కర్మల ప్రకారం ఆత్మ తదుపరి జన్మను ఎలా పొందుతుందో తెలుసా!
కర్మల ప్రకారం ఆత్మ తదుపరి జన్మను ఎలా పొందుతుందో తెలుసా!
ప్రతి మనిషి మనసులో ఎప్పుడూ ఒక ప్రశ్న తలెత్తుతుంది. మరణం తర్వాత మనకు ఏమవుతుంది? ఆత్మ ఎక్కడికి వెళుతుంది? అది కొత్త శరీరాన్ని ఎలా పొందుతుంది? సనాతన ధర్మంలో, మనిషి కేవలం ఒక శరీరం మాత్రమే కాదు, శరీరం నశిస్తుంది, కానీ ఆత్మకు మరణం లేదు. మనం పాత బట్టలు మార్చుకున్నట్లే, ఆత్మ పాత శరీరాన్ని విడిచిపెడుతుందని గీత కూడా చెబుతుంది. కానీ ఆత్మ తదుపరి ప్రయాణం పూర్తిగా మన కర్మల మీద ఆధారపడి ఉంటుంది. మన మంచి, చెడు కర్మలే మరణానంతరం మనం పొందే జీవితాన్ని నిర్ణయిస్తాయి. ఈ రహస్యం అంతా గరుడ పురాణంలో చాలా వివరంగా వివరించబడింది. గరుడ పురాణంలో విష్ణుమూర్తికి, ఆయన వాహనమైన గరుడదేవునికి మధ్య జరిగిన సంభాషణ ఉంది. ఒక వ్యక్తి కర్మలను ఎలా లెక్కిస్తారని గరుడుడు అడగగా.. దానికి విష్ణుమూర్తి సమాధానాన్ని సావధానంగా వివరించాడు మరణం తర్వాత ఆత్మ ప్రయాణం ఎలా సాగుతుంది? ఆత్మ తన తదుపరి జన్మను ఎలా తీసుకుంటుంది? తెలుసుకుంటే..
కర్మల లెక్కలు..
ఒక వ్యక్తి మరణించినప్పుడు, యమ దూతలు వారి ఆత్మను యమలోకానికి తీసుకువెళతారు. అక్కడ, చిత్రగుప్తుడు ఆ ఆత్మ తన జీవితకాలంలో చేసిన కర్మల లెక్కను తెరుస్తాడు. వారు ఇతరులకు ఎన్నిసార్లు సహాయం చేశారో, ఎన్నిసార్లు హాని చేశారో నమోదు చేస్తారు. ఈ గణన ఆధారంగా, ఆత్మ భవిష్యత్ ప్రయాణం నిర్ణయించబడుతుంది.
గరుడ పురాణం ప్రకారం, జీవితాంతం పాపాలు చేసేవారు యమలోకంలో చాలా కష్టాలను అనుభవిస్తారు. వారి పాప కర్మలు పూర్తిగా తీరిన తర్వాతే వారికి కొత్త శరీరం లభిస్తుంది. పాపపు ఆత్మలు వెంటనే మానవ రూపాన్ని పొందవు. అవి మొదట కీటకాలు, జంతువులు లేదా పక్షులుగా జన్మిస్తాయని గరుడ పురాణంలో ఉంది.
84 లక్షల యోనుల చక్రం..
ఇతరులను మోసం చేసేవారు లేదా దొంగతనం చేసేవారు వారి తరువాతి జీవితంలో జంతువులుగా జన్మిస్తారట. గరుడ పురాణం ప్రకారం ఆత్మ మొక్కలు, జలచరాలు , సరీసృపాలతో సహా మొత్తం 84 లక్షల జన్మలు ఎత్తవలసి ఉంటుంది. తన చెడు కర్మల ఫలాలను అనుభవించిన తర్వాతే ఆత్మ ముందుకు సాగుతుంది.
జీవితంలో ధర్మ మార్గాన్ని అనుసరించేవారికి ప్రయాణం చాలా సులభంగా ఉంటుంది. ఇతరులకు సేవ చేసేవారు, దానధర్మాలు చేసేవారు , దేవుడిని మనస్ఫూర్తిగా ఆరాధించేవారు యమలోకంలో గౌరవించబడతారు. సత్కర్మలు చేసే ఆత్మలకు స్వర్గంలో తాత్కాలిక స్థానం లభిస్తుంది.
అక్కడ వారు ఆనందాన్ని అనుభవిస్తారు. వారి పుణ్యకార్యాలు పూర్తయ్యాక, వారు భూమిపై మానవులుగా పునర్జన్మిస్తారు. అటువంటి వ్యక్తులు మంచి, సంస్కారవంతమైన కుటుంబాలలో జన్మిస్తారు, తద్వారా వారు తమ జీవితాలను మరింత మెరుగుపరుచుకోగలరు.
గరుడ పురాణం ఇందుకే..
అందరూ అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏమిటంటే.. మన ప్రస్తుత జీవితం మన గత కర్మల ఫలితమే. మన భవిష్యత్తు మనం ఈ రోజు ఎలా ప్రవర్తిస్తామనే దానిపై ఆధారపడి ఉంటుంది. గరుడ పురాణం మనల్ని భయపెట్టడానికి కాదు, సరైన మార్గాన్ని చూపించడానికి వ్రాయబడింది.
శరీరం భూమిలో కలిసిపోతుంది, కానీ మనిషి చేసిన కర్మలు ఎల్లప్పుడూ ఆత్మతోనే ఉంటాయని ఈ గ్రంథం మనకు బోధిస్తుంది. అందువల్ల మనిషి బ్రతికి ఉన్నంత కాలం మంచి పనులు చేస్తూనే ఉండాలి. ఎవరినీ బాధపెట్టడం లేదా వారిని ఇబ్బంది పెట్టడం వంటివి చేయకూడదు. ఎందుకంటే చివరికి మనిషి చేసే మంచి పనులు మాత్రమే మోక్షాన్ని , ఆత్మకు ఒక ఉత్తమమైన కొత్త శరీరాన్ని అందిస్తాయి.
*రూపశ్రీ.