తనను చూడటానికి నిరాకరించిన సాధువుకు మీరాబాయి  సమాధానం!

 

తనను చూడటానికి నిరాకరించిన సాధువుకు మీరాబాయి  సమాధానం!

భక్తి సంప్రదాయానికి సంబంధించిన అగ్రశ్రేణ వ్యక్తుల్లో మీరాబాయి ఒకరు. ఆమె 15వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ కృష్ణ భక్తురాలు. శ్రీకృష్ణుణ్ణి కీర్తిస్తూ ఆమె రచించి, గానం చేసిన భజనలు ఎన్నో ఉన్నాయి. రాజస్థానీ కలగలసిన ప్రజాభాషలో ఆమె శ్రీకృష్ణుడి గుణగణాలను కీర్తించారు. రాజస్థాన్లోని ఓ రాజకుటుంబంలో మీరా జన్మించింది. ఆమె చిన్న పిల్లగా ఉన్నప్పుడు రాయ్ దాస్ అనే యోగి వారి ఇంటికి వచ్చాడు.  చిన్నపిల్ల అయిన మీరాకు ఆయన ఓ శ్రీకృష్ణ విగ్రహం కానుకగా ఇచ్చాడు. అప్పటి నుంచి ఆమెకు ఆ విగ్రహమంటే పంచప్రాణాలు. మీరా ఆ విగ్రహాన్ని అలంకరించేది,  పూజించేది. ఆ విగ్రహంతో ఆడుకునేది. ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఆ శ్రీకృష్ణ విగ్రహమే తోడుగా జీవితం గడిపేది. ఆమె దాన్ని కేవలం ఓ ప్రాణం లేని బొమ్మ అనుకోలేదు. సాక్షాత్తూ శ్రీకృష్ణుడే సజీవంగా ఆ విగ్రహం రూపంలో ఉన్నాడని భావించేది.

కొన్నాళ్ళకు మీరాకు యుక్తవయస్సు వచ్చింది. ఆమెను చిత్తోర్ యువరాజైన భోజరాజుకు ఇచ్చి పెళ్ళిచేశారు. భోజరాజు కుటుంబం శక్తి ఆరాధకులు. దుర్గ, కాళి, చాముండి, పార్వతి మొదలైన రూపాల్లోని అమ్మవారిని వారు ఆరాధించే వారు. దాంతో, శ్రీకృష్ణుడి పట్ల మీరా భక్తి ఆమె భర్త కుటుంబంలోని వారికి మింగుడు పడలేదు. శ్రీకృష్ణుడి పట్ల ఆమెకున్న తీవ్రమైన భక్తిని అర్థంలేని ఆరాటంగా భావించారు.

ఇది ఇలా ఉండగా, రోజురోజుకూ మీరాలో భక్తి ఎక్కువ కాసాగింది. అంతకంతకూ సాధు సన్న్యాసులు, మహాత్ముల సన్నిధిలో ఆమె ఎక్కువ సేపు గడపడం మొదలుపెట్టింది. భోజరాజు తమ రాజమందిరానికి దగ్గరలో ఆమె కోసం ప్రత్యేకంగా ఓ ఆలయాన్ని నిర్మింప జేశాడు. దాంతో, శ్రీకృష్ణుణ్ణి పూజించడానికీ, ప్రార్థించడానికీ కావలసినంత స్వేచ్ఛ మీరాకు లభించింది. గుడిలో భగవంతుని గుణగానలను నంకీర్తన చేస్తూ, భక్తి పారవశ్యం నర్తిస్తూ, సాధువులు, సన్నిధిలోనే ఆమెల రోజంతా గడిపేది. ఇది చూసిన బంధువులు ఆమెకు పిచ్చి పట్టిందనే తీర్మానానికి వచ్చారు. అయితే, సాధునన్న్యాసులు, మహాత్ములు మాత్రం భక్తి సంప్రదాయంలో ఆమె గొప్ప యోగిని అని గుర్తించి, గౌరవిస్తూ వచ్చారు. చివరకు అక్బర్ చక్రవర్తి తన ఆస్థానంలోని ప్రముఖ సంగీత విద్వాంసుడు తాన్సేన్ తో కలసి మీరాబాయిని సందర్శించినట్టు చెబుతారు. 

ఇది ఇలా ఉండగా, సన్న్యాసులతో కలసి మీరా పాటలు పాడుతూ, నృత్యం చేస్తుండడం వల్ల తమ పరువు ప్రతిష్ఠలు మంట గలుస్తున్నాయని రాజ కుటుంబం భావించింది. ఇంతలో మీరాబాయి భర్త భోజరాజు మరణించాడు. దాంతో, భోజరాజు తమ్ముడు రాజు అయ్యాడు. అతను మీరాను వేధించడం మొదలుపెట్టాడు. ఆఖరికి ఆమె మీద విషప్రయోగం చేశాడు. కృష్ణ భక్తురాలైన మీరా మాత్రం భగవత్ ప్రసాదంగా భావిస్తూ, అన్నిటినీ అంగీకరించింది. దేనినీ నిరసించలేదు. శ్రీకృష్ణుడి కరుణతో అన్ని అపాయాల నుంచీ ఆమె క్షేమంగా బయటపడింది.

చిట్టచివరికి మీరా తన స్వామి నడయాడిన బృందావనానికి వెళ్ళింది. ఆనంద పారవశ్యం మిన్ను ముట్టగా, శ్రీకృష్ణుడి ఎదుట ఆడి పాడింది. కాగా, జీవ గోస్వామి అనే ఓ వయసు మీద పడిన వైష్ణవ సాధువు అక్కడ ఉండేవాడు. ఆయన మీరా ముఖం చూడడానికి నిరాకరించాడు. తాను ఓ సన్న్యాసిననీ, కాబట్టి స్త్రీ ముఖం దర్శించననీ పేర్కొన్నాడు. ఆ సంగతి విని మీరాకు నవ్వొచ్చింది. బృందావనంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక్కడే పురుషుడనీ, మిగిలినవారందరూ గోపికలేననీ ఆమె బదులిచ్చింది. ఆమె మాటలు ఆ సాధువుకు ఆశ్చర్యం కలిగించాయి. అప్పటి దాకా సన్న్యాసిని కమ్ముకొని ఉన్న మాయ కాస్తా పటాపంచలైంది.

                                    ◆నిశ్శబ్ద.