కార్తీకమాసంలో ఒళ్ళు పులకరింపజేసే శివ భక్తురాలి కథ..!
కార్తీకమాసంలో ఒళ్ళు పులకరింపజేసే శివ భక్తురాలి కథ..!
శివకేశవుల అభేదాన్ని చాటి చెప్పే పుణ్య మాసం కార్తీకం. ఎక్కడ చూసినా శివాలయాలు, విష్ణు ఆలయాలు ఆరాధనలతో, అభిషేకాలు, పూజలతో కిటకిటలాడుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో కార్తీక దీపాలు, శివాభిషేకాలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకుని ఉన్నాయి. కార్తీక మాసంలో జరిగే శివాభిషేకాలు వల్ల శివుడికి జలుబు చేస్తుందట.. అని చమత్కారంగా కూడా చెబుతారు. ఆ శివయ్యను తల్లిలా బుజ్జగించి, ప్రేమతో సేవించి చివరకు ఆయనలో లీనమైపోయిన ఒక శివ భక్తురాలు ఉంది. పాల్కురికి సోమన తన బసవ పురాణంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఇంతకు ఆ భక్తురాలు ఎవరు? ఆమె భక్తికి శివుడు ఎలా కరిగిపోయాడు? ఆమె కథ ఏమిటో తెలుసుకుంటే..
గోడగూచి..
కర్ణాటకలో ఒక శివభక్తుడు ఉండేవాడు. ప్రతి రోజు శివుడిని ఎంతో భక్తిగా పూజించేవాడు. రోజు శివ పూజ చేసి పాలు నైవేద్యంగా పెట్టేవాడు. అయితే.. ఒకరోజు ఆయనకు తప్పనిసరిగా భార్యతో కలసి వేరే ఊరు వెళ్లాల్సి వస్తుంది. శివుడికి పూజ, నైవేద్యం ఎలా అని బెంగ పడ్డారు. కానీ అంతలోనే తమ చిన్నారి కూతురు గుర్తు వచ్చింది. చిన్న వయసున్న తమ పాపను పిలిచి.."అమ్మా.. మేము ఊరు వెళ్తున్నాము. నువ్వు ప్రతిరోజూ శివుడిని పూజించి శివుడికి తప్పనిసరిగా పాలను నైవేద్యంగా పెట్టు" అని చెబుతారు. ఆ పాప కూడా తండ్రితో సరే అని చెబుతుంది. తల్లిదండ్రులు ఊరు వెళ్ళాక మరుసటి రోజు ఉదయం శివుడికి కాచిన పాలు తీసుకెళ్లి శివపూజ చేసి పాలను నైవేద్యంగా పెట్టింది.
పాపం కల్మషం లేని చిన్న పాప.. నైవేద్యం పెట్టడం అంటే ఏకంగా శివుడి చేత పాలను తాగించడం అని భావించింది. చక్కగా కాచిన పాలను శివుడి ముందు ఉంచినా శివుడు పాలను తాగలేదు. దాంతో ఆ పాప శివుడితో.. "శివయ్యా.. ఈరోజు నాన్నగారు లేరు. నిన్ను పస్తులు ఉంచకుండా.. నీకు పాలను నైవేద్యంగా పెట్టమని చెప్పి మరీ ఊరు వెళ్లారు. నేనేమో నీకోసం పాలను నాగా కాచి తీసుకొచ్చాను. పాలు తాగు స్వామి" అని ఎంతో వినయంగా చెప్పింది. కాని శివుడు పాలు తాగలేదు. దాంతో ఆ పాప కాస్త భయపడింది. "స్వామి చెప్తున్నాను కదా..పాలు తాగు" అని ఎంతగానో ప్రాధేయపడింది. అయినా సరే శివుడు పాలు తాగలేదు. తను ఎంతగా అడిగినా శివుడు పాలు తాగకపోయేసరికి పాపం ఆ పాపకు కళ్ళలో నీళ్లు వచ్చాయి.
"ఎందుకు శివయ్య నేను తెచ్చిన పాలను తాగడం లేదు. నేనేమైనా లోపం చేశానా? పాలు బాగాలేవా? పాలు ఎక్కువ కాగాయా? పాలలో పంచదార తక్కువ వేశానా లేదా ఎక్కువ వేశానా? ఏం లోటు జరిగిందో చెప్పు. నువ్వు పాలు తాగకపోతే ఎలా? నిన్ను పస్తులు ఉంచద్దు అని నాన్నగారు ఎంతగానో చెప్పారు. నువ్విప్పుడు పాలు తాగకపోతే.. నాన్నగారు వచ్చి నన్ను కొడతారు" అని ఎంతో బతిమాలింది, బుజ్జగించింది, తల్లి బిడ్డను ఎలాగైతే లాలనగా మాట్లాడుతుందో అలా మాట్లాడింది. అయినా శివుడు తాగలేదు. నువ్వు తాగకపోతే నేను ఊరుకోను, నిన్ను వదలను అని చెప్పి శివ లింగాన్ని పట్టుకుని ఏడవడం మొదలుపెట్టింది. అమాయకమైన, నిష్కల్మషమైన ఆ భక్తికి శివుడు కరిగిపోయాడు. శివలింగం నుండి బయటకు వచ్చి ఆ పాప నివేదించిన పాలను తాగాడు. శివుడు పాలు తాగడంతో పాప ఎంతో పొంగిపోయింది.
ప్రతిరోజూ శివుడి కోసం పాలను తీసుకెళ్లడం, శివుడికి నైవేద్యం పెట్టడం, దగ్గరుండి శివుడి చేత పాలు తాగించడం జరిగేది. ఒకరోజు పాప శివుడికి పాలను నైవేద్యంగా పెట్టి ఇంటికి తిరిగి వస్తుండగా.. తల్లిదండ్రులు ఊరి నుండి తిరిగి వస్తూ పాపకు ఎదురు పడ్డారు. వెంటనే తల్లిదండ్రులు పాపను చూసి ఎక్కడి నుంచి వస్తున్నావ్ తల్లి అని ఎంతో ప్రేమగా అడుగుతారు.
శివుడికి పాలు నైవేద్యం పెట్టీ వస్తున్నాను అని పాప సమాధానం ఇస్తుంది. అవునా ఏది మాకు కాస్త ప్రసాదం ఇవ్వు అని ఆ పాప తండ్రి అడుగుతాడు. అప్పుడు ఆ పాప ప్రసాదం ఎక్కడుంది? పాలను మొత్తం శివుడు తాగేసాడుగా అని చెబుతుంది.
శివుడు పాలను తాగడం ఏంటి? శివుడు ఎక్కడైనా పాలు తాగుతాడా? నాటకాలు ఆడుతున్నావా? అని తండ్రి గట్టిగా అడుగుతాడు. అప్పుడు ఆ పాప తండ్రితో..నాన్నగారు మీరే కదా శివుడిని పస్తులు ఉంచకు, పాలు నైవేద్యంగా పెట్టు అన్నారు. నేను అలాగే శివుడికి పాలను నైవేద్యంగా పెట్టి వచ్చాను అంటుంది.
శివుడికి పాలను నైవేద్యంగా పెట్టమన్నాను. అంతే కానీ నిజంగా శివుడు వచ్చి పాలు తాగేస్తాడా? నువ్వు పారబోసి ఇలా చెప్తున్నావేమో లేదంటే నువ్వే తాగేసి ఇలా నాటకాలు ఆడుతున్నావు ఏమో అని అంటాడు.
లేదు నిజంగా శివుడు పాలు తాగాడు. కావాలంటే ఆలయానికి రండి శివుడే సమాధానం చెబుతాడు. అని అంటుంది ఆ పాప. తండ్రి పాపతో పాటు ఆలయానికి వెళ్తాడు.
"శివయ్య.. నువ్వు పాలు తాగావని మా నాన్నకు చెప్పు, నేను పాలు పారబోసి నువ్వు తాగావని అబద్దం చెప్తున్నానని అంటున్నాడు. నువ్వు మా నాన్నకు నిజం చెప్పు. లేకపోతే నన్ను కొడతానని అంటున్నారు." అని అడుగుతుంది. కానీ శివుడు మాత్రం స్పందించలేదు. ఎలా ఉన్న శివలింగం అలాగే ఉంది.
దీంతో పాప తండ్రికి ఒళ్ళు మండిపోయింది. నువ్వు అబద్దం చెబుతున్నావ్, శివుడు పాలు తాగాడని అంటున్నావ్.. నిన్ను ఏం చేస్తానో చూడు అని కోపంతో ఆ పాప మీదకు వెళ్లబోతుంటే.. ఆ పాప భయంతో పరుగున వెళ్ళి శివ లింగాన్ని గట్టిగా పట్టుకుని ఏడ్వసాగింది. అంతే.. శివలింగం ఒక్కసారిగా రెండుగా చీలిపోయి, ఆ పాప శివలింగంలోకి కలిసిపోసాగింది. ఆ పాప తండ్రి భయంతో, కంగారుతో, వెంటనే వెళ్ళి ఆ పాపను ఆపుదాం అని చూసాడు. పాపను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఆ పాప శివలింగంలోకి వెళ్లిపోగా కేవలం కొంచెం జుట్టు మాత్రం అతని చేతిలోకి వచ్చింది.
ఇదంతా జరిగిన తరువాత శివుడి స్వరం ఆ పాప తల్లిదండ్రులకు వినిపిస్తుంది. "నేను పాపను నా సన్నిధికి చేర్చుకున్నాను. ఇకమీదట ఈ పాప గొడగుచి అనే పేరుతో విరాజిల్లుతుంది. అని చెబుతాడు. గొడగూచిని కన్నడలో కొడుగూసు అని పిలుస్తారు. అంతే.. దత్తత తీసుకున్న బిడ్డ, చిన్న పాప అని అర్థం. పరమేశ్వరుడు పాపను తనలో ఐక్యం చేసుకోవడం ద్వారా ఆ పాపను దత్తత తీసుకున్నాడని, ఆ పాపను గొడగూచి అని అంటున్నారు.
ఈ సంఘటన జరిగిన ఆలయం కర్ణాటక రాష్ట్రంలో హావేరీ అనే జిల్లాలో, కోలూరు అనే గ్రామంలో ఉంది. కార్తీకమాసంలో ప్రత్యేకంగా శివాలయాలను దర్శించాలి అనుకునే వారు ఈ దేవాలయాన్ని దర్శించవచ్చు. ఈ కథ బసవపురాణంలో ఉంది.
*రూపశ్రీ.