Yeluka Vacche Illu Bhadram 29
This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.
ఎలుక వచ్చే ఇల్లు భద్రం - 29
ఇలపావులూరి మురళీమోహనరావు
*******************************************************************
ఆఫీసుకు వెళ్ళగానే మేనేజర్, వెంకట్రావును పిలిచాడు.
"ఆ...రావోయ్ వెంకట్రావు. ఎలా వుంది మా బుజ్జితల్లి ?"నవ్వుతూ అడిగాడు మేనేజర్. వెంకట్రావుకి కోపం వచ్చింది. కాని నిగ్రహించుకున్నాడు. రాని నవ్వుని తెచ్చిపెట్టుకున్నాడు.
"హ...హ...చాలా బాగుంది సార్. నిన్ననే కాన్పయింది.లక్షణంగా ఆరుగురు పండంటి బిడ్డలను ప్రసవించింది.తల్లీ పిల్లలు క్షేమం ."అని చెప్పాడు వెంకట్రావు.
మేనేజర్ ముఖం మాడిపోయింది.అయినా నవ్వును పులుముకున్నాడు.
“గుడ్ గుడ్..ఎంత శుభవార్త చెప్పావయ్యా.ఈ సందర్భంలో నీకో ఇంక్రిమెంట్ రికమెండ్ చేస్తాను పాపం ఖర్చు పెరుగుతుంది కదా!” సానుభూతి ప్రదర్శించాడు మేనేజర్.
“థ్యాంక్యూ సార్... సార్ ఒక్కసారి పాపం తల్లీ పిల్లలను మీ ఇంటికి తీసుకొచ్చి మేడం గారికి చూపిస్తాను.మనవళ్ళను చూసి వారూ సంతోషిస్తారు " అన్నాడు వెంకట్రావు.
“వద్దు వద్దు..అంతపని చెయ్యద్దు.చెప్పాను కదా తల్లిదండ్రులు గుండె రాయి చేసుకోవాలని.నేనే ఆ శుభవార్తని మేడం గారికి చెబుతాలే.ఓకే యూ క్యారీ ఆన్ వెంకట్ "అని తలను ఫైల్లో ముంచాడు మేనేజర్.
మేనేజరును మనసులో బండబూతులు తిట్టి బయటికి వచ్చాడు వెంకట్రావు. పని చేస్తున్నాడే గానీ ఆలోచనంతా పిల్లుల మీదనే ఉన్నది వెంకట్రావుకి.ఒకదాంతో చస్తుంటే దానికి తోడు మరి ఆరు పిల్లలు.చూస్తూ చూస్తూ రోడ్డు మీద పారేయడానికి మనసొప్పడం లేదు.
ఇంట్లో భరించలేదు.
సాయంత్రం వెంకట్రావు రాగానే సుందరి ఓ దుర్వార్త చెప్పింది.
“అటక మీదినుండి ఏదో కంపు కొడుతుంది.కొంచం చూడండి "అని.
“స్నానం చేసి చూస్తాలే.బుర్ర వేడిగా ఉంది "అన్నాడు వెంకట్రావు.
“చూసి స్నానం చెయ్యవచ్చులే.కంపు కొడుతున్నది అంటే స్నానం చేసి చూస్తానంటారేమిటి ?”అంది సుందరి.
“అబ్బబ్బ నీ మతమే నీది కదా "విసుక్కుని స్టూలు ఎక్కాడు వెంకట్రావు.
పిల్లుల దగ్గరి నుంచి వస్తుంది ఆ దుర్వాసన. పిల్లి కూనలను కదిలించి చూశాడు. ఒకటి తప్ప మిగిలినవన్నీ కదులుతున్నాయి.
“ఔనోయ్...నీ అనుమానం నిజమే.ఒక కూన చచ్చింది "చెప్పాడు వెంకట్రావు. “చచ్చిందా..?ఎలా...?పొద్దున, మధ్యాహ్నం పాలు పెట్టానే ?”అంది సుందరి.
“పాలు ఎక్కువై చచ్చుంటుంది.ఏం చేద్దాం ఇప్పుడు ?” అన్నాడు వెంకట్రావు.
“ఏం చేద్దామని నన్నడుగుతారే? ముందు దాన్ని తీసుకెళ్ళి బయట పడేసిరండి.లేకపోతే రాత్రికి ఊరువాడా అంతా కంపు లేస్తుంది "చెప్పింది సుందరి.
“ఛీ...నేను పారేయ్యాలా?నాకు వళ్లు జలదరిస్తుంది.నువ్వే పారేయ్ "అన్నాడు వెంకట్రావు. “ఛిఛి...నాకు వాంతులోస్తాయి.”అన్నది సుందరి.
“నాకు కంపరమొస్తుంది.నేను ముట్టుకోను "అని చెప్పాడు వెంకట్రావు.
“నాకు మూర్ఛ వస్తుంది.ముందు దాన్ని తీసెయ్యండి "అంది సుందరి.
“వెధవ సలహా ఇచ్చింది నువ్వేగా.చీపురుతో నువ్వే తీసెయ్ "అన్నాడు వెంకట్రావు.
“మీరేం మగాళ్ళండీ.మన పక్కింటాయన్ని చూడండి.వాకిట్లో కుక్క చస్తే ఈడ్చీ అవతల పారేశాడు. ఆడదాన్ని నన్ను తియ్యమంటారేం ?”అంది సుందరి.
“అలా పోలికలు తెస్తే నాకు ఒళ్ళు మండుతుంది "కోపంగా గట్టిగా అన్నాడు వెంకట్రావు.
వీరి వాగ్యుద్ధం గోడచాటున నిలబడి ఆసక్తిగా వింటున్న ఆండాళ్ళమ్మ లోలోపల నవ్వుకుంటూ సుందరిని పిలిచింది "సుందరి "అంటూ.
(ఇంకావుంది)
(హాసం సౌజన్యంతో)