Tiruppavai Magazine Part - 3 (చక్రవర్తుల రంగనాథ్)
తిరుప్పావై మూడవరోజు పాశురం ....
3. పాశురము :
ఓఙ్గి యులగళన్ద ఉత్తమన్ పేర్ పాడి
నాఙ్గిళ్ నంబావైక్కు చ్చాత్తినీరాడినాల్
తీఙ్గిన్ఱి నాడెల్లామ్ తిజ్గిళ్ ముమ్మారిపెయ్ దు
ఓఙ్గువళై ప్పోదిల్ పొఱివండు కణ్ పడుప్ప
తేఙ్గాదే పుక్కిరున్దు శీర్ త్తములై పత్తి
వాఙ్గ- క్కుడమ్ నిఱైక్కుమ్ వళ్ళల్ పెరుమ్ పశుక్కళ్
నీఙ్గాద శెల్వమ్ నిఱైన్దేలో రెమ్బావాయ్.
భావము: ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీ కృష్ణ సంశ్లేషమే! ఐనా దీనిని చేయటానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది. బలిచక్రవర్తి నుండి మూడడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంతానందాన్ని పొంది ఆకాశమంత ఎత్తుకెదిగి మూడు లోకాలను కొలిచాడు. ఆ పరమానంద మూర్తి దివ్యచరణాలను, అతని దివ్య నామాలను పాడి, యీ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గళిస్నానాన్నాచరిస్తే - దుర్భిక్షమసలు కలుగనే కల్గదు. నెలకు మూడు వర్గాలు కురుస్తాయి. పంటలన్నీ త్రివిక్రముని వలె ఆకాశమంత ఎత్తుకెదిగి ఫలిస్తాయి. పంటచేల మధ్యనున్న నీటిలో పెరిగిన చేపలు త్రుళ్లిపడుతూ ఆనంద సమృద్దిని సూచిస్తాయి. ఆ నీటిలో విరిసిన కలువలను చేరిన భ్రమరాలు అందలి మకరందాన్ని గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి. ఇవన్నీ సమృద్దికి సంకేతాలే! ఇక పాలు పిదుక గోవుల పోదుగలను తాకగానే - కలశాలు నిండునట్లు క్షీరధారలు అవిరళంగా నిరంతరంగా కురుస్తాయి. ఇలా తరగని మహదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది. కావున వ్రతాన్ని చేద్దాం రమ్మని సఖులందరినీ పిలుస్తోంది గోద!
3వ మాలిక
ఈ ధనుర్మాస వ్రతమెంతో శుభప్రదమైనది. దీని నాచరించుటవలన వ్రతాన్నాచరించనవారికే కాక లోకమునకంతకును లాబించుము. ఇది ఇహపరసాధక వ్రతము. పిలిస్తే పలికేవాడు కృష్ణపరమాత్మకదా! మరి విశేషంగా ఆరాధించిన వారికేకాక లోకానికంతకూ కల్యాణాన్ని కల్గించి శుభాలను చేకూర్చేవాడని వ్రతఫలాలను వివరిస్తోంది గోదాదేవి.
(మోహనరాగము - ఆదితాళము)
ప. హరి తిరువడులను కొలిచెదము
తిరు నామములనె పాడెదము
అ.ప.. పెరిగి లోకముల గొలిచిన పాదము
పరసాధనమని తెలిసి పాడుదము
1 చ. వ్రతమును చేయగ స్నానమాడెదము
ప్రతి నెల ముమ్మరు కురియు వర్షములు
వితత సస్యముల నెగయు మీనములు
మత్తిలి కలువల సోలు భ్రమరముల
2 ఛ. బలసిన గోవుల పొదుగుల తాకగ
కలశముల క్షీరధారలు కురియగ
శ్రీలెయెడతెగని ప్రసారములో యన
ఇల సిరులదూగు చేతుము వ్రతమును.
- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రంగనాథ్