నేను అతన్ని కాను

 

 

 

బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత తల్లిదండ్రులను చూడటానికి ఇంటికి వస్తాడు. కన్నా కొడుకుని మార్చడానికి తల్లితండ్రులు ఏవేవో చెప్పి చూస్తారు. అతడు మారుతాడు అనుకుంటారు.  అయినా బుద్ధుడు పూర్వాశ్రమ జీవితానికి రాలేదు. తమ ప్రయత్నాలన్నీ విఫలమైనందుకు తండ్రి బాధ పడ్డారు. కోపం వచ్చింది. ఈ విశాల రాజ్యాన్ని ఎవరు పదిలంగా పాలిస్తారన్నది ఆయన ప్రశ్న. జ్ఞానం పొందిన తర్వాత బుద్ధుడు తండ్రిని కలిసిన ఘట్టం మానవజాతి చరిత్రలో స్థిరమైనది. సుస్థిరమైనది. బుద్ధిడి వంక తండ్రి తదేకంగా చూసారు. కోపంతో ఆయన కళ్ళు ఎరుపెక్కాయి. బాధను ఎలా వ్యక్తం చేయాలో అర్ధంకాక అరుస్తారు. గొడవపడతారు.  పరుషపదజాలంతో తిడతారు. తండ్రి ఎంతగా అరిచిగీపెట్టినా బుద్ధుడు తన చుట్టూ ఏమీ జరగనట్టు,  నిమ్మకు నీరెత్తినట్టు ఉంటాడు. తండ్రి చెప్పిన మాటలన్నీ వింటాడు. చాలా ప్రశాంతంగా తండ్రి వైపు చూస్తాడు. ఆయన చూపులో ఎక్కడా అయోమయం గానీ గందరగోళం గానీ లేదు.  కాలం సాగుతోంది. సెకండ్లు  నిమిషాలుగాను, నిమిషాలు గంటలుగానూ సాగుతున్నాయి. వయస్సు పైబడిన తండ్రి అరిచి అరిచి నీరసించి పోతారు.  మౌనం..మౌనం..మౌనం ఆవరించింది. బుద్ధుడు ఒక్క మాటా మాట్లాడలేదు. "వీడేమిటి ఇలా ఉన్నాడు? ఒక్క మాటా మాట్లాడడూ..? ఏమైంది వీడికి? పిచ్చిపట్టిందా? లేక చెవులు పని చెయ్యడం లేదా? " అని తండ్రి ఆలోచిస్తాడు.

 

తండ్రి ముఖ కవళికలు గ్రహిస్తాడు బుద్ధుడు. నోరు విప్పుతాడు. "మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిన వాడు ఇప్పుడు లేకుండా పోయాడు. మీరు ఇప్పుడు నాతో మాట్లాడ లేదు. మీరు మీ కొడుకుతో మాట్లాడుతున్నారు. అతను వెళ్లి పన్నెండేళ్ళు అయ్యాయి. నేను వాడిని కాను" అని ఎంతో ప్రశాంతంగా స్పష్టంగా చెప్తాడు బుద్ధుడు. తండ్రికి మళ్ళీ కోపం వచ్చింది. ఆ కోపం ఇలాంటి అలాంటి కోపం కాదు. కోపంతో తకుతలాడుతున్నారు.  "నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా? నా కొడుకు నాకు తెలీదా? నేను గుర్తు పట్టలేనా? నిన్నూ తెలుసు...నా కొడుకునీ తెలుసు. నా రక్తము నీలో ఉండటాన్ని నువ్వొకసారి ఆలోచించు..." అన్నారు బుద్ధుడు తండ్రి. అప్పుడు బుద్ధుడు అంటాడు ఇలా... "నేను అదే స్మరణతో లేను. ఆ విషయాలను వదిలేసాను. నేను ఇప్పుడు కొత్తవాడిని. నేను ఎవరో నేనేమిటో నాకు తెలుసు. మీ కొడుకు గురించే మీకు తెలుసు. నేను అతను కాదు అని అందుకే చెప్పాను. తెలుసుకోండి" అని.

- యామిజాల జగదీశ్