తిరుమల బ్రహ్మోత్సవాలు- మూడవ రోజు
తిరుమల బ్రహ్మోత్సవాలు- మూడవ రోజు
తిరుమలలో స్వామివారికి జరిగే బ్రహ్మోత్సవాలలో ముచ్చటగా మూడవ రోజు ఉదయం స్వామివారు `సింహ వాహనం` మీద ఊరేగుతారు. ఇందుకు రెండు భావాలను అన్వయిస్తాయిరు. మనుషులలో ఉన్న మృగప్రవృత్తి మీద అదుపుని సాధించాలన్నది స్వామివారి సూచనగా ఒక భావం చెబుతారు. మరో రకంగా చూస్తే జంతువులన్నింటిలోకీ రారాజు మృగరాజే! సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తే హిరణ్యకశిపుని సంహరించేందుకు నరసింహావతారాన్ని ఎత్తాడు. నిరంతరం అరిషడ్వర్గాల ప్రలోభాలతోనూ, సంసార బాధ్యతలతోనూ చుట్టుముట్టబడి ఉన్నప్పటికీ సింహంలాగా ధైర్యంగా, శౌర్యంగా బతకాలన్నది మరో భావంగా చెబుతారు. ఇక మూడవరోజు సాయంవేళ స్వామివారు దేవేరులతో కలసి `ముత్యపు పందిరి వాహనం` మీద ఊరేగుతారు. ఉదయం వేళ సింహవాహనం స్వామివారి ఉగ్రతత్వాన్ని సూచిస్తే, సాయంవేళల ముత్యపు పందిరితో ఆయనలోని సౌందర్యమూర్తి దర్శనమిస్తాడు. ముత్యం చల్లదనానికీ, స్వచ్ఛతకూ, వైభవానికీ ప్రతీక. ఆ మూడు స్వామివారి లక్షణాలే కదా. మనల్ని చల్లగా కాచుకునే స్వామివారిని తానే తల్లిలా కాచుకున్న ఓ స్త్రీమూర్తి గురించి ఇవాళ తెలుసుకుందాం!
వకుళాదేవి:
ఇది ద్వాపర యుగంనాటి మాట! శ్రీకృష్ణునికి జన్మని ఇవ్వకపోయినా ఆయనని కన్నబిడ్డలా ఆలించి, లాలించి, పాలించిన తల్లి యశోద. కృష్ణుని తల్లి అంటే గుర్తుకువచ్చేది యశోదామాతే! కృష్ణుడు పెద్దవాడయిన తరువాత ఆ యశోదమాతను వదిలి వెళ్లాల్సి వచ్చింది. తన అసలు తల్లిదండ్రులైన దేవకీవసుదేవులతోనూ, స్నేహితులతోనూ, అతను మరో జీవితంలోకి ప్రవేశించాడు. అలా కృష్ణునికి దూరమైన యశోద ఆయన వివాహ వేడుకలను కూడా చూడలేకపోయిందట. చేతులెత్తి పెంచిన కృష్ణుని వివాహానికి హాజరై చేతులారా ఆశీర్వదించలేకపోయానే అని యశోదమ్మ ఎంతో వేదన చెందింది. మరి ఆ కృష్ణుడు తల్లివేదనను తీర్చకుండా ఉంటాడా! కలియుగంలో తాను అవతరించినప్పుడు, ఆమె చేతుల మీదుగానే వివాహం జరుగుతుందని ఊరడించాడు. కలియుగంలో కృష్ణుని కొలుచుకునేందుకు వకుళాదేవి రూపంలో శేషాద్రి కొండల మీద నివాసాన్ని ఏర్పరుచుకుని ఉండసాగింది యశోదమ్మ.
కలియుగంలో, తనమీద కోపంతో వైకుంఠాన్ని వీడిపోయిన లక్ష్మీదేవిని వెతుక్కుంటూ శ్రీకృష్ణుడు భూమి మీదకు రానే వచ్చాడు. ఆ సమయంలో గొల్లవారి పొరపాటు వలన ఆయనకు గాయమై తిరుగుతుండగా వకుళాదేవి కంటపడ్డాడు. అతనికి శ్రీనివాసుడని నామకరణం చేసి కన్నబిడ్డలా చూసుకోసాగింది వకుళాదేవి. ఇదిలా ఉండగా ఓరోజు అడవిలో, ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతిని చూశాడు శ్రీనివాసుడు. ఆమె లక్ష్మీదేవి అవతారమేననీ, వివాహమంటూ చేసుకుంటే ఆమెనే చేసుకుంటాననీ వకుళాదేవి దగ్గర వాపోయాడు. బిడ్డ మనసులోని మాట తెలుసుకున్న ఆ దేవి ఇంకెలా ఊరుకుంటుంది! వెంటనే ఆకాశరాజు దగ్గరకు వెళ్లి శ్రీనివాసుని నిజరూపాన్ని, ఆయన యోగ్యతనూ తెలియచేస్తూ పద్మావతితో ఆయన కళ్యాణాన్ని ఖాయపరుస్తుంది. ఆ తరువాత కథ అందరికీ తెలిసిందే! వకుళాదేవి కళ్ల ఎదుట అంగరంగవైభవంగా శ్రీనివాసుని వివాహం జరిగింది.
నిత్యమూ వకుళామాత తన బిడ్డకు తేనె కలిపిన అన్నాన్ని సిద్ధం చేసేదట. ఆయనకు ఏ ఆహారమంటే ఇష్టమో కనిపెట్టుకుని ఉండేదట. అందుకే ఇప్పటికీ తిరుమల ఆలయంలోని వంటశాలకు అభిముఖంగా ఈ మాత విగ్రహాన్ని చూడవచ్చు. తన బిడ్డకోసం నివేదించేందుకుగానూ జరిగే వంటలను ఈమె అలా పర్యవేక్షిస్తూ ఉంటుంది. శ్రీవారి ఆలయంలోనే కాకుండా, ఏడుకొండలకు దగ్గరలోనే పేరూరు అనే గ్రామంలో ఒక బండమీద వకుళామాత ఆలయం ఉంది. ఆ తల్లికి ఏడుకొండలూ నేరుగా కనిపించేలా ఈ ఆలయాన్ని నిర్మించారు. వందల సంవత్సరాలనాటి ఆలయం ఒకప్పడు ముస్లిం రాజుల దండయాత్రలకు గురై తీవ్రంగా దెబ్బతిన్నది. కానీ అంతకంటే దౌర్జన్యం ఆ తరువాత కాలంలోనే జరిగింది. రాతి కోసం పేరూరుబండను నిర్దాక్షిణ్యంగా తొలిచేశారు. ఇప్పుడు కేవలం అందులో 20 శాతం గుట్ట మాత్రమే నిలిచి ఉంది. శ్రీనివాసుని కన్నతల్లిలా ఆదరించిన వకుళామాతకే నిలువనీడ లేకపోయే రోజు వస్తుందేమో అని భయపడే పరిస్థితిలో ఇప్పుడు ఆ ఆలయం ఉంది.
- నిర్జర.