Yeluka Vacche Illu Bhadram 26

 

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

ఎలుక వచ్చే ఇల్లు భద్రం - 26

ఇలపావులూరి మురళీ మోహనరావు

***********************************************************************

మధ్యాహ్నం ఆఫీసులో. వెంకట్రావును పిలిపించాడుమేనేజర్.

“ఏమోయ్ వెంకట్...ఏమంటోంది మా బుజ్జితల్లి "అడిగాడు మేనేజర్.

ఏం చెప్పాలో తోచలేదు వెంకట్రావుకు.పిల్లి కనిపించడం లేదంటే మేనేజర్ గారికి కోపం వస్తుందేమోనని దడదడలాడింది వెంకట్రావుకు.

“బ్రహ్మాండం సార్.చాలా సంతోషంగా ఉంది.కంటిపాపలా మా ఇంటి జ్యోతిలా మా అందరికీ తోడుగా ఉంది సార్ "అని చెప్పాడు వెంకట్రావు.

“గుడ్ గుడ్ పాపం ఆకలికి అసలు ఉండదోయ్ మా బుజ్జిముండ.బాగా తిండీ పెడుతున్నావు కదా!”

"దానికేం లోపం లేదు.మేం తాగినా తాగక పోయినా దానికి మాత్రం మూడు పూట్లా పాలు పెరుగు మీగడ,జున్నుపాలు తినిపిస్తున్నాం సార్ "చెప్పాడు వెంకట్రావు.

“గుడ్ గుడ్ మరి టీవీ చూస్తుందా ?”అడిగాడు మేనేజర్.

“ఫస్ట్ క్లాసుగా సార్.దానికోసం రోజూ రెండు మూడు గంటలు టీవీని పెట్టుంచుతాం.దానికోసమని ఇప్పుడు మేము కూడా యానిమల్ ప్లానెట్ చూడటం అలవాటు చేసుకున్నాం "చెప్పాడు వెంకట్రావు.

“వెరీగుడ్ వెరీగుడ్...ఎంటోనోయ్ వెంకూ.దాన్ని నీకు ఇచ్చామనేగానీ మా మనసంతా దాని మీదనే మా ఆవిడ రెండు రోజులపాటు అన్నం తినలేదు.వాళ్ళ నాన్న లారీ కిందపడి పిసురుపిసురైన అంత దిగులు పడలేదు.తొందరపడి నీకిచ్చానని ఒకటే పోరు పెడుతున్నది. రాత్రి పడుకుంటామన్న మాటే గానీ అస్సలు నిద్ర పట్టడం లేదు.కళ్ళు మూసినా పిల్లే,తెరిచినా పిల్లే.”ఎక్కడ విచారాన్ని ముఖంలోకి తెచ్చుకున్నాడు మేనేజర్.

“అవునుసార్ దాని అందమే అందం,దాని ఠీవే ఠీవి. నడుస్తుంటే పులి నడుస్తుందా అన్నట్లుండేది. రాత్రిపూట దాన్ని చూస్తుంటే రెండు కళ్ళలో ఇద్దరు సూర్యూలున్నారా అన్నట్లు వెలిగిపోయే కళ్ళు.

దానిమ్మ గింజల వంటి పలువరుస!అది ముఖం కడుక్కోక పోయినా ముత్యాల్లా మెరుస్తుంటాయి . పళ్ళు అది నోరు తెరిస్తే సినిమా హీరోయిన్ నవ్వినట్లుంటుంది.అటువంటి అందాలబొమ్మను మర్చి పోవడం ఎవరికీ సాధ్యం కాదు సార్"అన్నాడు వెంకట్రావు. “అవునయ్యా.కన్నకూతురును పెంచినట్లు పెంచాను.

మా ఆవిడ దాన్ని చూడాలని కలవరిస్తున్నది. ఎలాగైనా ఒక్కసారి రాత్రి మా యింటికి భోజనానికి తీసుకురారాదూ "అన్నాడు మేనేజర్.

వెంకట్రావు గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లయింది.సమాధానం ఎలా చెప్పాలా అని బుర్ర గోక్కున్నాడు.పిల్లి కనిపించడం లేదంటే మేనేజరుకు కోపం వస్తుందేమో!ఎలారా దేవుడా అని ఆలోచించసాగాడు.

“ఓకే ఓకే వెంకట్రావు.ఐ కెన్ అండర్ స్టాండ్ యువర్ ఫీలింగ్స్.వారం రోజుల నుండీ దానికి అలవాటు పది మళ్ళీ దాన్ని వదిలి ఉండాలంటే నీకు బాధగానే ఉంటుంది.అయినా ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపిన తరువాత చీటికిమాటికి పిల్లను చూడాలనుకోవడం తల్లిదండ్రులకు తగదు.

అయినా వియోగ బాధ భరించలేక అలా అడిగాను ఏమనుకోకు నా బంగారు తల్లికి ఏ కష్టం తెలియకుండా సాకుతావని నాకు నమ్మకం ఉంది "కంటి కొనలతో చూస్తూ అన్నాడు మేనేజర్.

“థ్యాంక్యూ సార్.మీ నమ్మకం నిలబెడుతాననే నమ్మకం నాకున్నది.కానీ సార్ పిల్లి వల్ల కొంచెం ఖర్చు పెరిగింది "నసిగాడు వెంకట్రావు.

“ఓకె ఓకె కొంచం చూసి చూడనట్టు పోతాలే.పిల్లిని మాత్రం జాగ్రత్తగా చూడు.ఒకవేళ మా యింటికి వచ్చే ప్రయత్నాలు ఏవైనా చేస్తుందేమో కొంచెం కనిపెడుతుండు.పెళ్ళయిన ఆడపిల్ల తరచు పుట్టింటికి వెళ్లడం మంచి సంప్రదాయం కాదు.తల్లిదండ్రులే గుండెను రాయి చేసుకోవాలి "ఫైలు తెరిచాడు.

(ఇంకావుంది)

(హాసం సౌజన్యంతో)