా పరిగణించబడుతుంది. శాస్త్రాల ప్రకారం మరణానంతరం మాత్రమే పడుకున్న వ్యక్తి పాదాలను తాకడానికి అనుమతి ఉంది. ఒకవేళ బ్రతికి ఉన్న వ్యక్తి నిద్రపోతుంటే, వారి పాదాలను తాకడం వారి ఆయుష్షును తగ్గిస్తుందట.
మేనల్లుడు, మేనకోడలు..
సంబంధాలలో మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు చాలా ఉన్నత స్థానాన్ని కలిగి ఉంటారు. వారిని వారి మేనమామలు, మేనత్తలు ఎంతో గౌరవిస్తారు. వారు కుటుంబానికి గర్వకారణంగా, చిహ్నంగా పరిగణించబడతారు కాబట్టి, వారు తమ మేనమామల, మేనత్తల పాదాలను తాకకూడదట. అలా చేయడం వారికి పాపంగా పరిగణించబడుతుందట.
కూతుళ్లు..
ఇంటి ఆడపిల్లలు లక్ష్మీదేవి స్వరూపం ,వారిని ఇంట్లో కనిపించే దేవతలుగా పరిగణించాలని శాస్త్రాలు చెబుతాయి. తండ్రులు , ఇతర పెద్దలు తమ కుమార్తెలను తమ పాదాలను తాకనివ్వకూడదట. కుమార్తెలను గౌరవించడమే ఇంటికి సంతోషాన్ని, శ్రేయస్సును తీసుకురావడానికి కీలకం, కాబట్టి వారిపై ఎల్లప్పుడూ ప్రేమను, ఆశీర్వాదాలను కురిపించాలి, అంతేగాని వారికి సేవ చేయమని బలవంతం చేయకూడదట.
గమనిక..
పైన పేర్కొన్న విషయాలు పండితులు వివిధ సందర్భాలలో వెలిబుచ్చిన సమాచారాలను సేకరించి పొందుపరిచినవి.
*రూపశ్రీ.