యయాతి కథ అందరికీ తెలిపే నీతి ఏమిటి?
యయాతి కథ అందరికీ తెలిపే నీతి ఏమిటి?
పురాణ కథలలో యయాతి కథ అందరికీ తెలుసు. యయాతి ఆరు రోజులలో మహీమండలాన్నంతా జయించిన ఘనుడు. వార్ధక్యదశలో సన్న్యాసం స్వీకరించేందుకు సిద్ధమయ్యాడు. శరీరం కృశించింది కానీ కోరికలు నశించలేదు. మళ్ళీ యౌవనం వస్తే యౌవనసాఖ్యాలు అనుభవించవచ్చన్న ఆశ కలిగింది. దాంతో అయిదుగురు పుత్రులనూ పిలిచి వారిలో ఎవరైనా ఒకరిని తనకు యౌవనం ఇచ్చి, తన వార్ధక్యం తీసుకోమని కోరాడు. కానీ రాజు జరాభారం గ్రహించేందుకు అతని పుత్రులు ముందుకు రారు. చివరికి 'పూరుడు' ముందుకు వస్తాడు. తండ్రి వార్ధక్యం తాను స్వీకరించి, తన యౌవనాన్ని తండ్రికి సమర్పిస్తాడు. మళ్ళీ యౌవనం సాధించిన యయాతి, విశ్వాచితో కలసి 'సమార్గ మాణః కామానా మంతం', అంటే కామం అంతాన్ని వెతుకుతూ భూమి అంతా విహరిస్తాడు. సంతృప్తి కలిగిన తరువాత పూరుడికి యౌవనం ఇచ్చేసి వానప్రస్థాశ్రమం స్వీకరిస్తాడు. ఇది యయాతి కథ. పై మాటలు యయాతి అనుభవసారాలు.
కోరికలు ఎంత తీర్చుకుంటే అంత పెరుగుతాయి. కోరికలు తీరే దాకా తీర్చుకుని, వాటిపై విముఖత కలిగేంతవరకూ అనుభవించి, ఆపై కోరికలను విసర్జించాలని కొందరు ఓ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆశ్రమాలు స్థాపించి, ఎవరికి ఎవరిపై ఏ కోరిక కలిగినా వెంటనే తీర్చుకోవచ్చని స్వేచ్ఛనిచ్చారు. కానీ తీర్చుకుంటే తీరేదైతే అది కోరికనే కాదు. ఆశ్రమంలో వికృతులు జనించాయి. వ్యక్తులు మానసికంగా గాయపడ్డారు. కొన్నాళ్ళకి ఆ సిద్ధాంతకర్తల మోసం బయటపడింది. తమ వికృతలైంగికేచ్చలకు సిద్ధాంతం, ఆధ్యాత్మికతల ముసుగు వేసి ప్రజలను మభ్యపెడుతున్నారని తెలిసింది. వారి కథ అంతటితో ముగిసింది. కానీ హిందూధర్మ సిద్ధాంతంలో అది ఒక మాయని మచ్చలా మిగిలింది.
భారతీయధర్మంలో 'కామం' అంటే కేవలం 'లైంగికం' కాదు. ఎటువంటి కోరిక అయినా కోరికే. సృష్టిచేయాలన్న భగవంతుడి తలంపును కూడా (సిసృక్ష) కోరిక అన్నారు. కాబట్టి, చిన్నది. పెద్దది అన్న సంబంధం లేకుండా ప్రతి కోరిక 'కామం' కిందికే వస్తుంది. ఇటువంటి కోరికలు తీర్చుకుంటే తరగవు. 'కౌపీన సంరక్షణార్థం' సన్న్యాసి సంసారైన కథ అందరికీ తెలుసు. ఈ నిజాన్ని వివరిస్తుంది యయాతి కథ.
రాజుగా సర్వభోగాలను అనుభవించాడు యయాతి. ఐనా సరే, ఇంకా భోగాలను అనుభవించాలన్న తృష్ణ తీరలేదు. ఆ కోరిక అతడి విచక్షణను కప్పేసింది. తన యౌవనాన్ని తాను సంపూర్ణంగా అనుభవించాడు. తన సంతానానికి వారి యౌవనాన్ని అనుభవించే హక్కుందన్న విషయం మరచాడు. కోరికలను తీర్చుకోవాలన్న తృష్ణ ఈ వయసులో తనకే ఇంత ఉంటే, యౌవనంలో ఉన్నవారికి ఇంకెంత ఉంటుందో అన్న ఆలోచనను విస్మరించాడు.
కోరకూడని కోరికను సంతానాన్ని కోరాడు. తన కోరికను సంతానం నిరాకరించటం సమంజసమే. ఎందుకంటే, వారింకా జీవితాన్ని అనుభవించే దశలోనే ఉన్నారు. తాను జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించాడు. ఐనా సరే, తన కోరికను సంతానం కాదనేసరికి విచక్షణను మరచి, ఆవేశంతో వారిని శపించాడు. నిర్లజ్జగా, తన చిన్న కొడుకుకు తన వార్ధక్యం ఇచ్చి, అతని యౌవనం స్వీకరించి, సుఖభోగాలు మళ్ళీ అనుభవించాడు. ఐనా సుఖలాలస వదల్లేదు. కోరికల దుగ్ధ వదలలేదు. అప్పుడు యయాతి ఈ నిజాన్ని గ్రహించాడు. భూమిలోని ధనధాన్యాలు, బంగారం వంటి విలువైన వస్తువులు, పశువులు, స్త్రీలు ఇవేవీ వ్యక్తికి తృప్తినివ్వవని అర్ధం చేసుకున్నాడు. ఇవన్నీ కామప్రేరేపకాలే తప్ప కామాన్ని చల్లార్చేవి కావని గ్రహించాడు. యయాతి కథ అందరికీ ఓ పెద్ద పాఠం లాంటిది.
◆నిశ్శబ్ద.