మరణం తర్వాత 13రోజుల ముట్టు ఎందుకు పాటిస్తారు.. పిండ ప్రదానం ఎందుకు చేస్తారు!

 

మరణం తర్వాత 13రోజుల ముట్టు ఎందుకు పాటిస్తారు.. పిండ ప్రదానం ఎందుకు చేస్తారు!

ఈ సృష్టిలో జన్మించిన ఏ జీవికి అయినా మరణం తప్పనిసరి.  అయితే మరణం వరకు జరిగే జీవితం అంతా అందికీ తెలుసు. కనిపిస్తూ ఉంటుంది.  కానీ మరణం తర్వాత జరిగేది అంతా చాలా రహస్యంగా ఉంటుంది.  మనిషి మరణం తర్వాత జరిగే సంఘటనలు అన్నీ గరుడ పురాణంలో పేర్కొన్నారు. ఆత్మ శరీరాన్ని వదిలేయడమే మరణం అంటున్నాం. ఈ మరణం తర్వాత 13రోజుల పాటు ముట్టు ఉంటుందని చెబుతారు.  అంతేకాదు.. పిండ ప్రదానాలు కూడా చేస్తారు. అసలు ఇవన్నీ ఎందుకు చేస్తారు.  13రోజుల పాటు ముట్టు అనే ఆచారాన్ని ఎందుకు పాటిస్తారు.   పిండ ప్రదానం ఎందుకు నిర్వహిస్తారు?  వీటి గురించి వివరంగా తెలుసుకుంటే..

ఆత్మ అంత్యక్రియలకు సాక్షి..

హిందూమతంలో మరణించగానే  వెంటనే ఆత్మను యమదూతలు యమలోకానికి తీసుకువెళతారని, అక్కడ దానికి దాని జీవిత వృత్తాంతాన్ని వివరిస్తారని నమ్ముతారు. కొన్ని గంటల తర్వాత ఆత్మను తిరిగి దాని స్వస్థానానికి తీసుకుని వస్తారు. దీనివల్ల ఆత్మ తన కుటుంబాన్ని కలుసుకుని, తన అంత్యక్రియలను చూడగలుగుతుందట. అందుకే అంత్యక్రియలకు మరణించిన వ్యక్తి ఆత్మే సాక్షిగా ఉంటుందని చెబుతారు.

13రోజుల ముట్టు..

గరుడ పురాణం ప్రకారం.. ఈ 13 రోజులు ఆత్మ తన ఇంటికి, కుటుంబానికి దగ్గరలోనే ఉంటుందట. అది తనను ఇష్టపడేవారు, తనకెంతో ఇష్టపడేవారు  దుఃఖించడం చూస్తుందట, వారి సంభాషణలను వింటుంది, కానీ వారితో మాట్లాడలేదు. ఈ సమయంలో ఆత్మ అనుబంధానికి కట్టుబడి, జీవితంలో తాను చేసిన మంచి చెడులను నెమరు వేసుకుంటుందట.

మరణానంతరం పిండ ప్రదానం..

 మరణం తర్వాత  ఆత్మ ప్రయాణం చాలా సుధీర్ఘమైనది., కష్టతరమైనదిగా పరిగణించబడుతుంది. గరుడ పురాణం ప్రకారం, మనం దూర  ప్రయాణానికి బయలుదేరినప్పుడు మనతో పాటు ఆహారాన్ని తీసుకువెళ్ళినట్లే, కుటుంబం చేసే పిండ దానం ప్రయాణంలో ఆత్మకు ఆహారంగా ఉపయోగపడుతుంది. ఈ దానం, యమలోకానికి చేసే కష్టతరమైన ప్రయాణాన్ని పూర్తి చేయడానికి ఆత్మకు బలాన్ని , శక్తిని అందిస్తుందట.

మరణం తర్వాత గరుడ పురాణ పఠనం..

మరణించిన 13 రోజులలో ఇంట్లో గరుడ పురాణం పఠించడం సాంప్రదాయం. ఈ పఠనం, ఆత్మ ఇకపై బంధాలను త్యజించి ముందుకు సాగాలని గ్రహించడానికి సహాయపడుతుంది, ఇది శాంతికి,  మోక్షానికి దారితీస్తుంది. అంతేకాకుండా గరుడ పురాణం పఠించడం వల్ల కుటుంబ సభ్యులకు  కలిగే దఃఖం,  బాధ, కష్టం.. వంటి వాటిని మరచి,  మానసిక బలాన్ని పెరిగేలా చేస్తుంది.

                                    *రూపశ్రీ.