ఎవరూ మార్చలేనిది విధి
విధి అంటే లలాట లిఖితం అని మాత్రమే అర్తం కాదు. ‘విధి’ అంటే కర్తవ్యం అనికూడా అర్థం. ‘విధి అనుల్లంఘనీయం’ అనునది శాస్త్రం. ‘శాసించేది’ శాస్త్రం. ఏది శాస్త్రం? వేదమే శాస్త్రం. వేదం ..‘ఇలా చెయ్యి’ అని శాసిస్తుందే కానీ..చెప్పదు. వేదం ఏదైతే చెబుతుందో అలా నడచుకునేవాడు సర్వసుఖాలు అనుభవిస్తాడు. అలా కాక.....
యశ్శాస్త్ర విథి ముత్సృజ్య - వర్తతే కామ కారతః
నస సిద్ధి మవాప్నోతి - న సుఖం న పరాంగతిమ్
‘శాస్త్ర విషయములను అనుసరింపక..,తన ఇష్టము వచ్చినరీతిలో సంచరించు జీవుడు ఇహలోక సుఖాలు అనుభవించలేడు.., మరణించిన అనంతరం పరలోక సుఖాలు అనుభవించలేడు.’ అని గీతాచార్యుడు కురుక్షేత్ర రణభూమిలో ఉపదేశం చేసింది కేవలం అర్జునునకు మాత్రమే కాదు.., పరోక్షంగా మనకు కూడా. కనుక, వాద ప్రతివాదాలకు, తర్క వితర్కాలకు తావీయకుండా ‘శాస్త్రం’ చెప్పినది చేయడమే మన విధి. ‘శాస్త్రం’ ఇంత నిరంకుశమైనదా అని మీరు అడగవచ్చు. కచ్చితంగా నిరంకుశమైనదే. అందులో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకో... ‘యోగి వేమన’ ఇలా చెప్తాడు.
చాకివాడు కోక చీకాకు పడజేసి
మైలదీసి లెస్స మడిచినట్లు
బుద్ధిచెప్పువాడు గ్రుద్దిన నేమయా
విశ్వదాభిరామ వినుర వేమా
‘చాకలి వృత్తి చేసే వ్యక్తి, మాసిన దుస్తులను ఉడకబెట్టి, బండమీద బాది, వేడివేడి ఇస్త్రీపెట్టి క్రింద పెట్టి బాగా చలువచేసి చకుకగా మడతబెట్టి ఇచ్చినట్టు...మన మేలుకోరి బుద్ధి చెప్పేవాడు గ్రుద్దితే మాత్రం తప్పేమిటి?’ ‘శాస్త్రం’ కూడా ఇంత కర్కశంగానూ..నిష్కర్శగానూ చెబుతుంది. ‘శాస్త్రం’ చెప్పినట్టు నడచుకుంటే నిజంగా సుఖపడతామా అనే సందేహం మీకు కలగచ్చు. ‘సుఖపడతారు’ అని నిస్సందేహంగా చెప్పడానికి ఈ ప్రకృతే మనకు ప్రమాణం. ఎందుకంటే ‘ప్రకృతి ధర్మాలను’ ప్రవచించేదే ‘శాస్త్రం’. ప్రకృతికి విరుద్ధమైనది ఏదైనా..అది వికృతే,వినాశనమే. ప్రాణి ఉత్పత్తి, పెంపు, నశింపులకు ప్రకృతే కారణం. కనుక ప్రకృతి ధర్మాలకు విరుద్ధమైనది ఏదైనా.. అది సుఖాన్ని, ఆనందాన్ని ఇచ్చేది అయినా ఆచరణదాయకము శ్రేయోదాయకము ఎంత మాత్రమూ కాదు. ఇది సత్యము అని చెప్పడానికి మీకు కొన్ని నిదర్శనాలు చూపిస్తాను. ప్రస్తుత వైద్యశాస్త్రం ఏమని చెబుతోంది? ‘సిగరెట్లు కాల్చద్దు.. క్యాన్సర్ వ్యాధితో చస్తారు’ అని ఎన్ని విధాలుగా చెప్పాలో అన్ని విధాలుగా చెప్తోంది. విన్నవాళ్లు ఆరోగ్యంగా ఉంటున్నారు. విననివాళ్లు చస్తున్నారు. ఏ శాస్త్రం చెప్పినా ఇంతే. దాని పరిధిలో మంచి చెడులను విశదీకరించి చెప్తుంది. అలాగే ప్రకృతి కూడా జీవి జీవన విధానాలను, ఆచరించవలసిన ధర్మాలను చెప్తుంది. ప్రకృతి ధర్మాలకు కట్టుబడి జీవించేవారిని ప్రకృతి కూడా జయించలేదు. దీనికీ నిదర్శనం ఉంది. ‘ఆహార నిద్ర భయ మైథునాని సామాన్యమేతత్ పశుభి స్సమానాః’ ‘ఆకలి, నిద్ర, భయము, శృంగార జీవనము మనకు ఉన్నట్లే తక్కిన ప్రాణులన్నింటికీ ఉన్నాయి. కానీ..,ఈ ప్రకృతిలోని ప్రాణులన్నీ ప్రకృతి ధర్మానుసారం నడచుకుంటాయి, ఒక్క మానవుడు తప్ప. అందుకే ‘ఆర్య చాణక్యుడు’ ఇలా అంటాడు...
‘ఆకలి కాకున్నా.., ఆహారం తినే పశువు
దాహం కాకున్నా.., నీరు త్రాగే పశువు
నిద్ర రాకున్నా నిద్రకు ప్రయత్నించే పశువు
అకాలంలోను, అన్ని కాలాల్లోనూ రమించి,
క్రీడించే పశువు...., మానవుడు ఒక్కడే’
ఆకలి వేసినప్పుడు మాత్రమే జంతువు వేటాడి తింటుంది., దాహం వేసినప్పుడు మాత్రమే నీరు త్రాగుతుంది., నిద్ర వచ్చినప్పుడే నిద్రపోతుంది., ప్రకృతి నియమానుసారం సంసార జీవనం సాగిస్తూ సంతానం కంటుంది. కానీ.. మానవుడు అలా కాదు....
- ‘రా రా సరదాగా మిర్చిబజ్జి తిందాం’ అని తింటాడు. సరదాగా తినడం ఏమిటో నాకు ఇప్పటికీ అర్థం కాదు.
- ‘రా రా జస్ట్ టైమ్ పాస్ టీ తాగుదాం’ అని టీ తాగుతారు. ఇక బీరు, బ్రాందీ, విస్కీలకు అంతే లేదు. ‘ఈ తాగుడేమిట్రా..చస్తావ్’ అంటే ‘పోతే పోనీరా..ఎదవ పాణం., ఈ ఆనందం కన్నానా’ అని ఒకడంటే.. ‘సారీ బాసూ..వదల్లేకపోతున్నాను., తాగకపోతే ఇప్పుడే చస్తాను’ అని మరో రెండు పెగ్గులు లాగించేస్తాడు. వినోదానికీ తాగుతాడు.. విషాదం వచ్చినా తాగుతాడు.
- ‘ఏం చేస్తున్నావురా’ అని ఫోను చేస్తే ‘అయామ్ ట్రయింగ్ ఫర్ స్లీప్’ అని బదులిస్తాడు. ‘నిద్రకు ప్రయత్నించడమేమిటో ఖర్మ.’ మనిషి ఆశాజీవి అనుకుంటాం కానీ..నిజానికి రేపెలా? అనే భయంతో క్షణక్షణం చస్తూ బతుకుతూంటాడు. తక్కిన ప్రాణులకు ‘రేపెలా’ అనే భయం లేదు. అందుకే వాటికి ఆ సమయానికి ఆహారం దొరుకుతుంది. అవి పస్తులుండవు. ఆకలుతో పస్తులుండేది మనిషి ఒక్కడే. రేపు తన మునిమనుమడు ఎక్క ఆకలితో బాధపడతాడో అన్న భయంతో వీడు ఇప్పటి నుంచీ నిద్రాహారాలు మాని, గాడిద చాకిరీ చేస్తూ బి.పి.,షుగర్లు, హార్ట్ ఎటాక్..లతో చస్తున్నారు.
- ‘ఇక.. శృంగార జీవితం దగ్గరకు వస్తే..మానవుడి వెర్రి వేయి తలలతో నర్తిస్తోంది. అవి వివరంగా రాద్దామన్నా సెన్సార్ ఒప్పుకోదు. అయామ్ వెరీ సారీ.పోనీ నిజంగా వీడు శృంగార రసానుభూతిని అనుభవిస్తున్నాడా అంటే.. అదీ లేదు దీనికీ నిదర్శనం ఉంది. సుమారు యాభై, అరవై సంవత్సరాలక్రితం ‘దయచేసి ఎక్కువమంది పిల్లలను కనకండిరా., ఇద్దరు లేక ముగ్గురుతో సరిపెట్టుకోండిరా’ అని నెత్తి నోరు కొట్టుకుని మరీ చెప్పారు. ఒక సందర్భంలో అయితే బలవంతాన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా చేయించారు. ఆ రోజుల్లోవారి ‘మాన్ పవర్’ అలాంటిది. ఈ రోజుల్లో ‘మీకు పిల్లలు పుట్టలేదని చింతిస్తున్నారా..మా సంతాన సాఫల్య కేంద్రానికి రండి’అనే ప్రకటనలే ఎటుచూసినా. ఈ రోజుల్లోవారి ‘పునరుత్పత్తి సామర్థ్యం’ ఇలాంటిది.
పాపం జంతువులకు ఈ బాధ లేదు. ఎన్నో కోళ్లు, మేకలు, చేపలు ప్రతినిత్యం బలైపోతున్నా.., మరెన్నో గ్రుడ్లు, ఆమ్లెట్లుగా మారిపోతున్నా.., ఆ ప్రాణులు అంతకు రెట్టింపు పుడుతూనేవున్నాయి. దీనికి కారణం అవి ప్రకృతితో మమేకం కావడమే.. మనం కాకపోవడమే. అంతకు మించి మరేదీ కాదు. ఇంతకన్న మరో నగ్నసత్యం చెప్పనా? మనిషికి తప్ప తక్కిన ప్రాణులకు మరణం లేదు. అవి చావవు.., చంపబడతాయి. వాటికి రోగాలు రావు. కనుకనే ‘జీవికి జీవినే ఆహారంగా చేసాడు ఆ దేవుడు.’ అందుకే వేద వాంఙ్మయం యఙ్ఞయాదుల్లో జంతుబలిని ఒక క్రమ పద్ధతిలో విధిగా నిర్ణయించింది. ఒక్క మనిషి మాత్రమే రోగాలతో, బాధలతో చస్తాడు.. లేదా ఆత్మహత్య చేసుకుంటాడు. ఏ జంతువు ఆత్మహత్య చేసుకోదు. ఈ దౌర్భగ్యం ఒక్క మనిషికే. ఈ దౌర్భాగ్యస్థితి నుంచి మానవజాతి బయటపడాలంటే.. వాడు ప్రకృతిని ప్రేమించాలి., రక్షించాలి., దాని విధులకు లోబడి జీవించాలి. అంతకు మించి మరో మార్గం లేదు.
- యం.వి.యస్.సుబ్రహ్మణ్యం