బ్రహ్మోత్సవాలలో ఆరవ రోజు సందర్భంగా- సుప్రభాత చరిత్ర!

 

 

బ్రహ్మోత్సవాలలో ఆరవ రోజు సందర్భంగా- సుప్రభాత చరిత్ర!

 

 

బ్రహ్మోత్సవాలలో ఆరవ రోజు ఉదయం శ్రీవారు, హనుమంత వాహనం మీద ఆశీనులవుతారు. త్రేతాయుగం నాటి నుంచి ఆ రాముని నిత్యం స్మరిస్తూ, తన గుండెల్లోనే గుడి కట్టుకున్నవాడు హనుమంతుడు. శ్రీనివాసుడు సాక్షాత్తూ ఆ రాముని అవతారమే అని గుర్తించి ఆయనకు సేవ చేసే అవకాశమే `హనుమంత వాహనం`. ఇక ఆరవ రోజున సాయంత్రం పుష్పకవిమానంలో ఊరేగిస్తారు. మూడేళ్లకి ఓసారి వచ్చే అధికనవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ సేవను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. అయిదురోజులుగా ఉత్సవాలలో అలసి సొలసిన శ్రీనివాసుని పుష్పకవిమానంలో ఊరేగింపు చేసి సేదతీరుస్తారు.

 

   ఇక ఈ రోజు సాయంత్రం గజవాహనం మీద స్వామివారు దర్శనమిస్తారు. ఎవరినైనా ఘనంగా గౌరవించాలనుకుంటే వారిని గజారోహణం చేయించి ఊరేగించడం మనకు పరిపాటి. మరి అంతటి గౌరవాన్ని అందుకునేందుకు తొలిఅర్హత కలిగినవాడు శ్రీనివాసుడే కదా! పైగా ఏనుగుని చూడగానే ఎవరికైనా గజేంద్రమోక్షం గుర్తుకురాక మానదు. భాగవతంలోని గజేంద్రమోక్ష ఘట్టంలో తన భక్తుడైన గజేంద్రుని రక్షించేందుకు విష్ణుమూర్తి పరుగుపరుగున భూలోకానికి చేరుకుంటాడు. అక్కడ మొసలి బారిన పడ్డ గజేంద్రుని రక్షించడమే కాకుండా, తనకి ముక్తిని సైతం ప్రసాదిస్తాడు. తన భక్తులను, లెక్కకు మించిన మొసళ్లతో నిండిన ఈ సంసారం నుంచి రక్షించి తిరిగి జన్మలేకుండా ముక్తిని ప్రసాదిస్తానని ఆ శ్రీనివాసుడు గజవాహనం మీద నుంచి చెబుతున్నాడు. మరి జగద్రక్షకుడైన ఆ శ్రీనివాసుడినే తన సుప్రభాతంతో మేల్కొలిపిన భక్తుడిని ఓసారి తల్చుకుందామా!

 

నిత్యం శ్రీవారి ఆలయంలోనూ, హైందవుల ఇళ్లలోనూ మార్మోగే సుప్రభాతానికి దాదాపు 600 ఏళ్ల చరిత్ర ఉంది. దీనిని `ప్రతివాద భయంకర అణ్ణంగార్‌`/ `అణ్ణన్‌ స్వామి` రచించారు. అణ్ణన్‌ స్వామి `ముడుంబై నంబి` వంశానికి చెందినవారు. వైష్ణవమత వ్యాప్తి కోసం రామానుజుల వారు నియమించిన 74 సింహాసనాధిపతులలో ముడుంబై నంబి ఒకరు. ఆయన వారసునిగా అనంతాచార్య, ఆండాళ్‌ దంపతులకు 1362లో జన్మించారు అణ్ణన్‌. కంచి తన జన్మస్థలం కావడంతో చిన్ననాటి నుంచే ఆయనకు ఆధ్యాత్మిక గ్రంథాలన్నా, వేదాంత చర్చలన్నా మహా ఆసక్తిగా ఉండేది. నారాయణాచార్య అనే గురువ దగ్గర అణ్ణన్‌ తన జ్ఞానాభివృద్ధిని సాధించాడు. ఒక పక్క గ్రంథపఠనం చేస్తూనే, వేదాంతానికి సంబంధించిన వాదప్రతివాదాలలో ఉద్ధండునిగా ఆరితేరాడు. అలాంటి ఓ సమయంలో అద్వైత పండితుడైన `నర్సింహ మిశ్రు`డిని ఓడించినందుకు ఆయనకు `ప్రతివాద భయంకర` అనే బిరుదుని అందించారు. అణ్ణన్‌ జ్ఞానానికి అచ్చెరువొందిన నర్సింహ మిశ్రుడు `హయగ్రీవదాసు`నిగా పేరు మార్చుకుని అణ్ణన్‌కు శిష్యునిగా చేరిపోయాడు.

 

తాను స్వయంగా గురువుగా గౌరవాన్ని పొందుతున్నప్పటికీ `మణవాళ మహాముని`కి శిష్యునిగా చేరాడు అణ్ణన్‌. శ్రీరంగం తన కార్యక్షేత్రంగా విశిష్టద్వైత సిద్ధాంతానికి తమిళనాట విస్తృతప్రచారాన్ని కల్పించినవారు మణవాళ మహాముని. సంస్కృత, తమిళ భాషలలో దాదాపు 19 గ్రంథాలను ఆయన రచించారు. అలాంటి మణవాళ స్వామి నుంచి ఆధ్యాత్మిక బోధలను గ్రహిస్తూ, వీలయినప్పుడల్లా వైష్ణవ పుణ్యక్షేత్రాలను దర్శించసాగాడు అణ్ణన్‌. అలా తిరుమలకు చేరుకున్న సమయంలో ఆ శ్రీనివాసుని దివ్యమంగళ రూపాన్ని చూసి అప్పటికప్పుడు రాసిందే సుప్రభాతం. ఆ తిరుమల వేంకటేశ్వరుని చూసి తరించి, సుప్రభాతాన్ని రచించడమే కాదు తన పెద్ద కుమారుడైన శ్రీనివాసాచార్యుని కూడా వేంకటేశ్వరుని సేవకు అంకితం కమ్మని ఆదేశించాడు.

 

అణ్ణన్‌ స్వామి రచనను వేంకటేశ్వరుని ఆలయంలో సుప్రభాతంగా స్వీకరించాలా వద్దా అన్న చర్చలు జరిగాయి. అయితే అణ్ణన్ రచనలోని భావగంభీరత, శబ్దసౌందర్యం గ్రహించినవారెవ్వరూ దానికి అడ్డుచెప్పలేకపోయారు. 1430 నుంచి నిరాటంకంగా ఈ సుప్రభాతం స్వామివారి సన్నిధిలో సాగుతూనే ఉంది. సుప్రభాతంతో పాటుగా శ్రీభాష్యానికీ, భాగవతానికీ వ్యాఖ్యానగ్రంథాలతో సహా అనేక పుస్తకాలను రాస్తూ, అనేకమంది శిష్యులకు ఆధ్యాత్మిక బోధను అందిస్తూ, ధార్మిక భావనలను ప్రచారం చేస్తూ తన 92వ ఏట 1454 సంవత్సరంలో వైకుంఠప్రాప్తిని పొందారు అణ్ణన్‌. అప్పటి నుంచీ బహుశా వైకుంఠంలో కూడా సుప్రభాతాన్ని ఆలపించడంలో నిమగ్నులై ఉండి ఉంటారు.

-నిర్జర.