శ్రీ వేంకటేశ్వరుని సింగారము
శ్రీ వేంకటేశ్వరుని సింగారము
ప|| శ్రీ వేంకటేశ్వరుని సింగారము వర్ణించితే | యే విధాన దలచిన యిన్నటికి దగును ||
చ|| కరిరాజు గాచిన చక్రము పట్టిన హస్తము | కరి తుండమని చెప్పగా నమరును |
వరములిచ్చేయట్టి వరద హస్తము కల్ప- | తరు శాఖయని పొలుప దగు నీకును ||
చ|| జలధి బుట్టిన పాంచజన్య హస్తము నీకు | జలధి తరగయని చాటవచ్చును |
బలు కాళింగుని తోక పట్టిన కటి హస్తము | పొలుపై ఫణీంద్రుడని పొగడగ దగును ||
చ|| నలిన హస్తంబుల నడుమనున్న నీయుర- | మలమేలు మంగ కిరవన దగును |
బలు శ్రీ వేంకట గిరిపై నెలకొన్న నిన్ను | నలరి శ్రీ వేంకటేశుడన దగును ||
తాత్పర్యము
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సింగార వైభవము ఎన్నెన్నో ఉపమానాలకు తగినదై యున్నది.
గజేంద్రుని కాపాడటానికి ప్రయోగించిన చక్రమును పట్టిన చేయి, సముద్రములో పుట్టిన పాంచజన్యము అనే శంఖమును పట్టిన చేయి, బలమాదాంధుడైన
కాళింగుని తోకబట్టి మదమణచిన చేయి అందరికీ వరాలిచ్చే వరద హస్తము సాక్షాత్తు కల్పవృక్షము కొమ్మగా చెప్పవచ్చును. అతని దివ్య కరకమలాల
నడుమనున్న విశాలమైన వక్షము, నిత్య అనపాయినియైన అలవేలు మంగమ్మకు నెలవై అలరారుచున్నది.
ఇన్ని వైభవాలతో వేంకటగిరిని వెలసిన ఆ సింగార మూర్తిని "శ్రీ వేంకటేశ్వరుడు" అని సంభావించతగును.