Yeluka Vacche Illu Bhadram 28
This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.
ఎలుక వచ్చే ఇల్లు భద్రం - 28
ఇలపావులూరి మురళీ మోహనరావు
*******************************************************************
“ఛీ..ఛీ..ఒక్క పనీ సవ్యంగా చెయ్యడం రాదు.పిల్లిని తెచ్చేముందు అది ఆడదా మగదా...ఆడదైతే చూడిదా, చూడిదైతే ఎప్పుడు ఈనుతుంది లాంటివి చూడాలని తెలియదూ ?”కస్సుమంది సుందరి.
“అది ఆడదో మగదో చూడిదో పాడిదో నాకెలా తెలుస్తుంటే గాడిదా?నేనేమైనా పశువుల డాక్టర్నా ?ఏదో పిల్లి కావాలని కదాని పిల్లిని తెచ్చాను "కోపంగా అన్నాడు వెంకట్రావు.
“ఊ మరేం తెలుసు ?ఏదన్నా అంటే చచ్చేకోపం మీరు దిగండి.నేను చూస్తాను"వెంకట్రావును దించి తానేక్కింది సుందరి.
కూనలు పాలకోసం తల్లి పొదుగును పీకుతున్నాయి.రెండు కూనలు తాగుతుంటే నాలుగింటికి పక్కకు నెడుతుంది పిల్లి పీల స్వరంతో అరుస్తున్నాయి కూనలు.ఆ దృశ్యం చూసి హృదయం ద్రవించింది సుందరికి.
"చూడండి పాపం పాలకోసం కొట్టుకుంటున్నాయి గిన్నెలో కాసిని పాలు పోసి పట్రండి " అన్నది సుందరి.
“ఏడ్చినట్లే ఉంది.మనం పోయించుకునేదే అరలీటరు దాన్లో కలిపే నీళ్ళు అరలీటరు మళ్ళీ దీంట్లో పిల్లులకూ వాటానా ?”చిరాగ్గా అన్నాడు వెంకట్రావు.
“పాపం ఆ తల్లి బాధ చూడండి.మీరు కూడా గర్భం ధరించి నలుగురు పిల్లలను కంటే ఆవేదన తెలుస్తుంది.ఆడదాని కష్టం ఆడదానికే తెలుస్తుంది.వెళ్లి తీసుకురండి.అంతగా అవసరమైతే నేనీపూట కాఫీ మానేస్తాను "అన్నది సుందరి.
వెంకట్రావుకి జాలివేసింది.సుందరి అలా గలగల అరుస్తుంటే కానీ హృదయం నవనీతం అటువంటి వారి అంతరంగాలను అర్థం చేసుకోవడం అందరికీ చేతకాదు. మారు మాట్లాడకుండా వంటింట్లోకి వెళ్లి గిన్నెలో పాలు తెచ్చి అందించాడు.కూనల ముందు పెట్టింది సుందరి.కూనలు గిన్నెలో పాలు తాగుతుంటే మద్దొచ్చింది సుందరికి. స్టూలు దిగింది.
"శుభ్రంగా తాగాయండీ " అన్నది.
"ఎందుకు తాగవూ నోటి ముందు పెడితే నువ్వు మాత్రం వదిలిపెడతావా ?"కోపంగానే అన్నాడు వెంకట్రావు.
"ఇనకుంచీ రోజూ వీటికోసం మరో లీటరు ఎక్సట్రా పోయించుకోవాలి.”
“లీటరే !ఎన్నాళ్ళు ?”
“ఏం చేస్తాం మరి ?తెచ్చి పెట్టుకున్న శని అలాంటిది.పిల్లిని తేవయ్యా బాబూ అంటే పిల్లల తల్లిని తెచ్చారు.అయినా దరిద్రపు పిల్లికి ఒకే కాన్పులో ఇంతమంది పిల్లలా?మా అన్నయ్యకు పెళ్లి అయి పదిహేనేళ్ళయింది.ఇంతవరకు మా వదిన వేవిళ్ళన్నది ఎరగదు.వాడు ఎన్ని గుళ్ళు తిరిగాడు. గోపురాలు చూశాడు!ఈ పిల్లులకు మాత్రం ఎక్క దెబ్బకు అరడజను పిల్లలు "అన్నది సుందరి.
"అయితే వచ్చే జన్మలో మీ అన్నయ్యను పిల్లిగానో పందిగానో పుట్టమను కరువుదీరా పిల్లలను కంటాడు.”వేటాకరంగా అన్నాడు వెంకట్రావు.
"చాల్లెండి కుళ్ళు మాటలు.ముందు వెళ్లి మారో లీటరు పాలు పోయించుకురండి.చేతులు కడుక్కోవడానికి బాత్ రూమ్ కు వెళ్ళింది సుందరి.
“కానీ సుందూ...ఎన్నాళ్ళిలా మనం పిల్లి సంసారాన్ని భరిస్తాం "అడిగాడు వెంకట్రావు.
“చూద్దాం పిల్లి తన పిల్లలకు ఎడిళ్ళు మారుస్తుందట.అంతవరకు తప్పదేమో"చెప్పింది సుందరి.
గుండెలు బాదుకున్నాడు వెంకట్రావు.
(ఇంకావుంది)
(హాసం సౌజన్యంతో)