తిరుమల పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు Tirumala 2nd Brahmotsavalu

 

తిరుమల పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు

Tirumala 2nd Brahmotsavalu

తిరుమల క్షేత్ర మహత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే తిరుమలను కలియుగ వైకుంఠం అంటూ వర్ణించాయి పురాణ గ్రంధాలు. అంటే భూతల స్వర్గం అన్నమాట. మొన్నీమధ్యనే దసరా సమయంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఇప్పుడు పద్మావతీ అమ్మవారికి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.

 

శ్రీ వేంకటేశ్వర స్వామివారికి బ్రహ్మోత్సవాలను తొలిసారి బ్రహ్మదేవుడు జరిపించాడని పురాణాలు పేర్కొన్నాయి. బ్రహ్మదేవుడు ఆరంభించాడు గనుక ఈ ఉత్సవాలకు బ్రహ్మోత్సవాలు అనే పేరు స్థిరపడిందని కొందరు వ్యాఖ్యానిస్తారు. మరో కథనాన్ని అనుసరించి నవబ్రహ్మలు నవాహ్నిక దీక్ష పూని తొమ్మిది రోజులపాటు స్వామివారికి ఉత్సవాలు జరిపించారని, అందుకే బ్రహ్మోత్సవాలు అనే పేరు వచ్చిందని అంటారు. మరికొందరు ఈ రెండు కథనాలనూ ఒప్పుకోరు. అసలు తిరుమల వేంకటేశ్వరునికి, బ్రహ్మదేవునికి ఏమీ సంబంధం లేదని, బ్రహ్మ అనంతానికి చిహ్నం కనుక ఈ ఉత్సవాలు కూడా మహా ఘనంగా జరుగుతాయి కనుక, గొప్పగా లేదా అనంతంగా అనే అర్ధంలో బ్రహ్మోత్సవాలు అని పిలుస్తున్నారని అంటారు.

 

తిరుమలలో దసరా సమయంలో శ్రీ వేంకటేశ్వరునికి జరిపే ఉత్సవాలను పెద్ద బ్రహ్మోత్సవాలని, పద్మావతీ అమ్మవారికి జరిపే ఉత్సవాలను చిన్న బ్రహ్మోత్సవాలని అంటారు.

 

తిరుమలలో నిత్య కల్యాణం పచ్చ తోరణంగా ఎప్పుడూ భక్తజన సందోహంతో కళకళలాడుతుంది. మామూలు రోజుల్లోనే లక్షకు పైగా భక్తులు వస్తుంటారు. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో సంగతి చెప్పనవసరం లేదు. ఈ ప్రత్యేక ఉత్సవాల సమయంలో స్వామివారిని దర్శించుకుంటే మరింత పుణ్యం వస్తుందని విశ్వసించే భక్తులు తిరుమలకు తరలివస్తారు. దేశం నలుమూలల నుండీ తరలివచ్చిన భక్తులతో తిరుమల క్షేత్రం ఇసుక వేస్తే రాలనట్లుగా ఉంటుంది.


Tirumala Brahmotsavam, Padmavati Ammavari Brahmotsavam, Pilgrims in Tirumala Brahmotsavam, Ammavari Brahmotsavalu, Lord Venkateswara Brahmotsavam