Yeluka Vacche Illu Bhadram 24

 

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

ఎలుక వచ్చే ఇల్లు భద్రం -24

ఇలపావులూరి మురళీ మోహనరావు

రాత్రి ఒంటి గంటైనది.

వెంకట్రావును గిల్లింది సుందరి.

ఉలిక్కిపడి గావుకేక పెట్టి లేచాడు వెంకట్రావు.

“ఉష్...అరవకండి.మెల్లగా లేవండి "అన్నది సుందరి.

“ఓసి నీ మొగుడు కలెక్టరు గానూ...దానికంత గట్టిగా గిచ్చాలా ?”అన్నాడు వెంకట్రావు. “గిచ్చలేదు.గిల్లాను.అయినా పెళ్ళైన కొత్తల్లో నా చేత అడిగి మరి గిచ్చుంచుకోలేదు ?”అంది సుందరి. “ఆ రోజులు వేరు.ఆ అందాలు వేరు.ఇంతకూ ఎందుకు లేపినట్లు ?”అన్నాడు వెంకట్రావు.

“కాస్త నౌకా విహారం చేద్దామని "

“పద.హాయిగా లాహిరి లాహిరి లాహిరిలో అని పాడుకుంటూ అలా పండు వెన్నెట్లో తిరిగొద్దాం " “హు...నా బతుక్కు అదొకటే తక్కువ "

“రసపట్టులో తర్కాలు కూడదోయ్ "సుందరిని కౌగిట్లో బిగించాడు వెంకట్రావు.

డొక్కలో నొక్కేసరికి కీచుమన్నాడు వెంకట్రావు.

“అయ్యా...మనం ఇప్పుడు లేచింది మన పిల్లి ఏం చేస్తున్నదో చూద్దామని "అని చెప్పింది సుందరి.

“ఓ మర్చిపోయాను లే పద "లేచాడు వెంకట్రావు.

ఇద్దరూ మెల్లగా చప్పుడు కాకుండా అడుగులో అడుగులు వేస్తూ నడవసాగారు.ఒక మూల గుడ్డల్ని కొరుకుతున్న ఎలుక తోకమీద కాలు వేసింది సుందరి.అరికాల్లో పొడవాటి తోక మెత్తగా తగిలేసరికి వళ్ళంతా జలదరించి పెద్దగా అరిచింది సుందరి.తెగబలిసిన ఎలుక ఇద్దరి కళ్ళముందే మరో గదిలోకి దూరింది.

“భయపడకు ఎలుకలే "ఊరడించాడు వెంకట్రావు.

“దీన్దుంపతెగ...మనం రోజూ మైసూర్ శాండిల్ సబ్బుతో నాలుగు సార్లు స్నానం చేసినా చర్మమంతా గరగరలాడుతుంది.జన్మలో స్నానం అన్నది చెయ్యకపోయినా ఈ వెధవ జంతువుల చర్మం మాత్రం స్పాంజిలా,దూదికంటే మెత్తగా ఉంటుంది.పామెమో అనుకుని హడలి పోయాను "గుండె పట్టుకుని అన్నది సుందరి.

ఇద్దరూ కలిసి హలంతా వెదికారు.పిల్లి కనిపించలేదు. “ఎటుపోయిందబ్బా ఇది ?పూర్వం మా తాత కూడా ఇంతే.రాత్రి అందరితో పాటు పడుకునే వాడు. అర్ధరాత్రి లేచి చూస్తే మంచం మిద కనిపించేవాడు కాదు.మళ్ళీ తెల్లవారి లేచి చూస్తే మంచం మీదే ఉండేవాడు.”అన్నాడు వెంకట్రావు. “మీ బామ్మ దగర వెళ్ళేవాడేమో "

“ఉహు...ఊరి పొలిమేరల్లో కొన్ని పూరి గుడిసెలుండెవి.తాతకు అక్కడ ఒక సెకండ్ సెటప్పుండేదట. దాని కోసం రాత్రి పదకొండింటికి మూడు మైళ్ళు నడిచి వెళ్ళేవాడట.అలాగే దీనికి కూడా ఎక్కడైనా...”అంటూ మధ్యలో ఆపేసాడు వెంకట్రావు.

“చాల్లెండి...ముందు పిల్లిని చూద్దాం పదండి "వెతకసాగింది సుందరి.

వంటింట్లోకి వెళ్ళారిద్దరు.ఆ దృశ్యం చూసి కడుపు రగిలిపోయింది సుందరికి.స్టౌ పక్కన ముడుచుకుని పడుకుని గాఢనిద్ర పోతున్నది పిల్లి.

“ఆహా!ఏం పిల్లిని తెచ్చారండీ!రాత్రంతా మేలుకుని మర్నాడు పగలు నిద్రపోయే కొత్తపెళ్ళి కొడుకులా గురకలు పెట్టి నిద్రపోతున్నది.జన్మ ధన్యం "వెక్కిరిస్తూ అన్నది సుందరి.

“అరగంట క్రితం మనం లేచి నేను గావుకేక పెట్టి,నువ్వు కెవ్వున కేక పెట్టి ఇంత శబ్దాలు చేస్తున్నా ఇది ఈ విధంగా నిద్రపోతున్నదంటే దీనికెంత కొవ్వేక్కిందో చూడు "పిల్లిని చేత్తో గుద్దాడు వెంకట్రావు.

పిల్లి లేచి భయకరంగా అరిచి కాలితో వెంకట్రావు చేతిని గీరి మరో గదిలోకి పారిపోయింది.పిల్లి గీరిన చోట చర్మం లేచింది. “అబ్బబ్బ...బ్బ...”అన్నాడు వెంకట్రావు చేతిమీద ఊదుకుంటూ.

“ఎంత విశ్వాసం లేనిదీ పిల్లి!ఛీ ఛీ...మనుషులూ అలాగే ఉన్నారు.జంతువులూ అలాగే ఉన్నాయి. ఎవ్వరికీ విశ్వాసం అన్నది లేదు.ముందు చేతికేదైనా మందు రాస్కోండి.లేకపోతే సెప్టిక్ అయి మళ్ళీ డాక్టరు దగ్గరకు పోవాల్సోస్తుంది "అన్నది సుందరి.

“మైగాడ్..మళ్ళీ డాక్టరన్నమాటేత్తకు ఇప్పటికే తలవాచిపోయింది.కాస్త పౌడర్ రాసుకుంటాలే.పద పడుకుందాం.”బెడ్ రూములోకి దారి తీశాడు వెంకట్రావు.

“ఇంత బద్దకపు పిల్లిని నా జన్మలో చూడలేదు.తిని దున్నపోతులా నిద్రపోవడం తప్ప ఎలుకలను పట్టుకోవాలన్న జ్ఞానమే లేదు.బద్ధకం తప్ప బుద్ధిలేని మొద్దు "తిట్టిపోసింది సుందరి.

“సర్లె..ఎన్ని తిట్టినా దాని కర్థం కాదులే.ఇకరా...”పిలిచాడు వెంకట్రావు.

(ఇంకావుంది)

(హాసం సౌజన్యంతో)