అమ్మో అమ్మాయిలు 13
“ఆ వాక్ ప్రవాహం నుంచి బయటపడి తూర్పు వైపు సాగారనుకోండి. భజన బృందం గారి మడి మనుషులు అడ్డు తగిలి కాస్త ఆగండని చెప్పి, మిమ్మల్ని నుంచోబెట్టి మీ ముఖానే వాళ్ళపని కానిచ్చుకుని, ఇక మీరు వెళ్ళచ్చని చెప్పి, మీరు అలా వెళ్ళంగానే మీరు నడిచినంతమేరా, లేక మీ వీపుతో సహా పసుపునీళ్ళుశుద్ధికై చల్లబడతాయి. అప్పుడప్పుడు వేడి నీళ్ళు కూడా, ఆవు పంచకం సరేసరి?”.
ఆగండి.. ఆగండి..... “మీరు అన్నీ నిజమే చెబుతున్నారా అప్పటికే హడలిపోయిన" అబ్బులు అడిగాడు.
“పోనీ ఒకసారి అలా వెళ్ళి చూసొద్దామేంటి" అబ్బులు చెవి కొరికాడు వ్యాకర్ణ.
“నిజం చెప్పాలంటే, అన్నీ నిజం చెప్పటం లేదండీ,. శాంపిల్" అంతే అంతే అంది జయచిత్ర.
“ఇలా అయితే మరి ఎలాగండీ?” అన్నాడు అబ్బులు.
“ఓ పని చేయండి"
“చెప్పండి"
“మీరు రూంలోచి బయటకు వచ్చి బాత్ రూంకి వెళ్ళే మార్గంలో తీసుకోవలసిన జాగ్రత్తలు చెబుతాను. మననం చేసుకుని జాగరూకతతో మసలిన మీకు కష్టంబులు రావు"
“కానీండి కానీండి"
"ఎడమ వేపు మార్గంబున్న వృద్ధ కన్య మోము చూడక మీ మెడ కుడివేపుకి పూర్తిగా తిప్పుకుని ఆపై పడమటివేపు అనుమానం మొగుడి వాటా ముందు పూర్తిగా తల దించుకుని వెళితే, ఎందుకయినా మంచిది కాస్త నడుం కూడా వంచి, ముందుకు సాగి, అప్పుడు చెవిటి మాలోకానికి మళ్ళీ వస్తానని సంజ్ఞ చేసి, గబ్బుక్కున తూర్పుకి పారిపోండి. భజన బృందంగారి ప్లేస్ లో ఎత్తెత్తి అడుగులు వేస్తూ సాగితే....”
“ఏదీ మళ్ళీ చెప్పండి" అన్నాడు అబ్బులు.
“మళ్ళీ చెప్పమంటారా" అని మళ్ళీ చెప్పింది జయచిత్ర.
“ఏవండీ జయచిత్రగారూ...... తగు జాగ్రత్తలు చెప్పారు బానే వుంది. మా అబ్బులు గాడు నాలుగు కళ్ళతో ఎదుటివారిని చూస్తూ కూడా గుద్దేస్తూ వుంటాడు. అలాంటిది తలొంచుకుని నడిస్తే ఎవరినో ఒకరిని గుద్దేయక తప్పదప్పుడు" అంటూ వ్యాకర్ణ ఆగిపోయాడు.
“ఎలాండీ" అన్నాడు అబ్బులు భయపడిపోతూ.
“లాభం లేదు. ఇన్ని జాగ్రత్తలు ముందుగా మీకు. అదీ నేను మంచి పిల్లని కాబట్టి చెబితే, ఏ మాత్రం లక్ష్యం చేయకుండా మాకు ఓ అలవాటుంది............ గుడ్డుతాం.. తంతాం... అంటే ఎలా అండీ అసలు?” జయచిత్ర మాటలు పూర్తి కాకముందే బామ్మగారు హడావుడిగా లోపలినుంచీ వచ్చేశారు.
వచ్చి "ఎల్లుండి 4.40 కి వర్జ్యం లేదు. అన్ని విధాలా మంచిది అప్పుడొచ్చి గదిలో చేరండి" అంది ముళ్ళ కిరీటం సరి చేసుకుంటూ.
“ఎల్లుండి మంచిది కాదు నానమ్మా. శనివారం శని పట్టుకుంటుంది" అంది జయచిత్ర.
“నీ ముఖం కాదూ. శనివారం దివ్యమైన రోజు వెంకటరమణికి ప్రీతికరమైన దినం" అంది బామ్మగారు.
ఆలస్యం అమృతం విషం అని గబుక్కున అందుకుంటూ "ఇది వరకు మేం ఆ ఇంట్లో చేరినప్పుడు శనివారమే చేరాము. దివ్యమైన రోజు అంటే శనివారమే బామ్మగారూ" అన్నాడు వ్యాకర్ణ.
“హు. దివ్యమైన రోజు చేరారు కాబట్టే దివ్యంగా ఇల్లు మారుతున్నారు. ఇదెందుకొచ్చిందో" వ్యాకర్ణని ఓరకంటితో చూస్తూ అంది జయచిత్ర.
ఈ పిల్ల ముక్కు చెవులు కోయాలి కోపంగా అనుకున్నాడు వ్యాకర్ణ.
“భడవ కానా..... అన్నీ భడవ మాటలు. అల్లరి భయపెట్టి ఆడిస్తుంది. దాని మాటలకేం నాయనా. ఎల్లుండి వచ్చేసేయండి" అభయహస్తం ఇచ్చింది బామ్మగారు.
అలాగే అని జాయింట్ గా బుర్రలు వూపి బామ్మగారి దగ్గర శెలవు పుచ్చుకుని, ఎందుకైనా మంచిదని జయచిత్రకి కూడా చెప్పి శెలవు పుచ్చుకుని అక్కడ నుంచీ కదిలారు అబ్బులు, వ్యాకర్ణ. బామ్మగారు లోపలికి వెళ్ళిపోయారు.