తిరుమలలో ప్రాచీన ముఖ్యతీర్థాలు?

 

తిరుమలలో ప్రాచీన ముఖ్యతీర్థాలు?

 

 

1.    పాండవ తీర్థము : కురుక్షేత్ర సంగ్రామం సమాప్తం అయిన తరువాత పాండవులు బ్రహ్మహత్యా పాపాలు పోగొట్టుకోడానికి ఈ తీర్థంలో స్నానం చేసి క్షేత్రపాలకుని పూజించి శ్రీనివాసుని దర్శించుకున్నారు. పాండవులు ఈ తీర్థంలో స్నానం చేయడంవల్ల ఈ తీర్థానికి పాండవ తీర్థం అనే పేరు కలిగింది. ఈ తీర్థం దేవాలయానికి ఉత్తరదిశలో ఉంది.
2.    సనకసనందన తీర్థము : సనకసనందనాదులు ఇక్కడ తపం ఆచరించి సిద్ధి పొందిన స్థలం. ఈ తీర్థంలో మార్గశిర శుక్లపక్ష ద్వాదశిరోజున స్నానం చేసినట్లయితే సిద్ధి పొందుతారు. ఈ తీర్థం పాపవినాశనం ఉత్తరభాగంలో ఒక మైలు దూరంలో ఉంది.
3.    కుమారధారా తీర్థము : మాఘపౌర్ణమి రోజు ఇక్కడ స్నానం చేసినట్లయితే సంతానప్రాప్తి కలగటమే కాక సకల కార్యసిద్ధి కలుగుతుంది. ఈ తీర్థం దేవాలయానికి ఆరుమైల్ల దూరంలో ఉంది.

 

 

4.    తుంబుర తీర్థము : ఈ తీర్థంలో తుంబుర నారదమహర్షి తపస్సు చేసి తరించిన స్థలం. కాబాట్టి ఈ తీర్థంలో ఫాల్గుణ శుద్ధ పౌర్ణమిరోజు స్నానం చేసినట్లయితే భక్తి జ్ఞానాలు కలిగి సర్వపాపాలు నశిస్తాయి. ఈ తీర్థం ఆలయానికి ఆరుమైల్ల దూరంలో ఉంది. ఈ తీర్థానికి వెళ్ళే దారి మధ్యలో క్షేత్రపురోహితులు ఫాల్గుణ శుద్ధ పౌర్ణమినాడు యాత్రికులకు చలిపందిళ్ళు వేయించి నీరు, మజ్జిగ, పానకాలు ఇస్తారు.
5.    నాగతీర్థం : ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే కన్యలు ఉత్తమ పురుషుని పొందుతారు. శ్రీహరి ఆలయానికి ఒక కిలోమీటరు దూరంలో ఉంది.
6.    చక్ర తీర్థం : భారత యుద్ధం ముగిసిన తరువాత శ్రీహరి చక్రం పంచ మహాపాతకాలకు గురి అవడం వలన ఈ తీర్థంలో తన సుదర్శన చక్రాన్ని స్నానం చేయించారు. ఇక్కడ స్నానం చేసినట్లయితే వారికి బ్రహ్మ హత్య, శిశు హత్య దోషాలు తొలగి పవిత్రులు అవుతారు. శ్రీహరి ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది.

 

 

7.    జాబాలి తీర్థము : ఈ తీర్థంలో జాబాలి అనే మహర్షి తాపం ఆచరించి తరిచారు. ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే భూతప్రేత పిశాచాలు తొలగటమే కాక మనోవాంఛ సిద్ధిస్తుంది. ఇక్కడ ఆంజనేయస్వామివారి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయానికి హథీరాంజీ మఠాధిపతులు నిత్య నైవేద్య ఆరాధనలు స్వామివారికి యిస్తారు. ఈ ఆలయం మఠాధిపతుల ఆధీనంలో ఉంది.
8.    బాల తీర్థము : నాగతీర్థం నుండి రెండువందల గజాల దూరంలో ఉంది. ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే వృద్ధులు సహితం బాలురు అవుతారు. సృష్టికి అవరోధం కలుగుతుందని ఈ తీర్థం శిలలతో మూసివేయబడింది. జలం కనిపించదు.
9.    వైకుంఠ తీర్థము : ఈ తీర్థంలో స్నానం చేసినవారికీ వైకుంఠప్రాప్తి కలుగుతుంది. ఈ తీర్థం కోవెలకు తూర్పు దిశలో ఒక కిలోమీటరు దూరంలో ఉంది. పురజనులు ఇక్కడ వైకుంఠసమారాధన అప్పుడప్పుడు చేస్తూనే ఉంటారు.

 

 

10.    శేష తీర్థము : ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే వారికి మరుజన్మ ఉండదు. ఈ తీర్థానికి వెళ్ళటం చాలా కష్టం. పర్వతాలను ఎక్కడం కష్టపడటమే కాక చిన్న ప్రవాహాలను దాటాలి. ఇక్కడ పాచి పట్టి ఉంటుంది. జాగ్రత్తగా దాటాలి. ఈ తీర్థం యొక్క విశేషం ఏమిటంటే ఆదిశేషుడు శిలారూపంలో ఉంటాడు. ఇదే కాక ప్రత్యేకంగా కొన్ని నాగుపాములు ఈ తీర్థంలో తిరుగుతూనే ఉంటాయి. దేవాలయానికి పదికిలోమీటర్ల దూరంలో ఉంది.
11.    సీతమ్మ తీర్థము : ఈ తీర్థంలో సీతాదేవి కుశవులకు కరం నూరిపోసింది. బండ అరగటం నేటికీ చూడవచ్చు. ఇక్కడ ఒక బిలం ఉంది. జలం బయటికి కనిపించదు. పొడుగాటి వెదురుకు కొబ్బరి పీచుకట్టి బిలంలో ఉంచి తోడితే నీరు ప్రవహిస్తుంది. ఈ తీర్థంలో స్త్రీలు భక్తితో స్నానం చేసినట్లయితే ముక్తిని పొందుతారు.
12.    యుద్ధగళ తీర్థము : ఈ తీర్థంలో రాముడు రావణుని సంహరించిన తరువాత బ్రహ్మహత్య మహాపాతకాన్ని పోగొట్టుకోవడానికి ఈ తీర్థంలో స్నానం చేశాడు.

 

13.    విరజానది : ఈ నది శ్రీస్వామివారి పాదాల క్రింది భాగంలో ప్రవహిస్తున్నది. ఈ నది పైభాగంలో శ్రీవెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. స్వామివారి రెండవ ప్రాకారంలో పడమటి భాగంలో ఉగ్రాణము ముందున్న భూమికి సమంగా నీరు ఉంది. ఇది ఒక చిన్న బావిలా కనబడుతుంది. ఈ తీర్థాన్ని తలపై ప్రోక్షించుకుంటే మోక్షప్రాప్తి సిద్ధిస్తుంది.
14.    పద్మసరోవరము : ఈ సరోవరంలో స్నానం చేసినట్లయితే వారికి సకల భోగభాగ్యాలు కలగటమే కాకుండా భూతప్రేతపిశాచాలు వదిలిపోతాయి. ఈ సరోవరం పద్మావతి మందిరం దగ్గర ఉంది. తిరుపతి నుండి ఈ సరోవరం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సరోవరంలోని జలం స్వర్ణముఖి నదిలో కలుస్తుంది.

 

ఇవే కాక కాయరసాయ తీర్థం, ఫల్గుణి తీర్థము, కటాహ తీర్థము, వరాహ తీర్థము, విష్వక్సేన తీర్థము, పంచాయుధ తీర్థము, బ్రహ్మతీర్థము, సప్తముని తీర్థము, దేవ తీర్థము వంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి.