Read more!

Tiruppavai Magazine Part – 9

 

9. పాశురము :

 

 

 



తూమణి మాడత్తు చ్చుత్తుమ్ విళక్కెరియ
తూపమ్ కమళ త్తుయిలణై మేల్ కణ్ వళరుమ్
మామాన్ మగళే! మణిక్కదవమ్ తాళ్ తిఱవాయ్
మామీర్! అవళై యెళుప్పీరో! ఉన్ మగళ్ దాన్
ఊమైయో? అన్ఱిచ్చెవిడో? ఆనన్దలో
ఏమప్పెరున్దుయిల్ మన్దిరప్పట్టాళో?
"మామాయన్, మాదవన్; వైగున్దన్" ఎన్ఱెన్ఱు
నామమ్ పలవుమ్ నవి న్ఱేలో రెమ్బావాయ్!


భావం: నిర్దోషమలైన మాణిక్యములతో నిర్మించిన భవనంలో చుట్టునూ దీపాలు వెలుగుతుండగా, అగరు ధూపములను పరిమళాలను వెదజల్లుచుండగా, అతిమెత్తనైన హంసతూలికా తల్పముపై పరుండి నిద్రిస్తున్న ఓ మేనమామ కూతురా! మణిమయ ప్రభలతో ప్రకాశించుచున్న నీ భవనపు గడియను తీయవమ్మా! ఏమమ్మా! మేనత్తా! నీవైనా ఆమెను లేపుమమ్మా! ఏమి? నీ పుత్రిక మూగదా? చెవిటిదా? లేక బద్దకస్తురాలా? లేక ఆమె లేవకుండగ ఎవరినైన కావలి వుంచినారా? లేక యింత మైమరచి నిద్రించుటకేమైన మంత్రించి వుంచినారా? ఆమెకేమైనది నిద్ర లేచుటలేదు? 'ఓ ఆశ్చర్య గుణచేష్టితుడా! ఓ శ్రియః పతీ! ఓ పరమపదవాసీ!' అని అనేకమైన తిరునామాలను అనుసంధిస్తున్ననూ ఆమెకు వినబడుటలేదేమి? ఇంకను లేవదేమి? అని సంపదలతో తులతూగుతున్న ఒక కన్యను లేపుచున్నారు.
   
    అవతారిక :-

 

 

 



'తూరుపుతెలవారె! ఓ జవ్వనీ లేవవే!' అంటూ పాడి 8వ (పాశురం) మాలికలో భగవదనుభవాన్ని పొందటానికి కుతూహలపడుతున్న ఒక గోపికను లేపి తన వ్రతంలో భాగస్వామిని చేసింది గోదాతల్లి. ఇప్పటివరకు శ్రవణం (వినటం) మననం (విన్నదానిని మాటిమాటికి స్మరించటం) వీటియొక్క విశిష్ఠతను తెలిపి ముగ్గురు గోపకన్యలను గోదా మేల్కొలిపి తన వ్రతంలో చేర్చుకొంది. ఇక (9మొదలు 12 మాలికలలో (పాశురాలలో) ధ్యానం యొక్క విశిష్ఠతను తెలుపబోతోంది. ఎల్లప్పుడూ శ్రవణము, మననమూ చేసే వారియొక్క మనస్సు పవిత్రమౌతుంది. నిర్మలమౌతుంది. మాలిన్యం తొలగితేనేకద జ్ఞానం చోటు చేసుకొనేది. అప్పుడా జ్ఞానమే ఆ జీవికి కవచమైపోతుంది. నిస్వార్ధమైన వ్రాత నిష్ఠ కలిగినవారికే తన్ను లభించే హక్కు కలదన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మరిక మనకు స్వాతంత్ర్యం ఎందుకు? పరమాత్మ తానే స్వయంగా మన వద్దకు వచ్చి మన అభీష్టాలను తీరుస్తాడు. కావున మనం ఎచటికినీ పోక వున్నచోటునే భగవదనుభవ ఆనందాన్ని అనుభవిస్తూ వుంటే చాలుననుకొని అతి సుందరమైన మణిమయ భవనంలో నిద్రిస్తూన్న నాల్గవ గోపికను (యీ మాలికలో) లేపుచున్నారు. 'ఓ మామకూతురా! మరదలా లేలెమ్ము!' అంటున్నారు.

        (కాంభోజి రాగము - ఆదితాళము)


1. ప..    ఓ మామకూతుర! మరదలా!

    అ..ప..    ఏమిది? మణిమయ ద్వారము తెరువవు?
    ఓ మామ కూతుర! మరదలా!

    చ..    పావన మణిమయ భావనమందున
    దివ్వెల వెలుగులు ధూపములమరగ
    దివ్యమౌ తల్పమున దిటవుగ శయనించి
    అవ్యక్తమైన నిద్దురపోదువటవే!

2  చ.    మూగద? చెవిటిద? మిగుల నలసినద?
    ఆగడప కావలి నందుంచబడినద ?
    ఆ గాఢ నిద్రకు మంత్రించబడినద?
    వేగమె లేపవె! నీ కూతునత్తరో!

3  చ.     లీలామానుష మాధువుడీతడు
    కేళీలోలుడు వైకుంఠవాసుడు
    చెలియలగూడి తిరునామ కీర్తనము
    ఇలవెలియగ పలుమారు పాడితిమి
    ఓ మామకూతుర! మరదలా!

- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రంగనాథ్