Yeluka Vacche Illu Bhadram 25
This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.
ఎలుక వచ్చే ఇల్లు భద్రం - 25
ఇలపావులూరి మురళీ మోహనరావు
“ఏంటి సుందరిగారూ అదోరకంగా ఉన్నారు?వంట్లో బాగా లేదా ?”మర్నాడు ఉదయం దార్లోంచి పలకరించింది ఆండాళ్ళమ్మ.
“ఒంట్లో బాగానే ఉందండి.ఎలుకల పోరుతో చచ్చిపోతున్నాం "చెప్పింది సుందరి.
ఆండాళ్ళమ్మకు చాలా ఆనందం కలిగింది.పైకి మాత్రం చాలా విచారంగా ముఖం పెట్టి"ఏదో పిల్లిని తెచ్చారుగా?అది ఎలుకను పట్టలేదా ?” అంది.
“అది మహా బద్దకపు పిల్లి.ముప్పొద్దులా తిని తాగి రాత్రి మాకంటే ముందుగా నిద్రపోతుంది.ఎలుక దిగులుకంటే దీని దిగులు ఎక్కువై పోయింది "చెప్పింది సుందరి.
“ఈ మాత్రం దానికే ఇంత విచారించాలా?నన్నడిగితే ఏదోక ఉపాయం చెప్పనా ?”అంది ఆండాళ్ళమ్మ “ఏం చెయ్యమంటారో చెప్పండి "
“దానికి ఆహారం ఏం ఇస్తున్నావు ?”
“మూడు పూట్లా పాలు,మేం అన్నం తినేటప్పుడు పెరుగన్నం "చెప్పింది సుందరి.
“అదీ సంగతి.దాన్ని ముప్పొద్దులా అలా ఎద్దును మేపినట్లు మేపుతుంటే ఇక ఎలుకను పట్టాల్సిన ఖర్మ దానికేం పట్టింది?కడుపు నకనకలాడుతుంటే మనిషైన,జంతువైనా పనిచేసేది.రెండు రోజులపాటు దానికి అసలేం పెట్టకు.అప్పుడు కడుపు మాడి ఎలుకను పడుతుంది "చెప్పింది ఆండాళ్ళమ్మ.
“అలాగా!ఇవాల్టి నుండి అలాగే చేస్తాను "అన్నది సుందరి.
ఆండాళ్ళమ్మ పకపక నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది.
ఆ రాత్రి పిల్లికి ఏమి పెట్టకుండా పడుకున్నారిద్దరూ.అర్ధరాత్రి నుంచి మ్యావ్ మ్యావ్ మణి అరవడం మొదలుపెట్టింది.
“ఏవండోయ్...వింటున్నారా?అరుస్తోంది "అన్నది సుందరి.
“చావనీ దొంగముండను ఎలుకను పట్టిందాకా దానికి పచ్చి మంచినీళ్ళు కూడా పోయద్దు "చెప్పాడు వెంకట్రావు.
“వాత పెడతాను.దాని రోగం అలాగే కుదరాలి.పడుకోండి "దుప్పటి ముసుగు తన్నింది సుందరి . తెల్లవారి లేవగానే అక్కడక్కడ రక్తపుబోట్లు కనిపించాయి.
“ఏవండోయ్ ఏంటీ రక్తం ?వామ్మో...ఎవరైనా చేతబడి చేశారా ఏంటి మనకు గాభరపడి వెంకట్రావును లేపింది సుందరి. వెంకట్రావు ఉలిక్కిపడి లేచాడు.రక్తపు బొట్లను చూస్తూ వంటింట్లోకి వెళ్లారు.చీలికలు పేలికలై కనిపించింది ఎలుక.
“వావ్..ఎలుకండీ!చచ్చింది "చప్పట్లు కొట్టింది సుందరి.
“శభాష్...పిల్లంటే నీవే పిల్లీ...హేట్సాఫ్ టూ యూ "సెల్యూట్ చేశాడు వెంకట్రావు.
“దేనిపని అదే చెయ్యాలి కానీ మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఏం లాభం ?మనం మొదటే ఈ పని చేసుంటే పధ్నాలుగు వేలు ఆ డాక్టరుగాడి బొందన పెట్టుండేవాళ్ళం కాదు,నాకు కనీసం నాలుగు గాజులు వచ్చుండేవి "విచారంగా అన్నది సుందరి.
“ఏం చేస్తాం ?ప్రాప్తం ఉండాలి.జరిగిందేదో జరిగింది.ఒక పెద్ద పీడా వదిలింది "అన్నాడు వెంకట్రావు ఎలుకను కాలితో తంతూ.
“ఊ ఊ చచ్చిన పామును చంపడానికి అంతా తయారే "వెక్కిరించింది సుందరి.
“ఇక ఈ పిల్లిని వదిలించుకోవాలి.దీనికి ఇక నుంచీ అన్నం పెట్టకు "అన్నాడు వెంకట్రావు.
“ఇక అన్నమా సున్నమా?దీన్ని మేపలేక చచ్చాం.పైగా దీనికి టీవీ చూసే జబ్బుంది.మీరు ముఖం కడుక్కుని రండి కాఫీ తాగుదాం "డికాషన్ వేస్తూ అన్నది సుందరి.
ఏమైందో ఏమో తరువాత రెండు రోజుల పాటు పిల్లి కనిపించలేదు.
“ఇదేదో విచిత్రమైన పిల్లిలా ఉందే!ఎలుకను చంపగానే తన డ్యూటీ అయిపోయినట్లుగా ఎక్కడికో వెళ్లినట్లుంది "సంతోషంగా అన్నది సుందరి.
“రియల్లీ...రాక్షసుడిని చంపగానే దేముడు అవతారం చాలించినట్లు మన ఎలుకను చంపడానికే వచ్చినట్లుంది ఈ పిల్లి.దీన్లో భగవదంశ ఉంటుంది.నా ఉద్దేశ్యంలో అది మరొకరింటికి పోయుంటుంది" అన్నాడు వెంకట్రావు.
“అవును పాపం దాన్ని అనవసరంగా ఆడిపోసుకున్నాం.నిజంగా మేలిమిజాటి మార్జాలం "బాధగా అన్నది సుందరి.
(ఇంకావుంది)
(హాసం సౌజన్యంతో)