అమ్మో అమ్మాయిలు 11

 

ఈ పిల్ల మన్ని బెదరగొట్టి పంపాలని చూస్తున్న దేమో అనే అనుమానం అబ్బులుకి వ్యాకర్ణకి వచ్చింది. “చెంటి, మూగ, గుడ్డి, కుంటి, టి.బి. లెప్రసీ, పిచ్చి గిచ్చి, వాగైరా ఎటువంటి వారయినా సరే వాళ్ల పక్కన వుండగలం. మా గురించి మీకు దిగులక్కరలేదు" అన్నాడు. డొంట్ కేర్ మాష్టార్ అన్నట్లు ముఖం పెట్టి.

“అడ్డమైన వాళ్ళ పక్కన వుండటం మీ కలవాటయివుంటుంది" అంది జయచిత్ర. గతుక్కుమన్నారు యిరువురు.

ఆపై........... “ఈ పిల్లకు పొగరు" అనుకున్నాడు అబ్బులు. “పిల్ల రాక్షసి!” అని గొణుక్కున్నాడు వ్యాకర్ణ.

యిరువురు మౌనం వహించడం చూసి జయచిత్రే నోరు విప్పింది "అయిదో వాటా వద్ద ఆగాను కదూ!” అంది.

“ఏ వాటాలో ఎందరుంది. వాళ్ళ ఆకార వికార గుణగణాలు మేము మా వాటాలో కొచ్చి చేరింతరువాత చూస్తాంగా. ఇప్పుడొద్దులేండి" అన్నాడు వ్యాకర్ణ.

“సరే జాగ్రత్తలు వివరాలు అయినా చెప్పనీయండి?” అంది జయచిత్ర.

“చెప్పండి" అన్నాడు అబ్బులు.

“జాగ్రత్తగా వినండి.... జాగ్రత్తగా వినండి..... మీ వాటలోంచి బాత్ రూమ్ కి వెళ్లాలంటే దారి ఎటో చెబుతాను బాత్ రూమ్ కి దారి చెప్పడం ఏమిటండి ఈ పీత బొక్క అంత యింటిలో దేనికెటు దారో కనుక్కోలేమా? కొంప తీసి బాత్ రూమ్ అంటే కృష్ణకు దారి, లెట్రిన్ అంటే కాల్వ వడ్డుకి దారి చూపించరు కదా?” అన్నాడు అబ్బులు.

“లెట్రిన్, బాత్ రూమ్, పంపు, బావి అన్నీ మా పెరటివేపే ఉన్నాయి. వచ్చిన చిక్కేమిటంటే వాటి దగ్గరకు వెళ్ళాలంటే సమాంతర రేఖలు పట్టుకుంటే లాభంలేదు. వక్ర రేఖలు పట్టుకోవాలి. ఇది పగటి మాట. ఇహ రాత్రిళ్ళు అయితే టార్చిలైటు, మెత్తని బుట్లకర్ర, వగైరా వస్తువులుండడం మంచిది..”

“డిటెక్టివ్ నవలలో డిటెక్టివ్ లా మెలగాలన్నమాట" అన్నాడు వ్యాకర్ణ.

“సరిగ్గా గ్రహించారు" వ్యాకర్ణని మెచ్చుకోలుగా చూస్తూ అంది జయచిత్ర.

“గ్రహించాము సరే. ఈ జాగ్రత్తలు దేనికి!” అన్నాడు అబ్బులు.

“జాగ్రత్తలు దేనికేమిటి? జాగ్రత్తగా వుండటానికి, మీరు బాత్ రూమ్ కెళ్ళాలంటే.. పోనీ లెట్రిన్ కెళ్ళాలంటే?”.

“ఇప్పుడా అవసరం లేదండీ"

ఓ సారి లెట్రిన్ కి వెళ్ళి రమ్మంటుందేమో అని కంగారు పడి అడ్డు తగిలాడు అబ్బులు. మీకు తొందర జాస్తి అంది జయచిత్ర “బాగా గ్రహించారు" అన్నాడు అబ్బులు.

“అవసర విషయాలకి ముందుకొస్తారు మీరు అంది జయచిత్ర వ్యాకర్ణని చూస్తూ .బాగా గ్రహించారు వెంటనే నాలిక కొరుక్కున్నాడు 'ఆ' అని వ్యాకర్ణ... భూతద్దంలో నుండి వ్యాకర్ణ ని చూస్తూ “కుదిరింది రోగం.... వదిలింది వాతం' అని లోలోపల రాగం తీశాడు అబ్బులు.

'నే చెప్పేది సాంతం వినకుండా అడ్డు తగుల్తున్నారు. లెట్రిన్ కి వెళ్ళాలంటే మీ భాగంలోంచి నాలుగు గదులు ముందుకు నడిచి, ఎడమ వేపు తిరిగి పదడుగులు వేస్తే, ఆటో సందు ఇటో సందు వస్తాయి. తూర్పు వేపు సందులోకి తిరిగి నాలుగు గజాలు దాటి దక్షణానికి దారితీస్తే, మూడంగల్లో పడమర వైపు దారితీస్తుంది. అక్కడ లెట్రిన్ వుంటుంది. బాత్ రూమ్ కి వెళ్ళాలంటే మీ రూమ్ కి ఎడమవేపు నడిచి, అక్కడ వున్న అడ్డుగోడ వేపు తిరిగి ఆ తరువాత పడమర వైపు పదడుగులు వేస్తే దక్షిణం వస్తుంది. ఆ పై తూర్పు....”

“జయచిత్రగారూ.. మీ తూర్పు పడమరలకు ఓ నమస్కారం. మీ ఇంట్లోచేరిన తరువాత లెట్రిన్ కి వెళ్ళకా తప్పదు. బాత్ రూమ్ పావనం చేయకా తప్పదు. అప్పుడు ఎటునుండి ఎటువెళ్ళితే ఎటు మునిగి ఎటు తెలుతామో తెలుసుకుంటాంలెండి" అన్నాడు వ్యాకర్ణ.

“తప్పిపోతామనే అనుమానం వచ్చిందనుకోండి. వెంటనే మా రూమ్ కిటికీకి ఓ పాతిక బారల చాంతాడు కట్టి, దాన్ని మా నడుముకి కట్టుకుని ముందుకు తిన్నగా సాగుతాం. రూటు తిన్నగా లేకపోతే.... మళ్ళీ మా రూంలోకి వచ్చి పడతాం. ఎలా వుంది నా అయిడియా?” మురిసిపోతూ అన్నాడు అబ్బులు.