అమ్మో అమ్మాయిలు 12
“ఐడియా బాగానే వుంది. ఎటొచ్చి, మీరు ఏ అవసరం నిమిత్తం రూమ్ బయటకు వెళ్ళదలిచారో అది ఫలించక ఆ పని రూంలోనే చేయాల్సొస్తుం దని నా బాధ "
షేరు ఆముదం తాగినట్లు' ముఖం పెట్టి అంది జయచిత్ర.
అబ్బులు భూతద్దాల్లోంచి ఎటో చూస్తూ 'మా చెడ్డపిల్ల' అనుకున్నాడు. వ్యాకర్ణ జయచిత్ర అన్నది వినిపించుకోనట్లు ముఖం పెట్టి ఊ..."బామ్మగారేం చేస్తున్నారో" అన్నాడు.
“నే చెప్పవలసింది చాలా మిగిలిపోయింది. నేను చెప్పేది వినక బామ్మగారేం చేస్తున్నారు? అమ్మమ్మగారి పనయిందా? అంటూ అధిక ప్రసంగం చేస్తారేమిటి? ఇలా అయితే మీరు మా ఇంట్లో వున్నట్లే" అని గదమాయించి మళ్ళీ మొదలుపెట్టింది జయచిత్ర.
“మీరు మా యింటికొచ్చిన తరువాత ఎంత జాగ్రత్తగా వుండాలో ఎందుకు చెబుతున్నాను. మీ శ్రేయస్సు కోరి. ఆడపిల్లని మొదటిసారి అత్తవారింటికి పంపేటప్పుడు అత్తవారింట్లో అక్కడి మనుషులతో ఎంత జాగ్రత్తగా వుండాలో ఎందుకుపెద్దవారు చెబుతారు. ఆ పిల్లకి ఏమి తెలియదు కాబట్టి వెళ్ళేది కొత్త ప్రదేశం. మేలిగేది కొత్త మనుషులతో కాబట్టి....'
జయచిత్ర వాక్ ప్రవాహానికి అడ్డు తగిలి "ఇప్పుడు మేం వెళ్ళేది అత్తారింటికి కాదు కదండీ అద్దె ఇంట్లోకి కాయే" అన్నాడు బిక్క ముఖం వేసి అబ్బులు. ఛ ఛ మరీ పసి పిల్లాడిలా మాట్లాడతారేంటి. అత్తారింటికి హాయిగా వెళ్ళవచ్చు. అద్దె ఇంటికి వెళ్ళటమే మహా మహా కష్టం. ఎక్కడిదాకానో ఎందుకు? రేపు మా ఇంటికి వస్తారుగా తెలుస్తుంది. బాత్ రూంకి వెళ్ళాలనుకోండి మా ఇంట్లో భాగాలన్నీ దాటుకుని వెళ్ళాలి. ఓ భాగం దగ్గర తల వంచుకుని నడవాలి. మరో భాగం దగ్గర ఒంగుని నడవాలి. ఇంకో భాగం దగ్గర ముఖం పక్కకు తిప్పుకుని నడవాలి"
“ఇంకో భాగం దగ్గర పరుగు తీయాలనుకుంటానండీ!” కసిగా అన్నాడు వ్యాకర్ణ.
“కరెక్ట్" అంటూ మెచ్చుకోలుగా వ్యాకర్ణను చూసింది జయచిత్ర.
“ఈ పనులన్నీ ఎందుకు చేయాలండీ?” అడిగాడు అబ్బులు.
“అలా అడిగారు బావుంది" అని అబ్బులుని కూడా మెచ్చుకుని కథలోకి దిగింది జయచిత్ర. “ముందే చెప్పా కదండీ! మా ఇంట్లో రకరకాల మనస్తత్వం వున్న వ్యక్తులున్నారని. మీరు బాత్ రూంకి వెళ్ళేముందు రూంలోంచి బయటకు వచ్చి ఎడమవైపు తిరుగుతారు కదా! అక్కడ వున్న వాటాలో వృద్ధ కన్య అమాంతం హా నాథా వచ్చితివా అంటూ వచ్చి మీకు అడ్డు తగుల్తుంది.
అదెలాగొలా తప్పించుకుని నాలుగడుగులు వేసి పడమటవైపు తిరిగి పదడుగులు వేశారనుకోండి. అక్కడ మరో గండం. అనుమానం మొగుడు అడ్డు తగిలి ఏమయ్యా బుద్ధుందా లేదా అసలు కొద్దిగా అయినా వుందా అని! నా పెళ్ళాం వేపు అంతగా కోరికలుంటే అంతగా భరించలేకపోతే ఎవత్తెనో ఒక దానిని పెళ్ళాంగా తెచ్చుకో. నీ పెళ్ళాన్ని నేను చూస్తే వూరుకుంటావా అంత! మాట్లాడవేమిటయ్యా? ఏమిటలా చూస్తావ్. మళ్ళీ నా పెళ్ళాం కనబడుతుందా అనేనా' అని అరగంట సతాయిస్తాడు.
అదెలాగో తప్పించుకుని మూడడుగులు నడిచి, దక్షిణానికి తిరుగుతారనుకోండి చెవిటిమాలోకం తగులుకుంటాడు. ఎక్కడికబ్బాయ్ లెట్రిన్ కా అంటాడు. మీరేమో కాదండీ బాత్రూమ్ కి అంటారు. వెంటనే ఆయన నవ్వి లెట్రిన్ కయితే అర్జంట్ గా వెళ్ళాల్సింది. బాత్రూమ్ కయితే, ఆలస్యమయినా ఫర్వాలేదు. లెట్రిన్ కి కాదు సరాసరి బాత్రూమ్ కా అయితే తొందరేమిటి. కాస్సేపు మాట్లాడి వెళ్లండి. ఏంటంటున్నారు. ఫర్వాలేదనా. మీ సంగతి నాకు తెలీదండీ" ఇలా సాగుతుంది ఆయన వాక్ ప్రవాహం.”