కార్తీకమాసంలో దానం చేస్తున్నారా...ఈ తప్పు మాత్రం చేయకండి..!

 

కార్తీకమాసంలో దానం చేస్తున్నారా...ఈ తప్పు మాత్రం చేయకండి..!

 


కార్తీకమాసం ఎంతో పుణ్యప్రదమైన మాసం. శివకేశవుల బేధం లేదని చాటి చెప్పే మాసం. కార్తీక మాసంలో చాలామంది బ్రాహ్మణులకు దానాలు చేస్తుంటారు. అలాగే పేద వారికి, ఇబ్బందులలో ఉన్నవారికి కూడా దానం చేస్తుంటారు. అయితే కేవలం కార్తీక మాసంలోనే కాకుండా ఎప్పుడైనా సరే.. ఎవరికైనా ఏదైనా దానం చేసేటపుడు పొరపాటున కూడా ఒక తప్పు చేయరాదని పురాణ పండితులు చెబుతున్నారు. దీనికి ఉదాహరణగా ఒక పురాణ కథ కూడా ఉంది. ఆ కథ ఏమిటో.. దానం చేసేటప్పుడు చేయకూడని తప్పు ఏమిటో తెలుసుకుంటే..

శ్రీకృష్ణుడికి ఇద్దరు కొడుకులు. ఒకరు సాంబుడు, మరొకరు ప్రద్యుమ్నుడు. వీరిద్దరూ స్నేహితులతో కలసి ఆడుకుంటూ ఉంటే వారికి దగ్గరలో ఒక బావి కనిపిస్తుంది. ఆ బావిలో ఏముందా అని చూస్తే.. ఒక పెద్ద ఊసరవెల్లి ఉంటుంది. ఆ ఊసరవెల్లిని కాపాడుదాం అని వాళ్ళిద్దరూ ఆ ఊసరవెల్లిని బయటకు తీయడానికి తాడు వేసి బయటకు లాగడానికి ప్రయత్నిస్తారు. అయితే వారి ప్రయత్నం విఫలం అవుతుంది. అప్పుడు వారు తండ్రి అయిన శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళి ఆయన్ను బావి దగ్గరకు పిలుచుకుని వెళతారు. శ్రీకృష్ణుడు ఏమో గోవర్ధన గిరిని చిటికెన వేలితో ఎత్తాడు. అలాంటి ఆయనకు ఊసరవెల్లి ఒక లెక్కనా? యెడమ చేత్తో దాన్ని బయటకు లాగుతారు. అయితే అయన దాన్ని అలా బయటకు లాగగానే.. ఆశ్చర్యంగా ఆ ఊసరవెల్లి కాస్తా ఒక దివ్య పురుషుడిలాగా మారిపోతుంది. ఆ మహారాజు చేసిన ఒక దానం వల్ల ఆయనకు అలాంటి జన్మ లభించిందని పురాణ కథ..

ఇక్ష్వాకుడికి మృగమహారాజు అనే కొడుకు ఉండేవాడు. ఆయన దానాలు చేయడంలో దిట్ట.ముఖ్యంగా అయన గోదానం చేసినట్టు పురాణాల్లో ఎవ్వరూ చేయలేదు అని అంటారు. ఒకరోజు మృగమహరాజు ఒక  బ్రాహ్మణుడికి ఒక ఆవును దానం చేశాడు. ఆ బ్రాహ్మణుడు ఆవును పోషించుకుంటు ఎంతో హాయిగా జీవించేవాడు. అయితే.. ఒకరోజు ఆవును సరిగా కట్టకపోవడం వల్ల అది తప్పిపోయింది. అది పోయి మృగమహారాజు దగ్గర ఉండే ఆవుల మందలో కలిసిపోయింది. అది దానం చేయడానికి ముందు ఎలాగైతే పశువులతో కలసి ఉండేదో అలాగే ఉండసాగింది. ఆవు వచ్చి చేయిన సంగతి కూడా ఎవరు కనుక్కోలేకపోయారు. ఈ సంఘటన జరిగిన తరువాత మృగ మహారాజు గారు ఇంకొక బ్రాహ్మణుడికి ఆవును దానం చేశాడు. ఆ బ్రాహ్మణుడు ఆవును తీసుకుని అడవి గుండా వెళ్తున్నప్పుడు.. మొదటి బ్రాహ్మణుడు తప్పిపోయిన తన ఆవును వెతుక్కుంటూ రెండవ బ్రాహ్మణుడికి ఎదురు పడ్డాడు. ఆ రెండవ బ్రాహ్మణుడి దగ్గర తన ఆవు ఉండటం చూసి ఆ ఆవు నాదంటే నాది అని ఆ ఇద్దరు బ్రాహ్మణులు పొట్లాడటం మొదలు పెట్టారు. చివరకు ఈ విషయం రాజు గారి దగ్గరకు చేరింది. రాజు గారు ఇద్దరు బ్రాహ్మణులు చెప్పింది విని.. అసలు పొరపాటు తన వల్లే జరిగిందని తెలుసుకుని.. మొదటి బ్రాహ్మణుడితో.. “అయ్యా.. మీకు లక్ష గోవులను దానం ఇస్తాను, రెండవ బ్రాహ్మణుడికి ఇచ్చిన ఆ ఆవును వదిలేయండి” అని అన్నాడు. కానీ ఆ బ్రాహ్మణుడు ఒప్పుకోలేదు.. తనకు రాజు మొదట దానం ఇచ్చిన ఆవు మాత్రమే కావాలని పట్టుబట్టాడు.

రెండవ బ్రాహ్మణుడికి కూడా రాజు చాలా చెప్పి ప్రయత్నించాడు. కానీ ఇద్దరు బ్రాహ్మణులు కూడా ఆ ఆవును తనకు కావాలంటే తనకు కావాలని  పట్టుబట్టారు. ఇలా జరగడం వల్ల ఆ సమస్య పరిష్కారం కాలేదు. ఈ క్రమంలోనే మృగామహారాజు మరణించాడు. ఆయన యముడి ముందు హాజరు అయినప్పుడు.. నువ్వు చాలా పుణ్యం చేసావు, కానీ ఒకే ఒక్క పాపం ఉండిపోయింది. మొదట పాప కర్మ అనుభవిస్తావా లేక పుణ్య కర్మ అనుభవిస్తావా? అని అడుగుతాడు. ఆ మృగమహారాజు మొదట పాప కర్మ అనుభవిస్తానని చెప్పడంతో.. ఊసరవెల్లిగా మారి బావిలో పడి ఉంటాడు. భగవంతుడి స్పర్శ తగలగానే పాపం తొలగిపోయి దివ్య పురుషుడిగా మారి స్వర్గానికి వెళ్ళిపోతాడు.

ఈ కథ ద్వారా తెలుసుకోవలసింది ఏమంటే..

చాలా మంది దానం చేస్తూ ఉంటారు. మనిషి మానసిక పరిస్థితి బాగున్నప్పుడు, మనిషి సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎవరికైనా ఏదైనా దానం చేయడం, తరువాత కోపం వచ్చినప్పుడు దానం చేసిన వస్తువు అయినా లేక మరింకేదైనా వెనక్కు లాక్కోవడం చేస్తుంటారు. ఇది చాలా తప్పు. ఇలాంటి పనులు చేసేవారికి పై కథలో పేర్కొన్నటువంటి జన్మలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అలాగే.. చాలామంది తాము చేసిన దానం గురించి పైకి చెప్పుకుని, దానం తీసుకున్నవారిని నలుగురి ముందు చిన్నతనం చేస్తుంటారు. ఇది కూడా మంచిది కాదట. ఒక్కసారి ఎవరికైనా ఏదైనా దానం చేస్తే ఇక ఆ వస్తువుతో దానం చేసిన వారికి అసలు సంబంధమే ఉండదట. కాబట్టి ఎప్పుడు కూడా దానాన్ని మన్సి మనసుతో, వస్తు వ్యామోహం, ఒకరికి దానం చేస్తున్నాం అనే అహంకారం లేకుండా దానం చేయాలి.


                          *రూపశ్రీ