బృందావనానికి వెళ్లిన రేపల్లె వాసులకు ఎదురైన అనుభవాలు!

 

బృందావనానికి వెళ్లిన రేపల్లె వాసులకు ఎదురైన అనుభవాలు!

భాగవతంలో బాల కృష్ణుడిని చంపడానికి వెళ్లిన పూతన, శకటారుసుడు, తృణావర్తుడు చచ్చి నేలపడటం, ఆ తరువాత అక్కడ గాలీ, వాన, మబ్బూ లేకుండా పిడుగులు పడటం, ఏనాటి నుంచో వున్న మద్దిచెట్లు ఫెళ ఫెళ కూలిపోవడం.... ఇదంతా చూసి నందుడు భయపడ్డాడు.  'ఏదో రాక్షస మాయలాగా వుంది. ఈ ప్రాంతం మనకు అనువుగా లేదు. ఇక్కడ మన బిడ్డలకు, ఆలమందలకూ రక్షణ లేదు. అందువల్ల మనం బృందావనం వెళదాం' అన్నాడు.

వ్రేపల్లెవాసులందరూ సరేనన్నారు. వెంటనే యమునానది ఒడ్డున వున్న బృందావనానికి ఆలమందలను తీసుకుని, సంసారాలను తరలించుకుని వెళ్ళారు.

వాళ్ళకి బృందావనం చాలా బాగా నచ్చింది. అక్కడ గోవర్ధన గిరి వుంది. చూడచక్కగా వుంది. పచ్చని కొండ. పశువుల మేతకు కొరత లేదు. తాగినంత నీరు, తియ్యగా అమృతంలా వుంది. పరవళ్ళు తొక్కుతున్న యమునను చూస్తూనే గొల్ల భామలంతా ఆనందంగా చిందులు వేస్తూ ఆటలాడుతూ పాటలు పాడారు.. చెట్లనీడన సేదతీరుతూ పశువులన్నీ ఒకేసారి 'అంబా' అని సంబరంగా అరిచాయి. కృష్ణయ్య, బలరాముడు సహవాసగాళ్ళతో కలిసి తెగ ఆటలాడారు.

బృందావనం చేరుకున్న గోపాలకులు పదహారు క్రోసులమేర భూమిని ఆక్రమించుకున్నారు. అక్కడ ఇళ్ళూ, వాకిళ్ళూ ఏర్పరచుకున్నారు. బృందావనం మొత్తం నిడివి డెబ్బైనాలుగు క్రోసులుంటుంది. వెడల్పు అర్ధ యోజనం వుంటుంది. దానికి తూర్పునా, ఉత్తరానా బర్హిషదం, దక్షిణాన మధురాపురం, పశ్చిమాన శోణపురం వున్నాయి. బృందావనం తీర్థరాజంగా పేరు పొందింది.. అక్కడికి దగ్గరలోనే నందీశ్వర పర్వతం కూడా వుంది.

గోకులమంతా బృందావనం చేరుకోటానికి ఒక ముఖ్య కారణం కూడా వుంది. యమునకు దక్షిణంగా ఒక వెలుగతోట వుంది. అది ఒకప్పుడు బలికి అన్న అయిన 'కాలకలి' అనే వాని సంతానం. ఆ వనంలోని చెట్లన్నీ విషగంధం వదులుతూ వుంటాయి. ఆ చెట్లకు తోడుగా కాలకలి అనుచరులు కూడా అక్కడ మరికొన్ని వృక్షాలుగా పుట్టారు.

కాలకలికి ఏడుగురు భార్యలు. వారందరూ గోవులయినారు. వారికి అనేక వందల సంతానం కలిగింది. ఆ వెలగతోట పుట్టిన పన్నెండేళ్ళకు పూసి ఫలాలు మెండుగా కాశాయి. ఫలాలను తింటూ గోసంతతి జీవిస్తోంది. అయితే ఆ వృక్షాలు విడిచే విషగంధంవల్ల వ్రేపల్లె అంతటా రకరకాల వ్యాధులు ప్రబలాయి, వాటిని నివారించే నిమిత్తం వ్రేపల్లె ప్రజలు ఏడు రోజులపాటు దీక్షతో మహేశ్వరుడ్ని పూజించారు. వారి పూజలకు మెచ్చి మహేశ్వరుడు తన భటుడైన శంఖకర్ణుని గోకులానికి పంపాడు. అతను వెళ్ళి 'కాలకలి సంతానాన్ని నిర్మూలించే శక్తి బలరామకృష్ణులకు మాత్రమే వుంది. గోకులమంతా బృందావనానికి మారే పక్షంలో రామకృష్ణులకు ఆ చెట్లను నిర్మూలించే అవకాశం కలుగుతుంది. దానివల్ల విషవాయువులు వ్యాపించటం ఆగి పోతుంది. గోకులం సుఖంగా వుంటుంది' అని చెప్పి అదృశ్యమయ్యాడు.

ఆ విధంగా మహాదేవుని సందేశాన్ని శిరసావహించి గోకులమంతా వ్రేపల్లె నుంచి బృందావనం చేరుకుంది. నల్లనయ్య కాలు మోపగానే బృందావనం కొత్త అందాలు సంతరించుకుంది.

కృష్ణుడు, బలరాముడు ఒకసారి గోపబాలురతో కలిసి యమునా తీరానికి వెళ్ళారు. ఆ సమయంలో కంస భృత్యుడయిన ఒక రాక్షసుడు కృష్ణుడ్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు. రాక్షసమాయతో ఒక లేగదూడగా మారిపోయి ఆ పరిసరాల్లో వున్న ఆవుల మందలో కలిసిపోయాడు. గోపబాలురెవరూ అది తెలుసుకోలేకపోయారు. 'ఈ కొత్త లేగదూడ ఎక్కడిది?' అన్న ఆలోచన బలరాముడికి కూడా రాలేదు.

కాసేపయ్యాక కృష్ణయ్య బలరాముడిని పక్కకు పిలిచి, మందలో కొత్తగా వచ్చి చేరిన లేగదూడను చూపించి 'అది మన దూడ కాదు. మన మామయ్య కంసుడు పంపించాడు దాన్ని. దానికి తగిన మర్యాదలు చేద్దాం మనం' అన్నాడు. నవ్వుతూ. మెల్లగా వెళ్లి దాని వెనుక కాళ్ళు రెండూ పట్టుకుని ఎత్తి గిరగిర తిప్పి పక్కనేవున్న చెట్టుకేసి కొట్టాడు. ఆ దెబ్బలు భరించలేక లేగ రూపంలో వున్న రాక్షసుడు గావుకేక పెట్టి నిజరూపంలో ప్రాణాలు వదిలాడు. అది చూసి గోపబాలురంతా భయపడిపోయారు. 

ఆ విధంగా శ్రీకృష్ణునిచేత సంహరించ బడ్డవాడు వత్సాసురుడు. అంతకు పూర్వం అతను మురాసుతుడు ప్రమీలుడు. అతనొకసారి వశిష్ఠముని ఆశ్రమానికి వెళ్ళి, అక్కడ వున్న 'నందిని' అనే ఆవును చూశాడు. అది తనవద్ద వుంటే బాగుండుననుకున్నాడు. ఆ వెంటనే అతను విప్రరూపం ధరించి వశిష్ఠ మహర్షి దగ్గరకు వెళ్ళి ఆ ధేనువును తనకు దానం ఇవ్వవలసిందిగా కోరాడు. కాని, వశిష్ఠుడు ఏ విధమయిన సమాధానం ఇవ్వలేదు. మౌనం వహించి వూరుకున్నాడు. నందినికి పరిస్థితి అర్థమయింది. ప్రమీలుని మోసం గ్రహించింది. "నువ్వు దేనిని కోరి వశిష్ఠుడ్ని మోసం చేయదలచుకొన్నావో అదే రూపాన్ని నువ్వు ధరిస్తావు" అని శపించింది.

ప్రమీలునికి తను తలపెట్టిన అత్యాచారం ఎటువంటిదో అప్పుడు అర్థమైంది. మహర్షికీ, నందినికి నమస్కరించి తనను అనుగ్రహించవలిసిందిగా ప్రార్థించాడు. ఆ ప్రార్థనకు నందిని జాలిపడింది. 'ద్వాపరంలో శ్రీహరి గోపాలుడై బృందావనంలో విహరిస్తాడు. అప్పుడు ఆయన నీకు విముక్తి కలిగిస్తాడు' అని చెప్పింది. ఆ విధంగా ప్రమీలుడు గోవత్సరూపం ధరించడం, బృందావనంలో ఆలమందల్లో కలసిపోవడం, నల్లనయ్య చేతుల్లో మరణించి శాపవిముక్తి పొందడం జరిగింది.

                         ◆నిశ్శబ్ద.