పరశురాముడు కార్తవీర్యార్జునుడి విషయంలో చేసిన తప్పేమిటి?

 

పరశురాముడు కార్తవీర్యార్జునుడి విషయంలో చేసిన తప్పేమిటి?

హైహయ వంశీయుడు 'కార్తవీర్యార్జునుడు' దత్తాత్రేయుని ఆరాధించి అణిమాది అష్టసిద్ధులను పొందాడు. అలా అష్టసిద్ధులను పొందిన అతను తనకున్న యోగశక్తి ఉపయోగించి కావలసినపుడు వేయి బాహువులను పొందగలిగేవాడు. పరాక్రమంలో అతనిని మించినవారు క్షత్రియులలోగానీ, రాక్షసులలోగానీ ఇతన్ని మించినవారు అపుడు ఎవరూ లేరు.

అతడు ఒకరోజు  వేటకోసం అడవులలో  విహరిస్తూ జమదగ్ని మహర్షి ఆశ్రమం వద్దకు వచ్చాడు. మహర్షిని సందర్శించడానికి అతడు ఆశ్రమంలోకి ప్రవేశించాడు. మహారాజుకు జమదగ్ని స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లాడు. జమదగ్ని ఆశ్రమంలో ఒక హోమధేనువు  ఉండేది. ఆ హోమధేనువు మహిమచేత కార్యవీర్యార్జునుడు మంత్రి, సేనాపతులతో కలసి అక్కడ ఎంతో ఆశ్చర్యకరమైన ఆతిథ్యాన్ని స్వీకరించాడు. అక్కడున్నవాళ్ళు అందరూ ఆ గోవుయొక్క మహిమకు  ఆశ్చర్య పరవశులైపోయారు, "ఇటువంటిది ఒకటి ఈ లోకంలో ఉందా?" అని ప్రశంసించారు. సాటిలేని ఐశ్వర్యంతో విరాజిల్లుతున్న ఆ మహారాజుకు ఆ ప్రశంసలు భరింపరానివయ్యాయి. తన సంపదను మించిన సంపదకు సాధనమైన 'గోరత్నం' ఒక సామాన్య బ్రాహ్మణుని వద్ద ఉండటం, తన ప్రతిష్టకు కొరత కలిగినట్లుగా భావించాడు. అలా అనుకోగానే అతను వెంటనే "ఆ గోవును దూడతోసహా రాజధానికి తీసుకొని రండి" అని భటులకు ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు.

అపుడు'పరశురాముడు ఆశ్రమంలో లేడు. రాజభటులు హోమ ధేనువును, దూడను బలవంతంగా తీసుకొని వెళ్ళిన కొంతసేపటికి పరశురాముడు ఆశ్రమానికి తిరిగివచ్చాడు. అతనిని చూడగానే ఆశ్రమవాసులందరూ ఎదురువెళ్లి కన్నీళ్ళతో కార్తవీర్యుని దౌర్జన్యం గురించి చెప్పారు. ఆ మాటలు వినగానే పరశురాముడు చెప్పలేనంత కోపంతో వెంటనే కవచమును, అక్షయమైన అమ్ములపొదిని ధరించి, విష్ణు ధనుస్సును, పరశువును తీసుకొని మహిష్మతీ నగరంవైపు పరుగెత్తాడు. అప్పటికి ఇంకా రాజు నగరంలోకి ప్రవేశించలేదు. పరశురాముని గట్టిగా అరుస్తూ వెళ్ళేసరికి, ఆయన సింహగర్జనను విని సైన్యం సంభ్రమంతో వెనక్కి తిరిగి అతనిని చుట్టుముట్టారు. పరశురాముడు ఒక్క పిడికిలిలో వందల బాణములను సంధించి ప్రయోగిస్తూ, దగ్గరకు వచ్చిన వారిని  పరశువుతో వదిస్తూ సైన్యాన్ని అంతటిని నిర్మూలించాడు.

అప్పటివరకు గోరత్నము మాత్రమే వాళ్ళతో ఉందని అనుకున్న కార్యవీర్యార్జునుడు, పరశురాముడిలో ఉన్న పరాక్రమాన్ని చూసి ఆశ్చర్యపోయి వెంటనే తనకున్న శక్తులను గుర్తుచేసుకుని విజృంభించి, అయిదు వందల చేతులతో అయిదు వందల ధనుస్సులను ధరించి, మిగిలిన అయిదు వందల చేతులతో బాణములను సంధిస్తూ తన రథమును పరశురామునివైపు నడిపించాడు. 

అది చూసిన పరశురాముడు ఉగ్రుడై ఒక్క వింటిలోనే అయిదు వందల బాణములను సంధించి కార్యవీర్యార్జునుడి ధనుస్సులను ఖండించి, కనురెప్పపాటులోనే రథముపైకి లంఘించి కార్తవీర్యుని వేయి బాహువులను, తలను ఖండించి సింహగర్జనం చేసాడు. అది చూసి కార్తవీర్యుని పదివేల మంది కొడుకులు భయభ్రాంతులై పారిపోయారు. రాముడు దూడతోసహా హోమధేనువును తీసుకొని ఆశ్రమానికి తిరిగి వచ్చాడు.

ఆశ్రమవాసులందరూ ఆశ్చర్యంతో, ఆనందంతో పరశురాముడి చుట్టూ చేరి జయ జయ ఘోషలు చేస్తుండగా, రాముడు తండ్రివద్దకు వెళ్ళి నమస్కరించి యుద్ధ వృత్తాంతమును వర్ణించాడు. అప్పుడు జమదగ్ని మహర్షి అంతా శాంతంగా విని “నాయనా రామా! సర్వదేవమయుడైన మానవేంద్రుని వధించి మహాపాపం చేసావు. తండ్రీ! మనం బ్రాహ్మణులం కదా! బ్రాహ్మణులు క్షమాగుణంచేత పూజింపబడుతున్నారు. లోకగురువైన విధాత క్షమచేతనే బ్రహ్మ పదవిని పొందాడు. సూర్యునిలో కాంతిలాగా, మనలో బ్రాహ్మి అయిన లక్ష్మి  క్షమచేతనే నివాసం ఉంటుంది. విష్ణుదేవుడు క్షమావంతుల విషయంలోనే సంతోషం పొందుతాడు. రాజును చంపుట, బ్రహ్మహత్యకన్నా మించిన పాతకము. కాబట్టి విష్ణుదేవుని ధ్యానిస్తూ, తీర్ధములను సేవిస్తూ ఈ పాపమును పోగొట్టుకో" అని సలహా ఇచ్చాడు.

తండ్రి ఆదేశంతో రాముడు అలాగే ఒక సంవత్సరం తీర్థయాత్రలు చేసి పాపరహితుడై తిరిగి వచ్చాడు పరశురాముడు.

                                  ◆నిశ్శబ్ద.