బ్రహ్మోత్సవాల ఏడవ రోజు సందర్భంగా- వరాహస్వామి వైభవం
బ్రహ్మోత్సవాల ఏడవ రోజు సందర్భంగా- వరాహస్వామి వైభవం
బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏడవ రోజు ఉదయాన శ్రీనివాసుడు సూర్యప్రభవాహనం మీద ఊరేగుతాడు. సప్తాశ్వాలతో కదిలే ఈ వాహనం మీద నిలిచే శ్రీవారు, సూర్యునికి ప్రతీకగా ఎర్రటి పూమాలలను ధరిస్తారు. ఇక సాయంవేళల చంద్రప్రభవాహనం మీద స్వామివారు భక్తుల చెంతకు వస్తారు. పున్నమినాటి చంద్రుని పోలిన చంద్రప్రభవాహనం మీద స్వామివారు శాంతికీ, స్వచ్ఛతకూ, చల్లదనానికీ ప్రతీక అయిన తెల్లని వస్త్రాలలో కన్నులపండుగ చేస్తారు. సూర్యుడు జీవానికి ప్రతీక అయితే చంద్రుడు మనస్సుని సూచిస్తాడు. పగటి వేళల సూర్యుడు రాజు అయితే చంద్రుడు తన చల్లని వెన్నెల వెలుగులతో రాత్రులను పాలిస్తాడు.
ఆ సూర్యచంద్రులిద్దరినీ పాలించేది తానేననీ, భక్తుల శారీరక రుగ్మతలను, మానసిక కష్టాలనూ తీర్చి, వారి జీవితాలను నడిపించే వెలుగు తానేనని స్వామివారు ఘంటాపథంగా చెబుతున్నారు. అందరికీ వరాలను ఒసగే స్వామివారికి నిలువనీడను కల్పించిన మూర్తి ఒకరున్నారు. తిరుమల ఆలయంలో వేంకటేశ్వరునికి ఎంత ప్రాథాన్యత ఉందో ఆ మూర్తికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఆయనే వరాహస్వామివారు. ఆయన గురించి కొంత…
వరాహమూర్తి: విష్ణుమూర్తి మూడవ అవతారమే వరాహా వతారము. హిరణ్యాక్షుడనే రాక్షసుని బారి నుంచి భూదేవిని రక్షించేందుకు విష్ణుమూర్తి వరాహ రూపంలో అవతరించాడు. హిరణ్యా క్షునితో జరిగిన ఘోర యుద్ధంలో అతడిని తన చక్రాయుధంతో దండించాడు వరాహస్వామి. ఆ తరువాత దేవతల కోరిక మేరకు శేషాచల కొండల మీద ఆవాసాన్ని ఏర్పరుచుకుని యోగులకు దర్శనమివ్వ సాగాడు.
అలా తిరుమల క్షేత్రం `ఆది వరాహక్షేత్రం`గా పేరుగాంచింది. శేషాచలం కొండను వరాహాద్రిగా కూడా పిలుస్తారు. కలియుగం వచ్చేసరికి లక్ష్మీదేవిని వెతుక్కుంటూ శ్రీనివాసుడు కూడా భూలోకానికి చేరుకున్నాడు. ఆ సమయంలో పాపం వేంకటేశ్వరునికి నిలువనీడ కూడా లేకపోయింది. పైగా గోపాలుర పొరపాటు వల్ల తీవ్రంగా గాయపడి ఉన్నాడు. అలాంటి సందర్భంలో వరాహ, వేంకటేశ్వరులిరువురూ ఒకరికొకరు తారసపడ్డారు. వరాహస్వామి ఆశ్రమం వద్దనే వకుళామాత కూడా స్వామివారిని కలుసుకుంది.
వేంకటేశ్వరుని, విష్ణుమూర్తిగా అవతారంగా పోల్చకున్నారు వరాహస్వామివారు. ఆయన ఉండేందుకు నూరు అడుగుల భూమిని ఇచ్చేందుకు కూడా సిద్ధపడ్డారు. అయితే ఆ వ్యవహారంలో భూమికి బదులుగా తనకు ఏదన్నా ఇమ్మని శ్రీవారిని కోరుకున్నాడు. తనకు ఇచ్చేందుకు శ్రీనివాసుని దగ్గర చిల్లిగవ్వ కూడా లేదని వరాహమూర్తికి తెలుసు. ఆ వంకనైనా వేంకటేశ్వరునితో పాటు కలియుగంలోనూ తన ప్రాభవాన్ని చాటుకోవడం ఆయన ఉద్దేశం కావచ్చు. వరాహస్వామి ఇచ్చిన నూరు అడుగులకు బదులుగా మున్ముందు కలియుగంలో తన వద్దకు వచ్చే భక్తులందరూ తొలుత ఆయననే దర్శించి కానుకలు సమర్పించుకుంటారనీ అనుగ్రహించాడు
వేంకటేశ్వరుడు. అలా ఇప్పటికీ ప్రథమ పూజ, ప్రథమ నైవేద్యం, ప్రథమ దర్శనం వరాహస్వామివారికే దక్కుతుంటాయి. తిరుమల ఆలయానికి చేరుకునే భక్తులు ముందుగా పుష్కరిణికి పక్కనే ఉన్న వరాహస్వామిని దర్శించుకుని ముందుకు కదులుతారు. వరాహస్వామివారి ఆలయంలో ఉన్న రాగి రేకు సాక్షాత్తూ వేంకటేశ్వరస్వామివారు వరాహస్వామికి రాసిచ్చిన దానపత్రంగా చెబుతారు. విష్ణుమూర్తి అవతారమైనప్పటికీ వరాహస్వామివారికి ప్రత్యేకించిన ఆలయాలు చాలా తక్కువ కావడంతోనూ, వేంకటేశ్వరుడి ఒప్పందంతోనూ ఈ ఆలయం ఆత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.
- నిర్జర.