పండితుడి కళ్ళు తెరిపించిన దయానంద సరస్వతి

 


పండితుడి కళ్ళు తెరిపించిన దయానంద సరస్వతి

 



స్వామీ దయానంద సరస్వతిని చూడటానికి ఒక పండితుడు వచ్చారు. ఆయన మహా గర్విష్టి. తనలా మరెవ్వరూ చదువుకోలేదని, తనుకు తెలిసినన్ని విషయాలు ఇంకెవరికీ తెలియవని ఆయన విర్రవీగుతుండేవారు. ఎప్పుడూ ఎవరితో ఒకరితో ఆయన వాదనకు దిగుతూ తనకు  తెలిసిన నాలుగు ముక్కలూ చెప్పి నువ్వు కావాలంటే చెప్పు అని ఎదుటి వ్యక్తిని  సవాల్ చేస్తుండేవారు.  నిజానికి ఆయన గురించి దయానంద సరస్వతికి పెద్దగా తెలియదు. కానీ తనను చూడటానికి వచ్చిన వ్యక్తి ఎవరైనప్పటికీ వారిని సాదరంగా ఆహ్వానించడం ఆయన వంతు. అలాగే ఈ గర్విష్టి పండితుడిని కూడా దయానంద సరస్వతి ఎంతో మర్యాదగా స్వాగతించి ఒక ఆసనం చూపించి దానిమీద కూర్చోబెట్టారు.  అయితే ఆ ఆసనం మీద కూర్చున్న పండితుడికి చుర్రున కోపం వచ్చింది. కారణం తాను కూర్చున్న ఆసనం దయానంద సరస్వతి కూర్చున్న ఆసనం కన్నా ఎత్తులో కాస్త చిన్నది కావడమే. అదే విషయాన్ని దయానంద సరస్వతితో చెప్పి మిమ్మల్ని చూడటానికి వచ్చిన వారిని ఎలా గౌరవించాలో మీకు తెలియలేదని, మీరూ ఓ సామాన్యుడిలా ప్రవర్తించారని, తాను ఒక గొప్ప పండితుడినని, తనలా మరెవ్వరూ చదువుకోలేదని నానా మాటలు అన్నారు. ఆయన చెప్పిన మాటలన్నీ ప్రశాంతంగా విన్న దయానంద సరస్వతి "అయ్యో మన్నించాలి. తప్పు జరిగింది. మీరు నేను కూర్చున్న ఈ ఆసనం మీద కూర్చోండి. నేను మీరు కూర్చున్న ఆసనం మీద కూర్చుంటాను" అంటూ దయానంద సరస్వతి తాను కూర్చున్న ఆసనం మీద నుంచి లేచి పండితుడు కూర్చున్న ఆసనంలో కూర్చున్నారు. దానితో  పండితుడు ఈమారు ఎత్తయిన ఆసనం మీద కూర్చున్నట్టు అయ్యింది. "ఇప్పుడు మీకు మర్యాద ఎలా చేయాలో తెలిసింది, అయినా ఇలాంటి విషయాలన్నీ మీకు మీరు తెలుసుకుంటే మంచిది " అని పండితుడు అన్నారు. అందుకు దయానంద సరస్వతి జవాబిస్తూ  అలాగే తెలుసుకుంటాను అన్నారు. అనంతరం ఇద్దరూ అనేక విషయాలపై మాట్లాడుకున్నారు. ఇంతలో ఆ ఇంటి ఆవరణలో ఉన్న ఒక పెద్ద చెట్టు పైకి రెండు పక్షులు వాలాయి. అవి బాగా ఎత్తు ఉన్న ఓ కొమ్మ మీద కూర్చున్నాయి. వాటి వంక చూపిస్తూ దయానంద సరస్వతి "అయ్యా....మనకన్నా ఎత్తున ఉన్న కొమ్మ మీద ఆ రెండు పక్షులూ కూర్చున్నాయి. అంటే మీ కన్నా అవి బాగా చదువుకున్నాయని  అనుకోవాలా? మీరేమంటారూ?" అని ప్రశ్నించారు. పండితుడు ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వలేక తలదించుకున్నారు.

- యామిజాల జగదీశ్