Tiruppavai Magazine Part - 12 (చక్రవర్తుల రంగనాథ్)
12. పాశురము :
కనైత్తిళజ్గత్తెరుమై కన్ఱుక్కిరజ్గి,
నినైత్తుములై వళియే నిన్ఱుపాల్ శోర,
ననైత్తిల్లమ్ శేఱాక్కుమ్ నఱ్చెల్వన్తజ్గాయ్!
పనిత్తలైవీళ నిన్ వాశల్ కడైపత్తి
చ్చినత్తినాల్ తెన్నిలజ్గైక్కోమానైచ్చెత్త
మనత్తుక్కినియానై ప్పాడవుమ్ నీవాయ్ తిఱవాయ్
ఇనిత్తా నెళున్దిరాయ్ ఈదెన్న పేరు ఱక్కమ్
అనైత్తిల్లత్తారు మఱిన్దేలో రెమ్బావాయ్.
భావం: లేగ దూడలను తలుచుకొని గేదెలు పాలను నిరాటంకంగా స్రవిస్తూ వున్నాయి. ఆ పాల ధారలతో ఇంటి ప్రాంగణమంతా తడిసి బురదయైపోయింది. ఇంత సంపద కలిగిన గోపాలునికి నీవు చెల్లిలివైతివి. ఓయమ్మా! మేమందరము నీవాకిటకు వచ్చి పైనమంచు కురియుచున్నను సహించి నీ గడపనానుకొని నిలిచియున్నాము. పైన మంచు కురియుచున్నది క్రింద పాలధారలు బురద చేయుచున్నవి. మేమంతా మనస్సులో మాధవునే నింపుకొని వున్నాము. పైన మంచు కురియటమనే శ్రీసూక్తి ధారల ప్రవాహం సాగిపోతూంది. కాళ్ళ క్రింద పాలధారలనే ఆచార్య ఉపదేశ ప్రవాహం సాగిపోతోంది. మనస్సులలో నిరంతర మాధవ సంశ్లేష భక్తి ధారల విచ్చిన్నంగా పొంగిపొరలుతున్నా ఈ ముప్పేట ధారలతో తడిసి, తడిసి కూడా నిన్ను మా గోష్ఠిలో చేర్చుకొనుటకై నీవాకిట గుమ్మాన్ని పట్టుకొని నిలబడి వున్నామమ్మా! ఆనాడు సీతమ్మను అపహరించాడన్న క్రోధముతో పరమాత్ముడైన శ్రీరాముడు ఆ స్వర్ణలంకాధిపతియైన పది తలల రావణుని మట్టుబెట్టిన వాని గుణగణాలను స్తుతిస్తున్నాము. కీర్తిస్తున్నాము. పాడుతున్నాము. మేమింత చేయుచున్ననూ నీవు నోరైన మెదుపుట లేదేమి తల్లీ! ఇది యేమి మొద్దు నిద్దరమ్మా! నీ గొప్పతనాన్ని మేమెరిగితిమిలేవమ్మా. నీ మొద్దు నిద్దుర విషయమంతా ఊరూ వాడ తెలిసిపోయిందిలే! ఇక నీ మొద్దునిద్దర చాలించి మేలుకో! (నీ ధ్యాన స్థితి నుంచి మేలుకో) మా గోష్ఠిలో చేరి వ్రతాన్ని సాంగోపాంగంగా పూర్తిచేయటానికి సహాయపడు అంటూ ఏడవ గోపికను లేపుచున్నారు.
అవతారిక :-
లక్ష్మణస్వామివలె శ్రీకృష్ణుని యెడబాయకుండా నిరంతరం కృష్ణానుభవాన్నే కోరుకొనే తపనలో తమ స్వధర్మాన్ని కూడా త్రోసిపుచ్చే ఒక గోపుని చెల్లిలిని మేల్కొలుపుతున్నారు. గోపాలురు, గోపికలు కృష్ణ సేవలో అంతరాయం కల్గనంతవరకే తమ స్వధర్మాలను ఆచరించేవారు. ఆ కృష్ణ సేవకు యీ స్వధర్మాలు అంతరాయం కలిగించినట్లయితే వానిని వెంటనే పరిత్యజించి కృష్ణసేవకే అంకితమయ్యే ధన్యజీవులీ గోకులంవారు. ఈ గోపిక కూడా ఇట్టి భావ సంపద కలిగినదే. శ్రీకృష్ణ మంత్రాన్ని అజపాజపంగా చేయటమే యీ జన్మ సార్ధక మంత్రం' కాబట్టి తైలధారవలెను, నదీ ప్రవాహంగాను మంత్రం మననం సాగిపోవాలని ఆండాళ్ తల్లి (యీ మాలికలో) వివరిస్తోంది.
(హమీరు కల్యాణి రాగము - ఏకతాళము)
ప.. ఇకనైనను లేచిరావె! ఏమి మొద్దునిద్దరే?
ఇకనైనను నోరు తెరచి మాటాడగ రాగదే?
అ..ప.. ఈ కన్నియలందరు నీ వాకిట గుమిగూడిరని
ఒకరొకరికి కాదు, ఊరు వాడంతట తెలిసినదే!
1. చ.. పాలు పిదుకువారు లేక మహిషీ గణ మరచుచు
పాలుద్రాగు లేగలందు భావము ప్రసరించి కారు
పాలముంగిలి తడియు సంపదగల వానికి చెల్లెల!
తలను మంచు పడుచున్నదె! గడప నాని యున్నామే!
2. చ.. దక్షిణ లంకకు ప్రభుడగు రావణు జంపినవానిని
అక్షయ మోదము గూర్చిన ఆ ఘన శ్రీరాముని
ఏ క్షణమును వీడక కీర్తించుచుండ వినలేదా?
ఈ క్షణమ్మునైన లేచి రావమ్మా! కొమ్మరో!
ఇక నైనను లేచిరావె!
- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రంగనాథ్