తిరుప్పావై ఇరవై రెండో రోజు పాశురం
తిరుప్పావై ఇరవై రెండో రోజు పాశురం
* అఙ్గణ్ మాఞాలత్తరశర్, అబిమాన
బఙ్గమాయ్ వన్దు నిన్ పళ్లిక్కటిల్ కీళే
శఙ్గమిరుప్పార్ పోల్ వన్దు తలైప్పెయ్ దోమ్
కిఙ్గిణివాయ్ చ్చెయ్ ద తామరై ప్పూప్పోలే
శెఙ్గణ్ శిఱిచ్చిణిదే యెమ్మేల్ విళియావో;
తిఙ్గళు మాదిత్తియను మెళున్దాఱ్పోల్
అఙ్గణిరణ్డు ఙ్గొణ్డు ఎఙ్గళ్ మేల్ నోక్కుదియేల్
ఎఙ్గళ్ మేల్ శాబ మిళిన్దులో రెమ్బావాయ్.
భావం :- ఈ సుందర సువిశాలమైన భూమిని ఏకఛత్రాధిపత్యముగ నేలిన రాజులందరును తమ కెదురెవ్వరు లేరను అహంకారమును వీడి, అభిమానులై నీ శరణు జొచ్చిరి. అనన్య శరణాగతిని చేయుచు నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరినట్లు మేమును అనన్య ప్రయోజనులమై వారివలె నీ శరణుజొచ్చినాము. మాకు నీవు దక్క వేరు దిక్కులేదు స్వామీ! చిరుమువ్వలు నోళ్ళు తెరచినట్లుగను, సగము విరిసిన తామరపూవువలెను మెల్లమెల్లగా విప్పారిన నీ సుందర నేత్రాలనుంచి జాలువారు వాత్సల్య కరుణారస దృక్కులను మాపై ప్రసరింపనిమ్ము. సూర్యచంద్రులుదయించెయనునట్లు కనిపించు నీ కన్నుదోయి నుంచి జాలువారే కరుణ వాత్సల్యం రసదృక్కులు మాపై ప్రసరించినచో మా కర్మ బంధములన్నీ తొలగిపోవును కనుక మా కర్మబంధములు తొలగగనే మేము నిన్ను చేరుకొందము కద! మా వ్రతమునకు పొందవలసిన ఫలము గూడ యిదియేగదా! యని ఆండాళ్ తల్లి కర్మ బంధం. తొలగితే ముక్తి లభిస్తుందని' తెలియజేస్తోంది.
అవతారిక :-
పరమాత్మను పొందాలని కోరుకొనేవారు స్వామికి సంపూర్ణ శరణాగతులవ్వాలి. సంపూర్ణ ప్రపత్తిని చేయాలి. స్వామి పాదాలచెంత వ్రాలి 'నీవు దక్క మాకు దిక్కులేదు. మేము పూర్తిగా నీవారమే' అనే శరణాగతి చేసి పాదాల నాశ్రయించాలని ఆండాళ్ తల్లి బోధిస్తోంది. ఈ మాలికలో - మేము నిన్ను స్తుతిస్తుండగా నీ అతిలోక సుందరమైన రూపాన్ని - అనగా మెల్లమెల్లగా నీ సూర్యచంద్రులవంటి కన్నులను వికసింపచేస్తుండగా అందుండి నీ కరుణా కటాక్ష వీక్షణాల వాత్సల్యరసపూర్ణధారలను తనివితీరా పొంది ఆనందించాలని వచ్చామని గోపికలు తెలిపారు. కర్మల కారణంగా పరమాత్మకు బహుదూరమైన జీవులు తిరిగి కలుసుకొనేటట్లు చేసేదే యీ ధనుర్మాస వ్రతమంటుంది మన ఆండాళు తల్లి.
(కల్యాణిరాగము - రూపక తాళము)
ప.. చిరు మువ్వలు నవ్వి నటుల వికసించిన కలువల వలె - ఆ
ఎరుపులీను కన్నుదోయి కరుణణు ప్రసరింపనీవె!
అ..ప.. సూర్యచంద్రులుదయించెనో? యట్టుదోచు కనుదోయిని
పరమాత్మా! మా పాపములన్ని బోవ చూడరావె!
1. చ.. అహంకార మమకారములణచి వచ్చి రాజులు - నీ
సింహాసనమునకు క్రిందగుంపు గూడియున్నట్టుల
అహము వీడి నీ సన్నిధి నంజలి ఘటియించినాము
మహాప్రభో! యింకనైన కటాక్షింపరావె! స్వామి
ఎరుపులీను కన్నుదోయి కరుణను ప్రసరింపనీవె!
- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రంగనాథ్