తిరుప్పావై పాశురం 4 (చక్రవర్తుల రంగనాథ్)
తిరుప్పావై నాల్గవరోజు పాశురం
4.పాశురము :
* ఆళి మళైక్కణ్ణాః ఒన్ఱు నీ కైకర వేల్
ఆళి యుళ్ పుక్కు మగన్ధు కొడార్ త్తేఱి
ఊళి ముదల్వనరువమ్ పోల్ - మెయ్ కఱుత్తు
పాళి య న్దోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్
ఆళి పోల్ మిన్ని వలమ్బురి పోల్ నిన్ఱ దిర్ న్దు
తాళాదే శార్ ఙ్గం ముదైత్త శరమళై పోల్
వాళ వులగినిల్ పెయ్ దిడాయ్ - నాజ్గళుమ్
మార్ గళి నీరాడ్ మాగిళ్ న్దేలో రెమ్బావాయ్.
భావము: ఓ పర్జన్య దైవమా! వర్షమును కురిపించుటలో లోభత్వమును జూపకుము. నీవు సముద్రములోని నీటి నంతను కడుపు నిండుగ త్రాగుము, అటుపిదప నీవు పైకెగసి, సృష్టికంతకును కారణభూతుడైన ఆ శ్రీమన్నారాయణుని శరీరపు రంగు వలె నీ శరీరమునకును ఆ నలుపురంగు నద్దుకొనుము. స్వామి కుడి చేతియందున్న సుదర్శన చక్రము వలె మెరయుము. ఎడమ చేతిలోని పాంచజన్య శంఖమువలె గంభీరముగా గర్జించుము. స్వామి సారంగమను ధనుస్సు నుండి వెడలే అవిరళ శరాలుగ వర్షధారలను కురిపించుము. మేమందరము యీ వర్ష ధారలలో స్నానమాడెదము. లోకము సుఖించునట్లు వర్షించుము మా వ్రతమును నిరాటంకముగ జేసికొనుటకై యిక ఏ మాత్రమూ ఆలసింపక వెంటనే వర్షింపుము స్వామీ!
అవతారిక
సర్వవ్యాపాకుడైన త్రివిక్రముని వ్యాపకత్వాన్ని యెరిగి ఆ పురుషోత్తముని కొలిచిన కలిగే ఫలితాలను గురించి 3వ పాశురంలో గోదాదేవి వెల్లడించింది. అట్టి పరమాత్ముని యేమరక భక్తితో పూజించే శక్తియుక్తులు కావలెనన్న ముందు శారీరక శుద్ధి, ఆపై అంతర్ శుద్ధి అవసరం కద! అందుకే బాహ్య శుద్ధి కొరకు గోదాదేవి వర్షదేవుడైన వర్జన్యుణ్ణి ప్రార్థంచి వ్రతాంగమైన స్నానానికై వర్షించమని కోరుతున్నదీ పాశురంలో.
(ఉదయరవిచంద్రిక రాగము -ఆదితాళము)
ప. వెనుదీయబోకుమా! వర్జన్యమా!
కనికరముంచుమ! వర్షాధిదైవతమ!
అ. ప. పానము చేయుమ! సాగర జలముల
ఘనమౌ గర్జన చేయగరమ్మా!
1 చ. ఆకాశమున కెగసి లోకకారణుని
పోకడి తిరుమేని నలుపు నలదుకొనుమ
2 చ. విశాల సుందర భుజ పద్మనాభుని
అసదృశమగు చక్రమువలె మెరసి
ఆశనిపాత శంఖముగ గర్జించి
ఆ శార్జపు శరములుగ వర్షింపుమా
3 చ. ఆశల, లోకము సుఖముల నొందగ
మాస మార్గళిని మాకై వర్షింపుమా
వెనుదీయబోకుమా! పర్జన్యమా!
- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రంగనాథ్