పువ్వులు పండ్లు కాదు.. ఇనుప సుత్తులు సమర్పించే దేవాలయం ఇదెక్కడంటే!

 

 పువ్వులు పండ్లు కాదు.. ఇనుప సుత్తులు సమర్పించే దేవాలయం ఇదెక్కడంటే!

సాధారణంగా  గుడికి వెళ్ళినప్పుడు, దేవుడికి పువ్వులు, పండ్లు, తీపి పదార్థాలు లేదా ఇంట్లో వండిన ఆహార పదార్థాలు  లేదా కొబ్బరికాయలు  నివేదిస్తుంటారు. అయితే, మన దేశంలో ఒక ప్రత్యేకమైన గుడి ఉంది, అక్కడ భక్తులు అమ్మవారికి ఇనుప సుత్తులను సమర్పిస్తారు. ఇది వినడానికి కొంచెం వింతగా, ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఇది అక్షరాలా నిజం. ఈ అద్భుత పుణ్యక్షేత్రం ఉత్తరాఖండ్‌లోని  కుమావోన్ ప్రాంతంలో ఉంది. ఇక్కడి పర్వతాల మధ్య నెలకొని ఉన్న ఈ పుణ్యక్షేత్రంలో, కోరికలు నెరవేరినప్పుడు సుత్తులను సమర్పించే వింత సంప్రదాయం శతాబ్దాలుగా  పాటిస్తున్నారు.  ఇక్కడ ఎందుకు ఇలాంటి సంప్రదాయం ఉంది? ఈ దేవాలయం ప్రాముఖ్యత ఏమిటి?  వివరంగా తెలుసుకుంటే..

తుది తీర్పు ఇక్కడే..

స్థానికులు , భక్తులు ఈ పవిత్ర ఆలయాన్ని అంతిమ న్యాయస్థానంగా భావిస్తారు. న్యాయస్థానాలు, పోలీసులు లేదా సమాజం నుండి న్యాయం పొందడంలో విఫలమైన వారికి ఈ ప్రదేశమే చివరి ఆశ అని  గట్టిగా నమ్ముతారు. బాధితులు కన్నీళ్లతో ఇక్కడికి వచ్చి అమ్మవారిని వేడుకుంటారు. అది భూ వివాదమైనా, వ్యక్తిగత తగాదా అయినా, లేదా తప్పుడు ఆరోపణ అయినా, తమ బాధలను ఒక కాగితంపై రాసి అమ్మవారి పాదాల వద్ద వదిలివేస్తారు. ఆ తర్వాత, అమ్మవారు స్వయంగా ఆ విషయాన్ని పరిష్కరిస్తారట.

కోరిక తీరగానే సుత్తి సమర్పణ..

ఈ దేవాలయంలో సుత్తిని ఎందుకు సమర్పిస్తారని చాలా మంది అనుకుంటారు. అయితే  దీని వెనుక ఒక నమ్మకం ఉంది.   న్యాయమూర్తి కోర్టులో తీర్పు చెప్పేటప్పుడు సుత్తిని ఉపయోగించినట్లే, సుత్తిని బలానికి, కఠినమైన నిర్ణయాలకు , న్యాయ శక్తికి చిహ్నంగా భావిస్తారు. అమ్మవారి దగ్గర బాధపడుతున్న వ్యక్తి  అమ్మవారి దగ్గర తమ సమస్యను విన్నవించుకున్న తర్వాత ఆ సమస్య తీరితే అమ్మవారి న్యాయస్థానం నుండి అతనికి నిజమైన న్యాయం లభించినట్టు అర్థం, అతను తన కృతజ్ఞతను తెలియజేయడానికి వారి స్తోమతను  బట్టి వారు అమ్మవారికి ఇనుప సుత్తిని, రాగి త్రిశూలాన్ని లేదా ఇత్తడి గంటను సమర్పిస్తారు. అందుకే ఈ ఆలయంలో నేడు వేలాది చిన్న, పెద్ద సుత్తులు పోగయ్యాయట.

శిక్ష..

కోటగడి దేవి కోర్టులో నిర్దోషికి ఎంత త్వరగా న్యాయం జరుగుతుందో, దోషి కూడా అంతే కఠినమైన శిక్షను అనుభవించాల్సి వస్తుందట. ఇక్కడికి ఎవరైనా అబద్ధాలకోరు వచ్చి తిట్లు తిట్టినా లేదా నిర్దోషిని ఇరికించడానికి ప్రయత్నించినా, ఆ తల్లి అతడిని ఎన్నటికీ క్షమించదని స్థానికులు చెబుతుంటారు. దోషి కుటుంబం అకస్మాత్తుగా కష్టాల్లో పడటం లేదా తీవ్రమైన అనారోగ్యానికి గురికావడం జరుగుతుందట. ఈ తల్లి విధించే కఠినమైన శిక్ష  గురించిన భయం ఉండటం వల్ల , ఈ ప్రాంతమంప్రజలు ఇప్పటికీ ఎవరినైనా మోసం చేయడానికి లేదా అబద్ధం చెప్పడానికి చాలా భయపడతారట.

దేశం నలుమూలల నుండి వస్తారు..

ప్రశాంతమైన, సుందరమైన పర్వత పరిసరాల మధ్య నెలకొని ఉన్న ఈ ఆలయం పట్ల దేశం మొత్తం మీద చాలా గట్టి నమ్మకం ఉంది. ఉత్తరాఖండ్ స్థానికులే కాకుండా, దేశం నలుమూలల నుండి ప్రజలు తమ సమస్యలతో ఇక్కడికి వస్తుంటారట. ఆలయ ప్రాంగణం నలువైపులా వేలాడుతున్న వేలాది సుత్తులు, గంటలు ఇక్కడికి సమస్యతో వచ్చే ఏ వ్యక్తి తన సమస్య పరిష్కారం కాకుండా ఉండడు అనటానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

                                   *రూపశ్రీ.