కుబేరుడి గర్వమణిచిన గణేశుడు
కుబేరుడి గర్వమణిచిన గణేశుడు
వినాయకుడు అంటేనే జ్ఞానానికి ప్రతిరూపం. సకల సద్గుణాలకూ ప్రతిబింబం. అలాంటి గణేశుని ముందే అహంకారాన్ని ప్రదర్శిస్తే! తన హోదాను చూపించి చిన్నబుచ్చాలనుకుంటే...
సంపదకు అధిపతి అయిన కుబేరునికి ఓసారి తన వైభోగాన్నంతా దేవతలకు ప్రదర్శించాలన్న కోరిక మొదలైంది. అందుకోసం అంగరంగవైభోగంగా ఒక విందుని ఏర్పాటుచేశాడు. దానికి ముక్కోటి దేవతలనూ పిలవడం మొదలుపెట్టాడు. అలా శివుని కూడా తన విందుకి ఆహ్వానించేందుకు కైలాసాన్ని చేరుకున్నాడు కుబేరుడు. అక్కడ కొలువై ఉన్న శివపార్వతును దర్శించుకుని, వారిని తన విందుకి రమ్మని ఆహ్వానించాడు. కుబేరుని వాలకం, అతని మాటతీరు గమనించిన శివపార్వతులకు అతని ఆహ్వానం వెనుక ఉన్న దర్పం అర్థమైంది.
‘నీ విందుకి రావాలనే ఉంది. కానీ బహుశా వీలుపడకపోవచ్చు. అందుకని, మాకు బదులుగా మా కుమారుడు వినాయకుడిని పంపుతాము,’ అన్నాడు పరమేశ్వరుడు. ఆ మాటలకు కుబేరుడు కొంత నిరాశ చెందినా, గణేశుడు కూడా శివుని ప్రతినిధే కాబట్టి, ఆయన ముందు తన అలకాపురి వైభవాన్నంతా ప్రదర్శించాలని అనుకున్నాడు. విందురోజు రానేవచ్చింది. ఒకొక్కరుగా దేవతలంతా కుబేరుని రాజధాని అలకాపురికి చేరుకుంటున్నారు. వారికి తన రాజ్యంలోని సంపదనంతా చూపించి మురిసిపోతున్నాడు కుబేరుడు. ఆ సమయంలో గణేశుడు అలకాపురిలో ప్రవేశించాడు. గణేశుని చూసిన కుబేరుడు ఆయనను సకల మర్యాదలతో ఆహ్వానించి, తానే దగ్గరుండి మరీ తన వైభవాన్ని చూపించడం మొదలుపెట్టాడు. ఇంతలో విందు మొదలైంది....
విందుకోసం తయారుచేసిన వందలాది భక్ష్యలను చూడటంతోటే ఆహ్వానితుల కడుపు నిండిపోతోంది. వినాయకుడు మాత్రం తన ముందున్న ఆహారాన్ని చిటికెలో పూర్తిచేసి పారేశాడు. ఆపై తనకి ఎంత వడ్డిస్తే అంత ఆహారాన్నీ కళ్లుమూసి తెరిచేంతలో ఆరగించడం మొదలుపెట్టాడు. వినాయకుడికి మరింత ఆహారాన్ని అందించేందుకు సేవకులంతా అటూఇటూ పరుగులు పెట్టడం మొదలుపెట్టాడు. వందలాదిమంది కోసం వండిన ఆహారమంతా వినాయకుడి ఆకలిని తీర్చలేకపోయింది. రాజ్యంలో ఎక్కడెక్కడ ఉన్న ఆహారాన్ని తీసుకువచ్చి వడ్డించినా ఉపయోగం లేకుండా పోయింది. ముక్కోటి దేవతల సాక్షిగా, కుబేరుడు వినాయకుని ఆకలిని తీర్చలేక నిస్సహాయంగా నిల్చుండిపోయాడు. ఆకలి తీరని వినాయకుడు మాత్రం తన ముందు ఏది కనిపిస్తే దాన్ని గుటుక్కుమనిపించేయడం మొదలుపెట్టాడు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తన అలకాపురి రాజ్యం మొత్తం, వినాయకుని ఆకలికి ఆజ్యమైపోతుందని అర్థమైపోయింది కుబేరునికి. వెంటనే పరుగులెత్తుకుంటూ కైలాసానికి చేరుకున్నాడు. జరిగినదంతా శివునికి వివరించి శరణువేడుకున్నాడు. ‘నాకు బుద్ధి వచ్చింది. ముల్లోకాలకూ అధిపతివైన నీ ముందే నా దర్పాన్ని ప్రదర్శించాలనుకున్నాను. ఇప్పుడు నా అస్తిత్వానికే ముప్పు వచ్చింది. దయ ఉంచి నన్ను రక్షించు,’ అంటూ సాగిలపడ్డాడు.
కుబేరుని బేల మాటలు విన్న శివుడు చిరునవ్వుతో, ‘భక్తి, వినయాలతో ఒక గుప్పెడు మెతుకులను గణేశునికి అర్పించినా అతని ఆకలి తీరుతుంది. దర్పంతో తన కడుపు నింపాలనుకుంటే మాత్రం సాధ్యం కాదు,’ అంటూ ఒక గుప్పెడు మెతుకులను ఆయన చేతిలో వేశాడు.
పరమేశ్వరుడు అందించిన ఆ గుప్పెడు మెతుకులను చేతపట్టుకుని పరుగుపరుగున అలకాపురికి చేరుకున్నాడు కుబేరుడు. అక్కడ తన ఆకలితో ఏకంగా అలకాపురినే భక్షించేందుకు సిద్ధంగా ఉన్న వినాయకునికి చేతులు జోడించి, శివుడు అందించిన గుప్పెడు మెతుకులను ప్రసాదంగా అర్పించాడు. ఆ గుప్పెడు మెతుకులతో వినాయకుని ఆకలి తీరిపోయింది. గణేశుని ఆకలితో చిన్నాభిన్నమైపోయిన తన రాజ్యాన్నీ, చిన్నబోయిన తన పరివారాన్నీ చూసుకుని కుబేరుడు స్థాణువై ఉండిపోగా... వినాయకుడు మాత్రం బొజ్జను తడుముకుంటూ, చిరునవ్వుతో కైలాసానికి బయల్దేరాడు.
ఎంతటివారికైనా గర్వం పనికిరాదన్న నీతి ఈ కథలో కనిపిస్తుంది. అంతేకాదు! దర్పంతో కాకుండా భక్తితోనే ఆ గణపతి మనసుని జయించగలమన్న బోధా వినిపిస్తుంది.
- నిర్జర.